Share News

మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:41 AM

బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారంగా పరిహారం చెల్లించాలని, లేదా భూమికి బదులు భూమి కేటాయించాలని ట్రిపుల్‌ఆర్‌ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు.

మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి

ట్రిపుల్‌ఆర్‌ నిర్వాసితుల డిమాండ్‌

చౌటుప్పల్‌ టౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారంగా పరిహారం చెల్లించాలని, లేదా భూమికి బదులు భూమి కేటాయించాలని ట్రిపుల్‌ఆర్‌ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన 3జీ సమావేశాన్ని చౌటుప్పల్‌, లింగోజీగూడెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు బహిష్కరించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సీఐ మన్మథకుమార్‌ అక్కడికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఐదు నిమిషాల అనంతరం నిర్వాసితులు ఆందోళన విరమించారు. దీంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ, భూమికి బదులు భూమి లేదా, మార్కెట్‌ రేట్‌ ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, డబ్బటి రామ్‌గౌడ్‌, ఎంఎ్‌స.గౌడ్‌, జి.సురేందర్‌ రెడ్డి, బోరెం ప్రకా్‌షరెడ్డి, మల్లేశం, పాల్గొన్నారు.

సమావేశం బహిష్కరణ

(ఆంధ్రజ్యోతి, భువనగిరి రూరల్‌): రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణలో భాగంగా శుక్రవారం సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవార్డు సమావేశాన్ని రైతులు బహిష్కరించారు. భూములు కోల్పోతున్న మండలంలోని గౌస్‌నగర్‌, కేసారం, రైతులతో భువనగిరి సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆర్డీవో పి.అమరేందర్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి హాజరై నాలుగు గంటలపాటు ఎదురు చూసినా రైతులెవ్వరూ హాజరుకాలేదు. సమావేశాన్ని బహిష్కరించిన రైతులు సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించారు. నిర్వాసిత ప్రతినిధి తంగెళ్లపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ, ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతులు అవిశెట్టి పాండు యాదవ్‌, జగన్‌మోహన్‌ రెడ్డి, బి.మల్లారెడ్డి, చంద్రారెడ్డి, వెంకట వరప్రసాద్‌రెడ్డి, భీమ్‌ రెడ్డి, బద్దం సరిత, ఎలకొండ అర్జున్‌రెడ్డి, సంజీవరెడ్డి, గొర్ల వైకుంఠం, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతులకు అవగాహన కల్పించేందుకే అవార్డు విచారణ నిర్వహిస్తున్నామని భువనగిరి ఆర్డీవో అమరేందర్‌ తెలిపారు. రైతులు సమావేశా న్ని బహిష్కరించిన విషయాన్నిఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు.

Updated Date - Oct 26 , 2024 | 12:41 AM