Share News

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:35 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట, జనవరి 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. వారాంతపు సెలవు రోజుకావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తమ ఇష్టదైవాల దర్శనాలు, మొక్కుపూజల నిర్వహణకోసం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తుల హరిహరనామ స్మరణతో యాదగిరికొండ ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ తిరువీధులు, సేవా మండపాలు, ఘాట్‌రోడ్‌, పట్టణ ప్రధానవీధులు, గండి చెరువు పరిసర ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. కొండకింద కల్యాణకట్టలో మొక్కుతలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు.. ప్రత్యేక టికెట్‌ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.. 45వేల మందికి పైగా భక్తులు యాదగిరిక్షేత్రాన్ని సందర్శించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో ఆలయ ఘాట్‌రోడ్‌, పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌, ఎస్పీఎఫ్‌, పట్టణ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల సందడి కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ఆలయ తిరువీధుల్లో పిల్లాపాపలతో సేదతీరారు. ఇదిలా ఉండగా యాదగిరికొండకు సమీపంలోని రాయుగిరి చెరువు ప్రాంతంలోని గార్డెనలో భక్తులు పిల్లాపాపలతో సేదతీరారు.

స్వయంభువులకు శాసో్త్రక్తంగా నిత్యారాధనలు

ఏకశిఖరవాసుడు స్వయంభు పాంచనారసింహుడికి ఆదివారం నిత్యపూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో అర్చకులు నిత్యారాధనలు చేశారు. గర్భాలయంలోని మూలమూర్తులకు వేదమంత్ర పఠనాలతో నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవాలను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టిన అర్చకులు ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగాయి. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలో స్ఫటిక మూర్తులకు నిత్యపూజలు, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి.

స్వామి సేవలో గవర్నర్‌ సెక్రటరీ సురేంద్రమోహన

గవర్నర్‌ సెక్రటరీ సురేంద్రమోహన కుటుంబసమేతంగా లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజలనంతరం అర్చకులు ఆశీర్వచనం అందజేయగా.. దేవస్థాన అధికారులు ఆయనకు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

Updated Date - Jan 28 , 2024 | 11:35 PM