Share News

పునర్నిర్మాణానికి సీపీఐ తహతహ

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:10 AM

కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా వెలుగొందిన నల్లగొండ జిల్లా నుంచే పునర్నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొంటున్న సీపీఐ అందుకు శతవార్షికోత్సవాన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది.

పునర్నిర్మాణానికి సీపీఐ తహతహ

గతంలో కంచుకోటగా నిలిచిన ఉమ్మడి జిల్లా

ఆంధ్ర మహాసభ మొదలు పార్లమెంటరీ రాజకీయాల వరకు చెరగని ముద్ర

పార్లమెంట్‌ను ప్రారంభించిన రావి నారాయణరెడ్డి

శతవార్షికోత్సవం సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల విలీనానికి ప్రతిపాదన

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా వెలుగొందిన నల్లగొండ జిల్లా నుంచే పునర్నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొంటున్న సీపీఐ అందుకు శతవార్షికోత్సవాన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. సమాజంలో అన్నివర్గాలను చైతన్యపరచడం తో పాటు, అన్ని రకాల ప్రజాసమస్యలపై పోరాటాలు రూపొందించి ప్రజలకు దగ్గరవ్వాలని నిర్ణయించింది. కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాతే బలహీనపడుతూ వచ్చి ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితిని అంగీకరిస్తూనే మళ్లీ కమ్యూనిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని, అందుకు శతవసంతాల సందర్భంగా కార్యాచరణ అమలుచేయాలనే సంకల్పంతో ఉంది.

నిజాం సంస్థానంలో ఉన్నప్పటి నుంచే ఆంధ్రమహాసభ పేరుతో వెట్టిచాకిరీ, అంటరానితనం, అందరికీ సమానహక్కులు, సమాన విద్య కోసం కమ్యూనిస్టులు పోరాడారు. నల్లగొండ జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నేత రావినారాయణరెడ్డి 1941లో నల్లగొండ జిల్లాలోని చిలుకూరులో నిర్వహించిన 8వ నిజాం ఆంధ్రమహాసభకు, అదేవిధంగా 194లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. ఈమహసభ నుంచే ఆంధ్రమహాసభ రెండుగా విడిపోయింది. అతివాదుల నేతృత్వంలోని ఆంధ్రమహాసభకు రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలోనే ఖమ్మంలో 1945లో సమావేశం జరిగింది. కమ్యూనిస్టుల నేతృత్వంలోని నైజాం ఆంధ్ర మహాసభను విస్తృత రాజకీయ సంస్థగా మార్చేందుకు రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విస్తృతంగా కృషి చేశారు. ఈ మహాసభకు వీరే అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండేవారు. నిజాం సంస్థానంలో ప్రజల్లో చైతన్యం నింపడానికి, హక్కుల కోసం పోరాడడానికి, విద్యనేర్పడానికి మహాసభ ఎంతగానో కృషి చేసింది. అదే క్రమంలో 1946లో సంస్థాన పరిధిలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం మొదలవగా, నల్లగొండ జిల్లా ఈ పోరాటానికి దన్నుగా నిలిచింది. తాడిత, పీడిత ప్రజల పక్షాన, భూమి, భుక్తి, విముక్తి కోసమంటూ వేలాదిమంది బందూకులు పట్టి సాయుధపోరులో ముందు నిలిచి నిజాం ప్రభుత్వానికి, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు. దొడ్డికొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్‌బందగీ సహా వేలాది మంది బలిదానాలు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడంలో నల్లగొండ జిల్లా నేతలు కీలకభూమిక పోషించారు. నాటి సాయుధపోరాటంలో రావి నారాయణరెడ్డి, ధర్మభిక్షం, బీఎన్‌రెడ్డి, మల్లుస్వరాజ్యం, ఆరుట్ల దంపతులు మొదలు వేలాది మంది పోరాడారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేకస్థానం దక్కింది. కమ్యూనిస్టుల పోరాటం ఉధృతమవడం వల్లే రజాకార్లు దేశం వదిలిపారిపోతే, నిజాం రాజు సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలిపేందుకు అంగీకరించారు. అయితే సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో కాకుండా స్వతంత్రంగా కొనసాగించాలనే తీర్మానంతో కమ్యూనిస్టు పార్టీపై అప్పుడు నిషేధం విధించారు. దీంతో నిజాం రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలిపిన తర్వాత 1951లో హైదరాబాద్‌ రాష్ట్రానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో 11 జనరల్‌, మూడు ద్విసభ్య నియోజకవర్గాలకు కలిపి 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే మొత్తానికి మొత్తం కమ్యూనిస్టు నాయకులే పీడీఎఫ్‌ అభ్యర్థులుగా గెలుపొందారు. ఆతర్వాత 1957లోనూ 12కి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పీడీఎఫ్‌ నుంచే గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించిన తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లోనూ నల్లగొండ జిల్లాలో 12సీట్లకు తొమ్మిది సీట్లను సీపీఐ గెలుచుకుంది. కమ్యూనిస్టుల చీలికతో ఆ తర్వాత నుంచి ప్రాభవం తగ్గుతూ వచ్చింది.

