Share News

పంట నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:13 AM

నియోజకవర్గం పరిధిలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

పంట నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

వేములపల్లి, మాడ్గులపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం పరిధిలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తాళ్లగడ్డ, ఎరుకులగుట్ట, మాడ్గులపల్లి మండలంలోని పోరెడ్డిగూడెం, చిరుమర్తి, పాములపాడు గ్రామాల్లో అకాల వర్షాలకు నేలవాలిన పంట పొలాలను గురువారం వ్యవసాయాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నేలవాలిన పంట పొలాలను వీడియోకాల్‌ ద్వారా కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ప్రతీ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే రూ.2లక్షల రుణమాఫీ చేసిందని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని, వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పుట్టల కృపయ్య, నాయకులు పిల్లల సందీప్‌, ఏడీఏ దేవ్‌సింగ్‌, మాడ్గులపల్లి ఏవో శివరాంకుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:13 AM