లక్ష మందితో సీఎం బహిరంగ సభ
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:36 AM
ప్రభుత్వం ఏర్పడి ఏడాది నిండుతున్న సందర్భంగా జిల్లా కేంద్రం సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన లక్ష మందితో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నల్లగొండ టౌన్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పడి ఏడాది నిండుతున్న సందర్భంగా జిల్లా కేంద్రం సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన లక్ష మందితో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈనెల 7న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం రానుండగా, ఏర్పాట్లను మంత్రి గురువారం పరిశీలించారు. వైద్య కళాశాల నూతన భవనాల వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం పర్యటనలో భాగంగా సుమారు రూ.1000కోట్లతో చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. 2008లో వైఎస్ హయాంలో ఈ పనులు మంజూరు కాగా, 80శాతం పూర్తయ్యాయని, గత ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేశామని తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ పనులకు సైతం సీఎం రూ.4,540కోట్లు మంజూరు చేశారని, అమెరికా నుంచి బోరింగ్ యంత్రం పరికరాలు రానున్నాయని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే 4,000 నుంచి 6,000 క్యూసెక్కుల నీటితో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో యూనిట్-2లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి ఎస్‌ఎల్‌బీసీ గంధంవారిగూడెం వద్ద రూ.275కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడే రూ.40కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రాన్ని ప్రారంభించి, గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, కనగల్, తిప్పర్తి మండలాలకు మంజూరైన జూనియర్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే నార్కెట్‌పల్లి, దామరచర్ల మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ డిసెంబరు 9 తర్వాత జీవో రానుందని వెల్లడించారు. ఎల్లారెడ్డిగూడెం వద్ద రూ.10కోట్లతో టూరిజం ద్వారా హరిత హోటల్ నిర్మిస్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను సీఎం ప్రకటించనున్నారని తెలిపారు. వచ్చే నెలలో మూసీ ప్రక్షాళనకు రూ.25వేల కోట్లతో టెండర్లు పిలిచి దశలవారీగా పనులు చేపడతామన్నారు. సీఎం బహిరంగ సభకు ప్రజలు తరలిచివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట కలెక్టర్ ఇలాత్రిపాఠి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తదితరులు ఉన్నారు.
బీజేపీ నేతలది ద్వంద్వ వైఖరి.. బీఆర్‌ఎ్‌సది అవగాహన లేమి
(ఆంధ్రజ్యోతి, నార్కట్‌పల్లి): ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు కలుషిత మూసీ నీటితో జిల్లా ప్రజలు బాధపడుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బీజేపీ ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 7న మండలంలోని బీ.వెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీఎల్‌ఆర్‌లతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. హెలీప్యాడ్, సీఎం ఆవిష్కరించే పైలాన్, ఫొటో గ్యాలరీ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రూ.30,000కోట్లతో ప్రధాని మోదీ నమామీ గంగ పేరుతో శుద్ధీకరణ చేస్తే తప్పులేదుగాని, తమ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేస్తుందంటే బీజేపీ నేతలు విమర్శించడం, మూసీ నిద్రలు చేయడం అర్థరహితమన్నారు. ఇక బీఆర్‌ఎస్ నేతలకు మూసీ ప్రక్షాళనపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీ.వెల్లెంల ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంతో తన జీవితం ధన్యమైనట్టేనన్నారు. నల్లగొండలో జరిగే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్, ఈఈ గంగం శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌డీవో అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, నాయకులు బత్తుల ఊశయ్య, దూదిమెట్ల సత్తయ్య, వడ్డే భూపాల్‌రెడ్డి, బండా సాగర్‌రెడ్డి, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, బొడిగె స్వామి, ప్రజ్ఞాపురం సత్తి, తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో ఉమేశ్, ఆర్‌ఐ తరుణ్, యెల్లెందుల కిట్టు, బొడిగె నర్సింహ, చిరుమర్తి ధర్మయ్య, తదితరులు ఉన్నారు.