నెహ్రూకంటే రావి అధిక మెజార్టీ

తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ నుంచి గెలుపొందిన ఉమ్మడి కమ్యూనిస్టునేత రావి నారాయణరెడ్డికి దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ రావడంతో ఆయనతో పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నెహ్రూ సమక్షంలో ప్రారంభింపజేయడం జిల్లాకు దక్కిన గొప్ప గౌరవం. కమ్యూనిస్టు నేతల్లో బీఎన్‌రెడ్డి ఒక్కరే మూడు పర్యాయాలు గెలుపొందడంతో పాటు 14 ఏళ్లపాటు ఎంపీగా పనిచేశారు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 1996 ఎన్నికల్లో ఫ్లోరోసిస్‌ బాధితులతో పాటు ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిచినవారు 480 మంది నామినేషన్లు వేశారు. అంత తీవ్రంగా జరిగిన ఎన్నికల్లోనూ నల్లగొండ ఓటర్లు సీపీఐ నేత ధర్మభిక్షం గౌడ్‌ను గెలిపించడం కమ్యూనిస్టులకున్న పట్టు దేశవ్యాప్తంగా చాటినట్లయింది. నల్లగొండ నుంచే గెలుపొందిన సీపీఐ దిగ్గజనేత సురవరం సుధాకర్‌రెడ్డి ఆ పార్టీకి జాతీయకార్యదర్శిగా పనిచేయడం గమనార్హం. నల్లగొండ, మిర్యాలగూడ లోక్‌సభ స్థానాలు కొనసాగినంత కాలం కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు లోక్‌సభ సీట్లకు బలంగా పోటీపడ్డాయి. ఒక పర్యాయం కాంగ్రెస్‌ గెలిస్తే, మరో పర్యాయం కమ్యూనిస్టు అభ్యర్థులు గెలుపొందేవారు. నల్లగొండలో సీపీఐ, మిర్యాలగూడలో సీపీఎం కాంగ్రె్‌సను ఢీకొట్టేవి. నల్లగొండ లోక్‌సభ నుంచి సీపీఐ దిగ్గజ నేతలు రావి నారాయణరెడ్డి, సుంకరి అచ్చాలు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్‌, సురవరం సుఽధాకర్‌రెడ్డి లోక్‌సభకు ఎన్నికైతే మిర్యాలగూడ స్థానం నుంచి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి లక్ష్మీదాస్‌, సీపీఎం నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి (బీఎన్‌) విజయం సాధించారు.

