Share News

పీఏసీఎస్‌ చైర్మనపై వీగిన అవిశ్వాసం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:55 PM

మండలంలోని చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్‌ అనంతు శ్రీనివా్‌సగౌడ్‌పై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

పీఏసీఎస్‌ చైర్మనపై వీగిన అవిశ్వాసం
సమావేశానికి హాజరైన అధికారులు, డైరెక్టర్ల గైర్హాజరుతో ఖాళీగా ఉన్న కుర్చీలు

నేరేడుచర్ల, జనవరి 30 : మండలంలోని చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్‌ అనంతు శ్రీనివా్‌సగౌడ్‌పై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. చిల్లేపల్లి సహకార సంఘంలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా ఒక డైరక్టర్‌ కొండ పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. 12 మంది డైరక్టర్లు ఉన్నారు. వీరిలో 10 మంది సంఘం డైరక్టర్లు చైర్మన్‌ శ్రీనివా్‌సపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఈ నెల 8న జిల్లా సహకార సంఘం అధికారికి, కలెక్టర్‌ వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 30న అవిశ్వాసం ఏర్పాటు చేస్తూ డైరక్టర్లకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం జిల్లా అధికారి ఎన్‌.శ్రీధర్‌, అసిస్టెంట్‌ రిజిష్టార్‌ పద్మజ, రాజేశ్వరిలు 11 గంటలకు అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటుచేశారు. సమావేశానికి 12 మంది డైరెక్టర్లు హాజరుకాలేదు. 11.30 వరకు వేచి చూసి అవిశ్వాసం సమావేశం రద్దు చేసి, అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. ఏడాది వరకు అవిశ్వాసం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. అవిశ్వాస సమావేశం సందర్భంగా నేరేడుచర్ల, పాలకవీడు ఎస్‌ఐలు పరమేష్‌, లింగయ్యల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

అవినీతి ఆరోపణలపై కమిటీ ఏర్పాటు: జిల్లా సహకార సంఘం అధికారి శ్రీధర్‌

నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి పీఏసీఎ్‌సలో అనంతు శ్రీనివాస్‌, సీఈవో నాగరాజు అక్రమాలకు పాల్పడ్డారని కొంత మంది డైరెక్టర్లు, రైతులు కలెక్టర్‌ వెంకటరావుకు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుపై విచారణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు జిల్లా సహకార సంఘం అధికారి శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం చిల్లేపల్లి పీఏసీఎ్‌సను సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చిల్లేపల్లి సహకార సంఘం నుంచి 2020-21లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో చైర్మన్‌, సీఈవోలు రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై ఇక్కడి రైతులతో సంబంధం లేకుండా మరొక చోట నుంచి ధాన్యం తీసుకువచ్చి ఇక్కడి రైతుల పేర్లతో విక్రయించారని ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. కమిటీలో అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి(రెవెన్యూ) నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీలో స్థానిక తహసీల్దార్‌, ఏవో, ఏఈవో, ఆర్‌ఐ, హుజూర్‌నగర్‌ కోపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్టర్‌ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు అందజేయనుందని ఆయన తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 11:55 PM