Share News

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని మనస్తాపం

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:48 PM

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో భూమి కోల్పోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు గుండె ఆగింది.

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని మనస్తాపం
నర్సిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

గుండెపోటుతో రైతు కన్నుమూత

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘటన

చౌటుప్పల్‌ రూరల్‌, ఫిబ్రవరి 6: రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో భూమి కోల్పోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు గుండె ఆగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మందోళ్లగూడెంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్‌ మండలం మందోళ్లగూడెం గ్రామానికి చెందిన మామిడి నర్సిరెడ్డి (70)కి గ్రామపరిధిలో ఎనిమిది ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాడు. ఐదు దశాబ్దాలుగా తన భూమిని సాగుచేసుకుంటూ కుమారుడు, కుమార్తెలకు వివాహాలు చేశాడు. కుమారుడు, భార్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో భాగంగా మొదటి దశలో గజ్వేల్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు భూమిని సేకరించేందుకు ఏడాది క్రితం నోటిఫికేషన జారీచేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో మందోళ్లగూడెం గ్రామానికి చెందిన 15మంది రైతుల భూములు ఉన్నాయి. అందులో నర్సిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నోటిఫికేషన వచ్చిన నాటి నుంచి నర్సిరెడ్డి మనోవేదన చెందుతూనే ఉన్నాడు. ఎక్కడ ఆర్‌ఆర్‌ఆర్‌ భాదితుల సమావేశాలు నిర్వహించినా నర్సిరెడ్డి హాజరయ్యేవాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైనమెంట్‌ను మార్చాలని సహచర రైతులతో కలిసి అధికారులను, ప్రజాప్రతనిధులను కలిశాడు. భూసేకరణలో భాగంగా సోమవారం అటవీశాఖ ఽఅధికారులు నర్సిరెడ్డి పొలంలో చెట్లను లెక్కించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి త్వరలో పొతుందని ఫారెస్టు అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఆరుగాలం శ్రమించి కష్టపడి సంపాదించిన తన భూమి తన కళ్లెదుటే పోతుందని గ్రహించి, తీవ్ర మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. అదే మనోవేదనతో ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉండి మంచంలోనే కన్నుమూశాడు. భూమి కోల్పోతుండటంతోనే నర్సిరెడ్డి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. నర్సిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదని మందోళ్లగూడెం మాజీ సర్పంచ బూరుగు కళమ్మ తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 11:48 PM