చీలికల తర్వాత తగ్గుతూ వచ్చిన ప్రాబల్యం

సీపీఐ నుంచి సీపీఎం విడిపోయిన తర్వాత నుంచి ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. సీపీఎం, సీపీఐ విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ప్రాతినిధ్యం కోల్పోతే, సీపీఎం మూడు సీట్లలో గెలుపొందింది. 1972 ఎన్నికల్లో దేవరకొండలో సీపీఐ నుంచి రామశర్మ గెలుపొందితే, సీపీఎం తన చేతిలో ఉన్న మూడింటినీ కోల్పోయింది. 1978లో సీపీఐ ప్రాతినిధ్యం కోల్పోతే, సీపీఎం రెండు సీట్లలో గెలిచింది. 1983లో సీపీఐకి సీట్లు దక్కలేదు. సీపీఎం తన రెండుసీట్లను గెలుపొందింది. 1985లో టీడీపీతో పొత్తుతో మళ్లీ జిల్లాలో కమ్యూనిస్టులు బలపడ్డారు. ఆ ఎన్నికల్లో సీపీఐ మూడుచోట్ల గెలుపొందగా, సీపీఎం రెండు చోట్ల గెలుపొందింది. రెండు ఎంపీ సీట్లనూ చెరొకటి గెలుచుకున్నాయి. 1989 లోనూ టీడీపీ పొత్తుతో మళ్లీ సీపీఐ మూడు సీట్లలో గెలిస్తే, సీపీఎం నకిరేకల్‌కు పరిమితమైంది. తిరిగి 1994లో సీపీఐ, సీపీఎం చెరో మూడుస్థానాల్లో గెలిచాయి. 1999లో ఒంటరిగా కమ్యూనిస్టులు పోటీచేయగా, సీపీఐకి ప్రాతినిధ్యం దక్కకపోతే, సీఎం మాత్రం నకిరేకల్‌ స్థానాన్ని నిలబెట్టుకొంది. 2004లో కాంగ్రెస్‌ పొత్తుతో మళ్లీ సీపీఐ, సీపీఎం జిల్లాలో చెరో రెండుసీట్లు గెలిచాయి. 2009లో మహాకూటమిలో భాగంగా పోటీచేయగా, మిర్యాలగూడలో సీపీఎం అభ్యర్థి రంగారెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందగా, మునుగోడులో సీపీఐ నేత ఉజ్జిని యాదగిరిరావు గెలుపొందారు. 2014లో కమ్యూనిస్టులు విడిపోయారు. సీపీఐ కాంగ్రె్‌సతో పొత్తులో భాగంగా పోటీచేయగా, దేవరకొండ నుంచి ఆ పార్టీ అభ్యర్థి రమావత్‌ రవీంద్రకుమార్‌ గెలుపొందగా, సీపీఎం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తంగా విడిపోయిన తర్వాత కలిసి పోటీచేసినా, విడిపోయి పోటీచేసినా కమ్యూనిస్టులు క్రమంగా బలహీనపడుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన 2104 ఎన్నికల్లో సీపీఐ నుంచి గెలుపొందిన రవీంద్రకుమార్‌ ఆతర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరగా, ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2018, 2023 ఎన్నికల్లో రెండు పార్టీలకు జిల్లాలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో చివరి వరకు మునుగోడు, దేవరకొండ, పూర్వపు రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నల్లగొండ లోక్‌సభ (ప్రస్తుతం భువనగిరి) స్థానంలో సీపీఐకి అండగా ఉంటూ వస్తున్నాయి. ఇక్కడ పార్టీ శాఖలతో పాటు, పార్టీ కార్యకలాపాలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతుండడం పార్టీ పునర్‌ వైభవానికి పునాదిగా నిలుస్తుందని, దీన్ని ఆసరా చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళతామని పార్టీ జిల్లా నాయకత్వం పేర్కొంటోంది.

కలిసి పోరాడుతామనే సంకేతాలు

సీపీఐ వందేళ్ల ప్రస్థానం తర్వాత కమ్యూనిస్టులు ఐక్యమవ్వాలనే ప్రతిపాదనను మరోసారి తెరమీదకు తెచ్చారు. విడిపోయినందున నష్టపోతున్నామని భావిస్తున్న సీపీఐ అన్ని వామపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిస్తోంది. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన, సమస్యల కోసం, వివిధ వర్గాల ఈతిబాధలు తీర్చేందుకు ప్రభుత్వాలపై వందేళ్లుగా పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని చెబుతున్నారు. ఈ శత వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనిస్టుల కలయిక ఉంటుందనే ఆశాభావాన్ని సీపీఐ వ్యక్తం చేస్తోంది.

నేడు సీపీఐ బహిరంగ సభ

ఎన్జీ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి

హాజరుకానున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం

నల్లగొండ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సీపీఐ శతవసంతాల సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో సోమవా రం సాయంత్రం జరిగే బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి రానున్నారు. సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని కూడా ప్రసంగిస్తారు. ఈ సభను విజయవం తం చేసేందుకు ఇప్పటికే జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆధ్వర్యం లో ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న 15వేల మంది ఎర్రచొక్కాలు, ఎర్రచీరలు ధరించి రావాలని నిర్ణయించారు. క్లాక్‌టవర్‌ నుంచి సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. బహిరంగ సభ సందర్భంగా కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో నలువైపులా ఎర్రతోరణాలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బహిరంగసభ వేదిక ఏర్పాట్లను సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మల్లేపల్లి ఆదిరెడ్డి, తదితరులు ఆదివారం సాయంత్రం పరిశీలించారు.

Updated Date - Dec 30 , 2024 | 12:10 AM