Share News

గోదావరి జలాలతోనే సాగు

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:15 AM

ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 90శాతం చెరువులను గోదావరి జలాలలతో నింపామని, వాటితోనే రైతులు పంటలు సాగుచేసుకుంటారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

గోదావరి జలాలతోనే సాగు

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 90శాతం చెరువులను గోదావరి జలాలలతో నింపామని, వాటితోనే రైతులు పంటలు సాగుచేసుకుంటారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మైలారిగూడెం గ్రామంలోని చెరువువద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఫల్యంతోనే ఆలేరు ప్రాంతం ఎడారిగా మారిందని, పక్కనే ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆలేరుకు నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మేరకు గొలుసుగట్టు చెరువులన్నీ నింపి రైతులకు అండగా ఉంటానని చెప్పారు. గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా తన దగ్గరకు వస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించడాకి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు కానుగ బాలరాజ్‌గౌడ్‌, కాదూరి అచ్చయ్య, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ పుప్పాల నర్సింహ, ప్రజాప్రతినిధులు , నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:15 AM