నాలుగో విడత రుణమాఫీ ఏదీ?
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత ప్రకటించిన రుణమాఫీ నిధులు ఇంకా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. రుణమాఫీ కోసం రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రకటనలకే పరిమితం
బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
ఉమ్మడి జిల్లాలో 48,196 మంది అర్హులు
మాఫీ కావాల్సిన మొత్తం రూ.508.47కోట్లు
(ఆంధ్రజ్యోతి, మోత్కూరు): రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత ప్రకటించిన రుణమాఫీ నిధులు ఇంకా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. రుణమాఫీ కోసం రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకా మాఫీ సొత్తు రాలేదని బ్యాంకర్లు సమాధానమిస్తుండటంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.
పట్టాదారు రైతు పేరు, ఆధార్ నంబర్‌లో తప్పుగా ఉండటం, రేషన్‌కార్డు లేకపోవడం, ఒకే ఆధార్ నంబర్ ఇద్దరి పేరున ఉండ టం లాంటి కారణాలతో పలువురు రైతులకు మూడు విడతల్లో రుణమాఫీ నిలిచిపోయింది. అయితే వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకం గా రైతు సదస్సులు నిర్వహించి, తప్పులు సవరించడంతో పాటు ఏవోలు రైతు కుటుంబాల ఫొటోలు తీసి ఆన్‌లైన్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. వారందరికీ ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్టు గత నెల 29వ తేదీన ప్రకటించింది. రుణమాఫీ పొందనున్న అర్హులైన రైతుల జాబితాలను వ్యవసాయశాఖ కూడా విడుదల చేసింది. అందులోనూ కొందరి అర్హుల పేర్లు లేవు. ఇదిలా ఉం టే ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించి 25 రోజులు అవుతున్నా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ప్రస్తుతం యాసంగి వరినాట్ల సీజన్ ముమ్మరమైంది. దీంతో రైతులు దున్నకా లు, ఎరువులు వేయడం, నాట్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పెట్టుబడులకు డబ్బు అవసరం. ప్రభుత్వం రుణమాఫీ నిధు లు జమ చేస్తే బ్యాంకు అప్పు తీరుతుంది. దీంతో రైతు లు తిరిగి మళ్లీ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులు భూ విస్తీర్ణాన్ని బట్టి ఎక్కువ రుణం కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వ మాఫీతో అప్పు తీరితే కొత్తగా రుణం తీసుకుని వ్యవసాయ పెట్టుబడులకు వినియోగించవచ్చని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రామాల నుంచి రైతులు ప్రతి రోజూ మండల కేంద్రాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ నిధులు జమ అయ్యాయా? అని సిబ్బందిని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం నిధులు జమ చేయకపోవడం, రైతులు పదేపదే వచ్చి అడుగుతుండటంతో బ్యాంకు సిబ్బంది విసుక్కుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 48,196 మంది
యాదాద్రి జిల్లాలో నాలుగో విడత 11,691 మం ది రైతులకు రూ.111.65కోట్లు, నల్లగొండ జిల్లాలో 21,495 మంది రైతులకు రూ.236.85 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 15,010 మంది రైతులకు రూ.159.97కోట్ల చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 48,196 మంది రైతులకు రూ.508.47కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించి 25 రోజులైనా నేటికీ రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. గత మూడు విడతల్లో యాదాద్రి జిల్లాలో 68,584 మంది రైతులకు రూ.553.82కోట్లు, సూర్యాపేట జిల్లాలో 1,12,259 మంది రైతులకు రూ.845.05కోట్లు, నల్లగొండ జిల్లాలో 2,12,486 మంది రైతులకు రూ.1,767.98 కోట్ల రుణమాఫీ జరిగింది. నల్లగొండ జిల్లాలో మొదటి విడతలో 1,05,197మంది రైతులకు రూ.579.14కోట్లు, రెండో విడతలో 63,014 మంది రైతులకు రూ.632.92కోట్లు, మూడో విడతలో 44,275మందికి రూ.555.92కోట్లు రుణమాఫీ జరిగింది. అయితే వెంటనే నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
తప్పులు సవరించినా
ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో రుణమాఫీకి నోచుకోని రైతుల తప్పులను వ్యవసాయశాఖ అధికారులు సవరించి ప్రభుత్వానికి నివేదించినా నాలుగో విడత రుణమాఫీ కాలేదు. రూ.2లక్షల పైన రుణం ఉన్న రైతులకు కూడా రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని, మిగతా రుణాన్ని రైతులు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించింది. అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన నీలగిరి శ్రీనివాస్ ఏపీజీవీబీలో రూ.52,900 రుణం తీసుకున్నాడు. అతడి ఆధార్ నంబరు మరో రైతుకు రాయడంతో ప్రభుత్వం మూడు విడుతలు చేసిన రుణమాఫీలో అతడి పేరు లేదు. ఆధార్ నంబర్ సరిచేయించినా నాలుగో విడత కూడా తనకు రుణమాఫీ కాలేదని ఆ రైతు వాపోతున్నాడు. ఇలానే చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదంటున్నారు. ఇదిలా ఉంటే రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం నిధులు జమ చేయకుండా నిలుపుదల చేసినట్టు సమాచారం. రుణమాఫీకి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులుగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదలచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది రూ.2లక్షల రుణమాఫీ జాబితాలో ఉండటంతో ఈ విడత నిలిపి, వారి పేర్లను తొలగించిన తరువాతనే నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
నాలుగో విడత రుణమాఫీ కాలేదు : నీలగిరి శ్రీనివాసులు, రైతు, లక్ష్మీదేవికాల్వ
నాకు అడ్డగూడూరు ఏపీజీవీబీలో రూ.52, 900 పంట రుణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ప్రకటించిన రూ.లక్షలోపు రుణమాఫీలో నాకు మాఫీ కాలేదు. దీంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా నా ఆధార్ నంబర్ మరో రైతుకు రాశారు. దాన్ని సరిచేయిం చా. అయినా మూడు, నాలుగో విడతలోనూ నాకు రుణమాఫీ రాలేదు. మా గ్రామంలో ఆదాయం పన్ను చెల్లింపుదారులకు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా మాఫీ వచ్చింది. వ్యవసాయం చేసుకునే నాకు రాకపోవడం విచిత్రంగా ఉంది. ప్రభుత్వం నాకు రుణమాఫీ వర్తింపజేయాలి.
ఇంకా మాఫీ కాలేదు : ఎస్‌కే.ఉస్మాన్, కాశివారిగూడెం,తిప్పర్తి మండలం
ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ ప్రకటించినా నేటికీ మాఫీ కాలే దు. ప్రభుత్వం ప్రకటించి 25రోజులు దాటగా, రోజూ బ్యాంకు వద్దకు వెళ్లడం, వారు జమ కాలేదని చెప్పడం పరిపాటిగా మారింది. రుణమాఫీ ఆలస్యం అవుతుండడంతో కొత్త రుణాలు తీసుకోలేకపోతు న్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే రుణమాఫీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి : యానాల దామోదర్‌రెడ్డి, రైతు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
ప్రభుత్వం గత నెల 29న నాలుగో విడత రూ.2లక్షల లోపు రుణమాఫీ చేసి, నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. లబ్ధిదారుల జాబితాలూ విడుదల చేసింది. నేటికీ రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ కాలేదు. యాసంగి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయాలి. అప్పు తీరితే రైతులు మళ్లీ రుణం పొందే అవకాశముంటుంది. రూ.2లక్షల పైన బాకీ ఉన్న రైతులకు కూడా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. రూ.2లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. రూ.2లక్షలపైన పంట రుణాలు ఉన్న రైతులకు కూడా మాఫీ వర్తింపజేయాలి.
అత్యధికంగా రుణమాఫీ జరిగింది : పి.శ్రవణ్‌కుమార్, నల్లగొండ జేడీఏ
జిల్లాలో అత్యధికంగా రుణమాఫీ జరిగింది. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ జరగనుంది. సాంకేతిక సమస్యలతో ఇంకా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ పూర్తిచేయడమే కాకుండా నాలుగో విడతలో 21,495 ఖాతాలకు రూ.236.85కోట్లు విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా 2,33,981 ఖాతాలకు నాలుగు విడతల్లో రూ.2004.83కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.