Share News

దేశసేవలో భాగమై.. అనారోగ్యంతో పోరాడి..

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:52 AM

దేశ సేవ చేయాలనే సంకల్పం... సోదరుడి స్ఫూర్తితో అగ్నివీర్‌గా ఎంపికై అసోంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ యువకుడు అనారోగ్యంతో కన్నుమూశాడు.

దేశసేవలో భాగమై.. అనారోగ్యంతో పోరాడి..
మహేష్‌(ఫైల్‌ఫొటో)

అసోంలో ఆర్మీ అగ్నివీర్‌ మృతి

స్వగ్రామం నల్లగొండ జిల్లాలో విషాదఛాయలు

నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

హాలియా, జూలై 26: దేశ సేవ చేయాలనే సంకల్పం... సోదరుడి స్ఫూర్తితో అగ్నివీర్‌గా ఎంపికై అసోంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ యువకుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ అగ్నివీర్‌ ఈరేటి మహే్‌షయాదవ్‌(24) అసోం రాష్ట్రంలో గురువారం రాత్రి మృతి చెందారు. 2022లో ఆర్మీ అగ్నిపథ్‌కు ఎంపికై అసోం రాష్ట్రంలోని దబీర్‌ఘాట్‌ ప్రాంతంలో భద్రత దళాల్లో విఽధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తీవ్ర జ్వరం, ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన మహే్‌షను అధికారులు సైనిక ఆస్పత్రికి తరలించగా అక్కడ వారం రోజులు వైద్యచికిత్సలు చేశారు. పరిస్థితి విషమించడంతో మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా 17రోజులపాటు అనారోగ్యంతో పోరాడి గురువారం రాత్రి మృతి చెందాడు.

సోదరుడి స్ఫూర్తితో అగ్నివీర్‌గా ఎంపికై...

వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న ఈరేటి యాదయ్య, పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా మొదటి కుమారుడు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు నరేష్‌ ఆర్మీలో ఉండగా, మహేష్‌ మూడో కుమారుడు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన మహేష్‌ ఎనసీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందాడు. క్రీడలపై మక్కువతో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన(బీపీఈడీ) పూర్తిచేశాడు. మహే్‌షయాదవ్‌ అన్న ఈరేటి నరేష్‌ 2019లో రక్షణరంగం(ఆర్మీ)లో చేరి జమ్ముకశ్మీర్‌లోని మహార్‌లో విఽఽధులు నిర్వహిస్తున్నాడు. సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో మహేష్‌ 2022 సంవత్సరంలో అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్‌గా ఎంపికై అసోంలో విధులు నిర్వరిస్తున్నాడు.

15 రోజుల కిందట తల్లితో మాట్లాడి..

ఆరు నెలల క్రితం స్వగ్రామం మదారిగూడెం వచ్చి వెళ్లిన మహే్‌షయాదవ్‌ 15రోజుల క్రితం తల్లితో ఫోనలో మాట్లాడాడు. కశ్మీర్‌లో ఉంటున్న సోదరుడి భార్య ప్రసవం కోసం మదారిగూడెం రావటంతో ఆ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. సోదరుడు నరేష్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో విధుల్లో ఉన్నారు.

నేడు మృతదేహం రాక

ఆర్మీ అగ్నివీర్‌ మహేష్‌ మృతదేహాన్ని అసోం రాష్ట్రం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆర్మీ అధికారులు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకురానున్నారు. అక్కడ వారి లాంఛనాలు పూర్తి చేసి శనివారం ఉదయం స్వగ్రామం మదారిగూడెం గ్రామానికి తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. దేశానికి సేవ చేస్తానంటే ప్రోత్సహించి పంపిస్తే విగతజీవిగా తిరిగివస్తున్నాడంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం గ్రామంలో మహే్‌షయాదవ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 7 గంటలకు హాలియా సెంటర్‌ నుంచి మదారిగూడెం వరకు మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఇంటి వద్ద అధికారులు, ప్రముఖులు నివాళులర్పించనున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:52 AM