సత్వరమే దరఖాస్తులు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:52 AM
ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో పలు సమస్యలకు సంబంధించిన 35 దరఖాస్తులను ప్రజలనుంచి స్వీకరించారు.
కలెక్టర్ హనుమంతు కే.జెండగే
భువనగిరి కలెక్టరేట్, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో పలు సమస్యలకు సంబంధించిన 35 దరఖాస్తులను ప్రజలనుంచి స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందిన 26, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 3, జిల్లా సంక్షేమ శాఖ 4, విద్యాశాఖ, జిల్లా పంచాయతీ, వైద్యశాఖకు చెందిన ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ పి బెన్‌షాలోమ్, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జగన్‌మోహన్ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగుడికి వీల్‌చైర్ అందించాలి
తన మనుమడు నమిల గణేశ్ పుట్టినప్పుటి నుంచి దివ్యాంగుడని ప్రభుత్వం తరఫున బ్యాటరీతో నడిచే వీల్‌చైర్‌ను అందజేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన రాజయ్య కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సత్వరమే స్పందించి చైల్డ్ వెల్ఫేర్ అధికారికి వీల్ చైర్ అందించాలని ఆదేశించారు.
స్వీపర్లకు కనీస వేతనం ఇవ్వాలి..
తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో చాలా సంవత్సరాలుగా వారసత్వంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని స్వీపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కౌసల్య శంకరమ్మ కలెక్టర్‌ను కోరారు. ప్రజావాణిలో సోమవారం జిల్లాలో పనిచేస్తున్న స్వీపర్లతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారసత్వంగా సుమారు 40 ఏళ్లు పని చేస్తూనే ఉన్నామని, కేవలం రూ.1500 మాత్రమే ఇస్తూ, అది కూడా ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని కోరారు.
రైతు రుణమాఫీ చేయాలి
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సాంకేతిక కారణాల సాకుతో 50శాతం మందికి పైగా రైతులకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరు రాజయ్య డిమాండ్‌చేశారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు అంజయ్య, దయాకర్‌రెడ్డి, రైతులు సత్తయ్య, ఆంజనేయులు, యాదయ్య, రవికృష్ణ తదితరులున్నారు. అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలకు చెందిన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వని యాదగిరిగుట్ట గోశాల పాఠశాల హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్ కాంట్రాక్టర్ మహేందర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.