సమీపిస్తున్న గడువు.. అందని మార్గదర్శకాలు
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:45 AM
భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసహాయం అందిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీఇచ్చింది. ఆ హామీని అమలుచేయాలన్న డిమా ండ్ పెరగడంతో ఈ నెల 28 నుంచి ఆ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మోత్కూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసహాయం అందిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీఇచ్చింది. ఆ హామీని అమలుచేయాలన్న డిమా ండ్ పెరగడంతో ఈ నెల 28 నుంచి ఆ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదికి రెండు విడతలుగా, ఒక్కోవిడత రూ.6వేల చొప్పున రెండు పర్యాయాల్లో మొత్తం రూ.12వేలు ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టనున్నట్లు సమాచారం. పథకం ప్రారంభానికి గడువు సమీపిస్తున్నా లబ్ధిదారుల గుర్తింపునకు మార్గదర్శకాలు ఏంటన్నది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఉపాధిహామీ జాబ్‌కార్డుల ఆధారంగా వ్యవసాయ కూలీలను ఎంపిక చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఉపాధిజాబ్ కార్డుల్లో రైతులు, కూలీలకు ఉన్న భూమి వివరాలు పొందుపర్చరు. దీంతో భూమిలేని వ్యవసాయకూలీలను ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆధారపడితే రాజకీయఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
100 రోజులు పనిచేసిన కుటుంబాలు 1,379 మాత్రమే
ప్రభుత్వం తొలుత 100 రోజులు పనిచేసిన భూమి లేని కూలీలకు పథకం వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. అదే ప్రామాణికమైతే 100రోజులు పనిచేసిన కుటుంబాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,43,169 జాబ్‌కార్డులకు 327, నల్లగొండ జిల్లాలో 3,59,540 జాబ్‌కార్డులకు 652, సూర్యాపేట జిల్లాలో 2,62,583 జాబ్‌కార్డులకు 400 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,379 కుటుంబాలే అర్హులుగా ఉండనున్నాయి. ఇందులో భూమి లేని కూలీలు ఎందరు అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 53,05,312 జాబ్‌కార్డులు ఉండగా 100 రోజులు పని పూర్తి చేసిన కుటుంబాలు 30,141 ఉన్నాయి.
భూమి కూలీల గుర్తింపు ఫీల్డ్‌అసిస్టెంట్ల ద్వారా..
ఉపాధిహామీ జాబ్‌కార్డులు కలిగి ఉన్న వారిలో భూమి ఉన్నవారు ప్రభుత్వం అమలుచేసిన భూమి అభివృద్ధి, టేకు చెట్లునాటడం, తోటల పెంపకం, వర్మీకంపోస్టు, పశువుల షెడ్లు లాంటి వివిధ పథకాల్లో ఏదో ఒకదాంట్లో లబ్ధి పొంది ఉంటారంటున్నారు. వాటి ఆధారంగా ఫీల్డ్‌అసిస్టెంట్లు భూమి లేని వ్యవసాయ కూలీలను గుర్తిస్తారని చెబుతున్నారు. తొలుత 100 రోజులు పనిచేసిన వారిని, ఆ తర్వాత వరసగా 90రోజులు, 80రోజులు, 70రోజులు పనిచేసిన వారిని పరిగనలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తారంటున్నారు.
మునిసిపాలిటీ పరిధిలోని కూలీలకు ఎలా?
భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థికసహాయం అం దించే పథకం లబ్ధిదారులను ఉపాధి జాబ్‌కార్డుల ఆధారంగా ఎంపిక చేస్తే మునిసిపాలిటీల పరిధిలోని తమ పరిస్థితి ఏంటని వ్యవసాయ కూలీలు ప్రశ్నిస్తున్నారు. 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 15వేల జనాభా కలిగిన గ్రామపంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. 15వేల జనాభా లేని చోట సమీప గ్రామాలను కలిపి మునిసిపాలిటీలు చేశారు.మునిసిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం వర్తించకపోవడంతో ఆయా పరిధిల్లోని గ్రామాల్లో జాబ్‌కార్డులు రద్దయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, నల్లగొండ జిల్లాలో 8, సూర్యాపేట జిల్లాలో 5 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఉపాధి జాబ్‌కార్డులు లేవు. ఉపాధిజాబ్ కార్డుల ఆధారంగానే వ్యవసాయకూలీలను ఎంపిక చేసిన పక్షంలో మునిసిపాలిటీల్లోని వ్యవసాయకూలీలకు ప్రభుత్వ పథకం అందకుండాపోతుందన్న చర్చ సాగుతోంది.ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని వ్యవసాయ కూలీలు కోరుతున్నారు.
మునిసిపాలిటీల్లోని కూలీలకూ వర్తింపజేయాలి
గ్రామస్థులు వద్దంటున్నా మా గ్రామాన్ని కలిపి 2018లో మోత్కూరు మునిసిపాలిటీని చేశారు. మునిసిపాలిటీల్లో ఉపాధిహామీ పథకం వర్తింపజేయడంలేదు. అప్పటి నుంచి ఆరేళ్లుగా గ్రామంలోని కూలీలం వేసవిలో పనిలేక నష్టపోతున్నాం. ఇప్పుడు ఉపాధి జాబ్‌కార్డుల ఆధారంగా మహిళా వ్యవసాయకూలీలను ఎంపిక చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థికసహాయం అందించాలి.
తొంట రమాదేవి, వ్యవసాయ కూలీ, కొండగడప
అర్హులందరికీ సాయం అందించాలి
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే ఆర్థికసహాయాన్ని అర్హులైన కూలీలందరికీ వర్తింపజేయాలి. జాబ్‌కార్డులు ఉన్నవారికి 100 రోజులు, 90, 80, 70రోజులు పనిచేసిన వారికే ఇస్తాననడం సరికాదు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపికచేయాలి. లేదా మరోసారి భూమి లేని వ్యవసాయ కూలీల గుర్తింపు కోసం సర్వే నిర్వహించి భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ఆర్థికసహాయం అందించాలి.
రాచకొండ రాములమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు
లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు రాలేదు
భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థికసహాయం అందించేందుకు లబ్ధిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాలు ఏమీ అందలేదు. ఈ నెల 28 నుంచి భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థికసహాయం అందిస్తారన్న వార్తలు పత్రికల్లో చదవడమే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు.
డీ బాలాజీ, ఎంపీడీవో, మోత్కూరు