Share News

ఇంకా పొలాల్లోనే ఇసుక మేటలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:00 AM

అకాల వర్షాలు రైతులను కకావికలం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆగస్టు 30, సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు, ముక్త్యాల బ్రాంచ్‌ కాల్వకు గండ్లు పడ్డాయి.

ఇంకా పొలాల్లోనే ఇసుక మేటలు
హుజూర్‌నగర్‌, బూరుగడ్డలో పంట పొలాల్లో ఇసుక మేటలు

దిక్కుతోచని స్థితిలో ఆయకట్టు రైతులు

వరదలతో వానాకాలం అంతా ఆగమాగం

అకాల వర్షాలు రైతులను కకావికలం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆగస్టు 30, సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు, ముక్త్యాల బ్రాంచ్‌ కాల్వకు గండ్లు పడ్డాయి. అధికారులు గండ్లు పూడ్చి పంటలకు నీరు సరఫరా చేస్తున్నారు. అయితే నడిగూడెం మండలంలో గండి పడిన కాగితరాంచంద్రాపురం ప్రాంతంలోని రైతుల పరిస్థితి దీనంగా మారింది. కొద్దిరోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట వరదల్లో కొట్టుకుపోయింది. సాగు కోసం ఎకరానికి రూ.20 వేల చొప్పున చేసిన ఖర్చు రైతు నెత్తినపడింది. ఆర్థికంగా చికితిపోయిన రైతులు వరదలతో పొలాల్లో వేసిన ఇసుక మేటలు తీయలేక అలానే వదిలేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించిన ప్రభుత్వం, ఇసుక మేటలతో దెబ్బతిన్న పంటలకు మాత్రం అందించలేదు.

(ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్‌)

జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో సెప్టెంబరు 1న కురిసిన వర్షాలకు సుమారు 10 వేల ఎకరాలకు పైనే పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా నాగా ర్జునసాగర్‌ ఎడమకాల్వకు, చెరువులకు గండ్లు పడ్డాయి. ముఖ్యంగా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం సమీపంలోని ఎడమ కాల్వ 132వ కిలోమీటర్‌ వద్ద భారీ గండిపడింది. దాంతో పాటు ఎడమకాల్వకు అనుసంధానమైన ముక్త్యాల బ్రాంచ్‌ కాల్వ 14.63వ కిలోమీటర్‌ వద్ద గండిపడి వందల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఎంబీ కెనాల్‌ 22వ కిలోమీటర్‌ వద్ద ఆధునికీకరణ పనులు చేసిన చోట కోతకు గురికాగా 24వ కిలోమీటర్‌ వద్ద మరో గండిపడింది. 14.63 కిలోమీటర్‌ వద్ద పడిన గండితో కరక్కాయలగూడెం, మర్రిగూ డెం, బూరుగడ్డ, గోపాలపురం, లింగగిరి, శ్రీనివాసపురం, అమరవరం, యాతవాకిళ్ల ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. నడిగూడెం మండలం కాగితరాంచంద్రాపురం వద్ద గండితో రత్నవరం, నడిగూడెం ప్రాం తాల్లో రెండు వేల ఎకరాలపైనే పంట నష్టం జరగ్గా అధికారులు మాత్రం 210ఎకరాలకు మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదికలు అందించారని రైతులు వాపోతున్నారు.

ఇదిలా ఉండగా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు, కోదాడ మండలం తొగర్రాయి తదితర గ్రామాలతో పాటు హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల్లో పంట నష్టం జరిగింది. హుజూర్‌నగర్‌ డివిజన్‌లో 13వేల ఎకరాల్లో వరదలతో పంట నష్టం వాటిల్లగా కేవలం 4,800 ఎకరాలకు మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేశారు. కాగా జిల్లాలో సుమారు 24వేల ఎకరాలపైన పంట నష్టం జరిగినట్లు రైతు సంఘాలు పేర్కొంటుండగా, 33 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు అంచనావేసిన పంటలకు మాత్రమే నష్టపరిహారం అందించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 9,800 ఎకరాల్లో వరద నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 10,993 మంది రైతులకు సుమారు రూ.9.80 కోట్లు విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు.

ఇసుక మేటలు వేసిన వారి సంగతి

జిల్లాలోని వరదలతో పొలాలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు అందించి ఆదుకున్నారు. కాగా ఇసుక మేటలు వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ రైతులను కూడా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 10వేల ఎకరాలలో వరద నష్టం జరిగింది. కాగా ఇసుక మేట వేసిన పంట పొలాలు ఈ ఏడాది మొత్తం పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక మేటలు వేసి పంట ఆనవాళ్లు లేకుండాపోయాయి. ముఖ్యంగా హుజూర్‌నగర్‌, కోదాడ డివిజన్లలోని అనేక గ్రామాలలో నేటికీ పంట పొలాలు ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. కాగా ఆ పంట పొలాలు బాగుచేయాలంటే ఎకరానికి రూ.30 నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద సహాయం కింద రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇసుక మేటలు తొలగించు కునేందుకు ప్రభుత్వం ఎలాంటి సహా యం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇప్పటికే ఖరీ్‌ఫలో ఎకరానికి రూ.20వేల పైనే ఖర్చు చేసి సాగుచేశారు. అందులోనూ పంట మొత్తం వరదపాలు కాగా ఇసుక మేటలు ఆ రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ఇసుక మేటలు తొలగించి పొలాల్లో మట్టిని తరలించి మడులు కట్టాలంటే కనీసం ఎకరానికి రూ.30వేల పైనే ఖర్చవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఒక్క కాగితరాంచంద్రాపురంలోనే

నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం ఎడమ కాల్వ 132వ కిలోమీటర్‌ వద్ద గండి పడగా సుమారు 50 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. కాగా ఇప్పుడు కాల్వ గండి పూడ్చిన అధికారులు పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలకు నష్టపరిహారం అందించలేదు. దీంతో ఆ ప్రాంత రైతులు పొలాల్లోని ఇసుకను అవసరం ఉన్న వారికి విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు నడిగూడెం మండల రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని పేర్కొంటున్నారు. వరదలతో పంటలు కోల్పోయి, పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వేసిన పంటలు చేతికి రాకపోవడంతో వరదనీటిలో చిక్కిన రైతులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పంట నష్టపోయి ఇసుక మేటలు వేసిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం

జిల్లాలో ఇసుక మేట వేసిన రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. 10వేల మంది రైతులకు సుమారు రూ.10 కోట్లు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందజేశాం. రైతుల అకౌంట్లలో నిధులు జమచేశాం. ఇసుక మేట వేసిన రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఫశ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

Updated Date - Oct 23 , 2024 | 01:01 AM