ధాన్యం కొనుగోళ్లులో జాప్యం
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:36 AM
ఓ వైపు వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు సతమతమవుతున్నారు. వరి కోతలు పూర్తయ్యి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 100 కేంద్రాలు ప్రారంభం
అన్నిచోట్లా తెరవాలని రైతుల విన్నపం
ఇప్పటివరకు 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
వర్షాలతో రైతుల్లో ఆందోళన
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ఓ వైపు వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు సతమతమవుతున్నారు. వరి కోతలు పూర్తయ్యి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద రాశులుగా పోసిన ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు.
వరి నూర్పిడి పూర్తయిన రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం వేళ ధాన్యాన్ని ఆరబోసినా, రాత్రి వేళ కురుస్తున్న అకాల వర్షాలతో తేమ శాతంలో మార్పు రావడం లేదు. దీంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సమయం పడుతోంది. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు విన్నవిస్తున్నారు.
4లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
జిల్లాలో వానాకాలం సీజన్‌లో మొత్తం 2.73లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 6.16లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ధాన్యం ఏ-గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. జిల్లాలో 6.16లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యానికి కొనుగోలు కేంద్రాల 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీల ఆధ్వర్యంలో మొత్తం 286 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో 47 కేంద్రాల్లో దొడ్డు రకాలతోపాటు సన్న రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. కాగా, ఇప్పటివరకు మొత్తం 100 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
100 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు మొత్తం 286 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 100 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 286 కేంద్రాల్లో 47 కేంద్రాల్లో దొడ్డు రకాలతోపాటు సన్న ధాన్యం కొనుగోలు చేయనున్నారు. అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 37 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లో సన్న ధాన్యం కొనుగోలు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన అన్ని కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తుంటేనే ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండటంతో కాంటా వేయలేకపోతున్నారు. ఓ వైపు అకాల వర్షాలు వెంబడిస్తుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యంగా అవుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.
వ్యాపారులకు విక్రయం
మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు రైతుల పంట పొలాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర ఏ-గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300గా ఉంది. అయితే రైతులు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబోసేందుకు వర్షాల భయంతో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. భువనగిరి గంజ్‌తో పాటు పలు మండలాల్లోని వ్యాపారులు రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు క్వింటాకు రూ.1,900 నుంచి రూ.2,005 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ మద్దతు ధరను కోల్పోతున్నారు. భువనగిరి, ఆలేరు, గుండాల, తదితర మండలాల్లో చాలా మంది రైతులు ఇప్పటికే వ్యాపారులకు ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించారు.
గన్నీ బ్యాగులు అందేనా?
ఈసారి ధాన్యం కొనుగోలుకు సుమారు 10లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 5,79,542 వరకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొత్తవి 4,21,703, పాతవి 1,57,839 ఉన్నాయి. మరో 4,20,458 వరకు గన్నీ బ్యాగులు అవసరం. ఈ నెల చివరి వారంలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మిగతా గన్నీ బ్యాగులు ఆ సమయానికి సమకూర్చి ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభిస్తాం : జగదీష్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరైన ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ధాన్యం వచ్చే చోట కేంద్రాలను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. జిల్లాలో 286 కేంద్రాల ద్వారా ధాన్యాని సేకరించనున్నాం. ఈ సీజన్‌లో సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది లక్ష్యం. రైతులందరి వద్ద ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి.