దొంగలను పట్టించిన కుక్కలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:50 PM
ధాన్యం దొంగతనం చేసేందుకు యత్నించిన దొంగలను కుక్కలు పట్టించాయి.
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 6: ధాన్యం దొంగతనం చేసేందుకు యత్నించిన దొంగలను కుక్కలు పట్టించాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని తెప్పలమడుగు స్టేజీవద్ద ఉన్న రైస్‌మిల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ సీఐ భీసన్న, పెద్దవూర ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దవూర మండల పరిధిలోని తెప్పలమడుగు స్టేజీ వద్ద ఉన్న అమ్మ రైస్ మిల్లులో ఎఫ్‌సీఐకి చెందిన ధాన్యాన్ని మూడు లాట్లుగా నిల్వ చేశారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం తెల్లవారుజామున నిడమనూరు మండలం నర్సింహులగూడేనికి చెందిన రమేష్, అనుముల మండలం చెల్మరెడ్డిగూడేనికి చెందిన శ్రీకాంత తన స్నేహితుడైన శ్రీరాం జీవన వద్ద నుంచి ఆటోను అడిగి తీసుకున్నారు. వారు అక్కడి నుంచి నేరుగా తెప్పలమడుగు స్టేజీ వద్ద ఉన్న అమ్మ రైస్‌మిల్లు వద్దకు చేరుకున్నారు. రైస్‌మిల్లు లాట్‌లో ఉన్న ధాన్యం బస్తాలను లాగడంతో రెండు బస్తాలు కిందపడిపోయాయి. అక్కడున్న కుక్కలు మొరగడంతో వాచమన లేచి చూశాడు. ఎనహెచ-167 పక్కనే ఉన్న ఆ రైస్‌మిల్లు వద్ద రోడ్డుపై ఆటో ఆగి ఉండడాన్ని గమనించాడు. అతను కేకలు వేయడంతో నిందితులు ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. సోమవారం ఉదయం రైస్ మిల్లు యజమాని మలిగిరెడ్డి రామాంజిరెడ్డికి వాచమన సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన ఎస్‌ఐ రమేష్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అదే రైస్ మిల్లు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ధాన్యం బస్తాలు దొంగతనం చేసేందుకు వచ్చింది తామేనని ఒప్పుకున్నారు. ఇద్దరు నిందితును మంగళవారం నిడమనూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.