ఏటీఎం పగలగొట్టి చోరీ: రూ.22లక్షలు అపహరణ
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:46 AM
ఏటీఎం పగులగొట్టి అందులోని రూ.22లక్షలను దొంగలు అపహరించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో చోటుచేసుకుంది.
దామరచర్ల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం పగులగొట్టి అందులోని రూ.22లక్షలను దొంగలు అపహరించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దామరచర్ల మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎం సెంటర్‌లో గుర్తు తెలియని దొంగలు కారులో గ్యాస్ కట్టర్లను తీసుకొని వచ్చి చొరబడ్డారు. తొలుత ముసుగు ధరించిన ఓ దొంగ సీసీ కెమెరాపై నలుపురంగు స్ర్పే చేశాడు. అనంతరం మరికొంతమంది కలిసి ఏటీఎంలోకి ప్రవేశించి షట్టర్‌ను కిందకు దింపి గ్యాస్ కట్టర్‌తో నగదును నిల్వ ఉంచే ప్రాంతాన్ని కట్ చేశారు. అందులోని నగదును చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. ఈ ఏటీఎంను ముంబైకు చెందిన ఫైనాన్స అండ్ సాఫ్ట్‌వేర్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ ఘటన 3.30గంటలకు జరగగా, 4.20గంటలకు స్థానిక పోలీసులకు నిర్వహణ సంస్థ సమాచారం అందించింది. సాంకేతిక లోపంతో అలారం ఆలస్యంగా మోగినట్టు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే దొంగలు నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరతచంద్రపవార్ శనివారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ చోరీ ఘటనను పోలీసులు సీరియ్‌సగా తీసుకొని ప్రత్యేక బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు.