చలి పంజా
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:13 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఐదు రోజులుగా తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
19.4డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
భూదాన్‌పోచంపల్లిలో రహదారిని కప్పేసిన మంచు
నల్లగొండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 19న 22 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా, 20వ తేదీ నుంచి 19డిగ్రీలకు దిగువన కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు అధికంగా ఇబ్బందులు పడుతున్నారు. చల్లటి వాతావరణంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటే తెల్లవారుజామున విపరీతమైన మంచు తీవ్రత పెరిగింది. ఈ ఏడాది నవంబరు మూడో వారం నుంచి చలి ప్రతాపం చూపిస్తోంది. డిసెంబరు మాసంలో చలి ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంటోంది. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత కారణంగా నిమోనియా బారినపడే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. అంతేగాక అలర్జీ, శరీరంపై దద్దుర్లతో పాటు, గొంతు నొప్పి వంటివి సమస్యలు అధికంగా వస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పెరిగి తుమ్ములతో పాటు పిల్లికూతలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. చిన్న పిల్లలు చలికాలంలో వెచ్చగా ఉండేందుకు స్వెట్టర్లు, చెవులకు మంకీ క్యాపు ధరించాలని, వీలైతే కాళ్లు, చేతులకు సాక్సులు, గ్లౌజ్‌లు వినియోగించాలని చెబుతున్నారు. ఉదయం పూట చిన్న పిల్లలను కొద్దిసేపు ఎండలో ఉంచితే ప్రయోజనమని, వీలైనంత మేరకు ఉదయం, రాత్రి ప్రయాణం చేయకుండా చూడాలని పేర్కొంటున్నారు. చలికాలంలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుందని, శ్వాస తీసుకునేటప్పుడు గాలితో పాటు సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి తెల్ల రక్తకణాలను నిర్వీర్యం చేయడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందని, అంతా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..
తేదీ గరిష్ఠం కనిష్ఠం
20న 29.0 19.0
21న 29.5 18.8
22న 29.0 18.4
23న 28.5 19.0
24న 29.0 19.4