నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:31 AM
హెచ్‌ఐవీ (ఎయిడ్స్) సమాజాన్ని వణికించింది. గతంలో అవగాహన లేక ఎక్కువ మంది వ్యాధిగ్రస్థులు ఉండేవారు. హెచ్‌ఐవీ శారీరక సంబంధాలతో వ్యాపించే వ్యాధి కావడంతో ఎవ్వరికీ చెప్పుకోలేక, అవగాహన లేక వ్యాధి తీవ్రత ఎక్కువై మృత్యు ఒడికి చేరినవారు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 11,933 మంది హెచ్‌ఐవీ బాధితులు
ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎయిడ్స్
నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట(కలెక్టరేట్): హెచ్‌ఐవీ (ఎయిడ్స్) సమాజాన్ని వణికించింది. గతంలో అవగాహన లేక ఎక్కువ మంది వ్యాధిగ్రస్థులు ఉండేవారు. హెచ్‌ఐవీ శారీరక సంబంధాలతో వ్యాపించే వ్యాధి కావడంతో ఎవ్వరికీ చెప్పుకోలేక, అవగాహన లేక వ్యాధి తీవ్రత ఎక్కువై మృత్యు ఒడికి చేరినవారు ఉన్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఎయిడ్స్‌ను అంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హెచ్‌ఐవీ దరిచేరకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించింది. వ్యాధిగ్రస్థులు సైతం ముందుకు వచ్చి చికిత్స తీసుకోవడం ప్రారంభించారు. క్రమంగా హెచ్‌ఐవీ ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయితే ఇటీవల ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో నూతనంగా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. డిసెంబరు 1 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 11,933 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో 6,910 మంది, సూర్యాపేట జిల్లాలో 4,019 మంది, యాదాద్రి జిల్లాలో 1,004 మం ది ఉన్నారు. వీరందరికీ ఏఆర్‌టీ కేంద్రాల ఆధ్వర్యంలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు నల్లగొండ జిల్లాలో 42,539 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 277 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. సూర్యాపే ట జిల్లాలో 21,496 మందికి పరీక్షలు నిర్వహించగా 153 మంది కి, యాదాద్రి జిల్లాలో 24,318 మందికి పరీక్షలు చేయగా 90 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ తేలింది.
హెచ్‌ఐవీ బాధితులకు ఆసరాగా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెచ్‌ఐవీ బాధితులకు ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆసరాగా ఉంటోంది. బాధితుల్లో పేదలు ఉంటే వారికి ప్రభుత్వం ఆసరా ఫించన్ ఇస్తోంది. నల్లగొండ జిల్లాలో 2,016 మందికి, సూర్యాపేట జిల్లాలో 1,209 మందికి, యాదాద్రి జిల్లాలో 327 మంది హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం ఆసరా ఫించన్లు నెలనెలా ఇస్తోంది. వీరేగాక గర్భిణులకు పరీక్షలు చేయగా నల్లగొండ జిల్లాలో 30 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. వారికి వైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసవాలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 15 మంది గర్భిణులు, యాదాద్రి జిల్లాలో 12 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసవాలు చేయించారు. అంతేగాక పుట్టిన పిల్లలకు హెచ్‌ఐవీ రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా న్యాయసేవా సదన్ సహకారంతో పడుపు వృత్తి, స్వలింగ సంపర్కుల్లో రేషన్‌కార్డులు లేని వారికి ఒక్కొక్కరికి 10కి లోల చొప్పున ఉచిత బియ్యం ప్రభు త్వం పంపిణీచేస్తోంది. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా వచ్చిన వారు కొంతకాలం వరకు మందులు వాడి బంద్ చేసినా, వారిని తిరిగి గుర్తించి మందులు అందజేస్తున్నారు.
సంచార సురక్ష పరీక్షా కేంద్రాల ఆధ్వర్యంలో
ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సంచార సమీకృత పరీక్షా కేంద్రాల ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు నల్లగొండ జిల్లాలో 3,163 మంది సుఖవ్యాధి గ్రస్థులకు పరీక్షలు నిర్వహించి అందులో 2,514 మందికి సుఖవ్యాధులు ఉన్నట్టు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా 3,470 మంది సెక్స్ వర్కర్లకు, 1,528 మంది స్వలింగ సంపర్కులకు ప్రతీ మూడు నెలలు, ఆరు నెలలకు పరీక్షలు చేయిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 1,797 మంది సుఖవ్యాధిగ్రస్థులు ఉండగా, వారిలో 1,646 మందికి చికిత్సలు, 2,600 మంది సెక్స్ వర్కర్లు, 27 మంది స్వలింగ సంపర్కులు, యాదాద్రి జిల్లాలో 1,624 మంది సుఖ వ్యాధిగ్రస్థుల్లో 1,317 మందికి చికిత్సలు, 4,124 మంది సెక్స్ వర్కర్లు, 406 మంది స్వలింగ సంపర్కులకు ప్రతీ మూడు నెలలు, ఆరు నెలలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వ్యాధికి దూరం ఇలా..
హెచ్‌ఐవీ బాధితులు వ్యాధిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ప్రతీ రోజు యోగా, వ్యాయామం చేయడంతో పాటు పౌష్ఠికాహారం తీసుకోవాలి. హెచ్‌ఐవీ వైరస్ శరీరంలోని రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకోసం రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లను కచ్చితంగా మానుకోవాలి. లైంగిక సంపర్కంలో పాల్గొనే సమయంలో విధిగా కండోమ్ వినియోగించాలి.
పూర్తిగా రూపుమాపేందుకు కృషి
సుధాకర్, నల్లగొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తున్నాం. గతం కంటే ప్రస్తుతం పాజిటివ్ శాతం తగ్గింది. ప్రతీ ఒక్కరు విధిగా ఆరు నెలలకోసారి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిబారిన పడిన బాధితులు భయాందోళనకు గురికావొద్దు. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధిని నయం చేసుకోవ చ్చు. ఎయిడ్స్ వ్యాధిపై గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల్లో కళాజాతాల ద్వారా, వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తున్నాం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు ఇలా..
జిల్లా ఈ ఏడాది ఏప్రిల్- గుర్తించిన మొత్తం
అక్టోబరు వరకు హెచ్‌ఐవీ హెచ్‌ఐవీ
చేసిన పరీక్షలు కేసులు బాధితులు
నల్లగొండ 42,539 277 6,910
సూర్యాపేట 21,496 153 4,019
యాదాద్రి 24,318 90 1,004
మొత్తం 88,353 520 11,933