Share News

రాష్ట్రానికి ఐకానగా భువనగిరి ఖిల్లా

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:51 AM

తెలంగాణ పర్యాటక రంగంలో భువనగిరి ఖిల్లా ఐకానగా మారనున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రానికి ఐకానగా భువనగిరి ఖిల్లా
అభివృద్ధి పనుల నమూనాను ఎమ్మెల్యేకు వివరిస్తున్న పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌

త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం: ఎమ్మెల్యే కుంభం

భువనగిరి టౌన, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి)ః తెలంగాణ పర్యాటక రంగంలో భువనగిరి ఖిల్లా ఐకానగా మారనున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వదేశి దర్శన పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లాపై చేపట్టనున్న అభివృద్ధి పనులపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో రూ.100 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మలి విడతలో మరిన్ని నిధులు రానున్నట్లు తెలిపారు. డీపీఆర్‌ చేపట్టబోయే పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతిపాదిత పనులన్నీ త్వరలోనే చేపట్టాలని, ఖిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. తెలంగాణలోనే మొట్టమొదటి రోప్‌వే భువనగికి ఖిల్లా పైకి నిర్మించడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే భువనగిరి పరిసరాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. కలెక్టర్‌ హనుమంతు కె జెండగే మాట్లాడుతూ ఖిల్లా అభివృద్ధి పనులకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. అభివృద్ధి పనులతో దేశ పర్యాటక రంగంలో భువనగిరికి శాశ్వత స్థానం లభిస్తుందన్నారు. ఇప్పటికే రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌తో పర్వతారోహణ రంగంలో భువనగిరి ఖిల్లాకు విశేష ప్రాధాన్యత లభించిందన్నారు. ముందుగా భువనగిరి ఖిల్లాను సందర్శించి చేపట్టబోయే పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ చైర్మన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌ మందడి ఉపేందర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ పి.రామాంజల్‌రెడ్డి, తహసీల్దార్‌, శ్రీకాంతరెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.ధనాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:51 AM