క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:16 AM
దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరొందిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది.
ప్రత్యేక అలంకరణలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు
మఠంపల్లిలో రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
మఠంపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరొందిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించే మహోత్సవాలకు దేవాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. పరవళ్లు తొక్కే కృష్ణానదీ తీరాన వెలసిన శుభవార్త దేవాలయం మరియమాత దీవెనలతో విరాజిల్లుతోంది. ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తూ మరియమాత దీవెనలు పొందుతుంటారు. ఈ లోకానికి రక్షకుడిని అందించిన తల్లిగా భక్తుల బాధలను, వ్యాధులను, ఇతర సమస్యలను తన కుమారుడిని ప్రార్థించే వారి అవసరాలు తీర్చే తల్లిలా ఆమె ప్రసిద్ధి. శుభవార్త దేవాలయం(మంగళవార్త చర్చి) 1968లో నిర్మించారు. అనంతరం పునర్నిర్మాణంలో భాగంగా 1980లో శంకుస్థాపన చేయగా 1993వ పూర్తి చేశారు. అప్పటివరుకు మంగళవార్త చర్చిగా పిలవబడుతున్న దేవాలయానికి శుభవార్త దేవాలయంగా నామకరణం చేశారు. వేడుకలకు గ్రామానికి చెందిన క్రైస్తవ కుటుంబీకులతో పాటు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లోని బంధువులు హాజరవుతుంటారు. రెండు రోజుల పాటు జరిగే వేడుకల వివరాలను విచారణ గురువు మార్టిన్ పసల శుక్రవారం ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు నవదిన జపములు, దివ్యబలిపూజ కార్యక్రమాలు, క్రైస్తవ భక్తులను ఉద్దేశించి ప్రసంగం, పండగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 25న జరిగే శుభవార్త చర్చి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రముఖులు, గురువులు, బిష్‌పలతో పాటు విదేశాల్లోని క్రైస్తవులు కూడా హాజరై ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
మర్రిగూడ మండలంలో
మర్రిగూడ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : క్రైస్తవుల ఆరాధ్య దైవమైన ఏస్తుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్చిలను ముస్తాబు చేస్తున్నారు. కమ్మగూడెం గ్రామంలో పునీత జోజప్ప మందిరాన్ని నిర్మించి సుమారు 50 ఏళ్ల పూర్తయ్యాయి. ఈ చర్చిని అప్పటి ఫాదర్ కాశీరాం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ క్రైసవ సోదరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. పూర్వీకులు నిర్మించిన ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ సందర్భంగా వేడుకలను నిర్వహించుకుంటారు. అదేవిధంగా ఎబినేజర్ ప్రార్థన మందిరంలో మౌంట్ సినాయి సువార్త సంఘం, శాలోమ్ పలు మందిరాలను క్రైస్తవ సోదరులు ముస్తాబు చేశారు. ఇప్పటికే పలు చర్చిల్లో సెమీక్రిస్మస్ సంబురాలు, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల ఆవరణలు ఆహ్లాదకరంగా మారాయి. ఈ నెల 25న క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.