Share News

డబుల్‌ పరేషాన్‌

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:19 AM

పేదల సొంతింటి కల నెరవేరడంలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి, ఎన్నికల ముందు పేదలకు హడావుడిగా పంపిణీ చేసింది.

డబుల్‌ పరేషాన్‌

ఇళ్లను నిర్మించి వసతులు మరిచారు

సౌకర్యాలు లేక గృహప్రవేశానికి నోచుకోని వైనం

మౌలిక వసతులకు సుమారు రూ.9కోట్లు అవసరం

జిల్లాకు మంజూరైన ఇళ్లు 3,464

టెండర్ల పక్రియ పూర్తయిన ఇళ్లు 1,603

1,185 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పేదల సొంతింటి కల నెరవేరడంలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి, ఎన్నికల ముందు పేదలకు హడావుడిగా పంపిణీ చేసింది. అయితే ఇళ్లను నిర్మించిన ప్రాంతంలో మౌలిక వసతులు లేకపోవడం, కొన్ని ఇళ్లు అసంపూర్తి నిర్మాణాలతో ఉండటంతో లబ్ధిదారులు అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ ఇళ్లు గృహ ప్రవేశానికి నోచుకోక కిటికీలు, దర్వాజాలు, పైప్‌లైన్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి వసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

గత ప్రభుత్వం 2016లో డబుల్‌ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. జిల్లాకు మొత్తం 3,464ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో 1,603 ఇళ్లకు మాత్రమే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా ఇళ్ల నిర్మాణానికి పలుమార్లు టెండర్లు పిలిచినా, తక్కువ ధరకు నిర్మించలేమని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఆ ఇళ్ల నిర్మాణాలు మంజూరు దశలోనే ఉన్నాయి. టెండర్లు పూర్తయిన 1,603 ఇళ్లల్లోనూ 829 నిర్మాణాలు పూర్తి కాగా, మరో 574 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయి. పనులు పూర్తయిన చో ట్ల మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా, తుది దశలో ఉన్న ఇళ్లకు అంతర్గత పనులైన తాగునీరు, విద్యుత్‌, సీవరేజ్‌, తదితర పనులు పూ ర్తిచేయాల్సి ఉంది. అయితే 1,185 ఇళ్లను గత ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి మునిసిపాలిటీలో 444 ఇళ్లు, బీబీనగర్‌లో 11, బీబీనగర్‌ మండలం కొండమడుగు లో 30, పోచంపల్లి మండలం జబ్లిక్‌పల్లిలో 36, ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరులో 64, కొలనుపాకలో 64, మోటకొండూరులో 40, ఆత్మకూరులో 48, ఆత్మకూర్‌(ఎం) మండలం ఉప్పల్‌పహాడ్‌లో 45, యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 40, మసాయిపేటలో 40, తుర్కపల్లి మం డల కేంద్రంలో 40, ము నుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో 72,సంస్థాన్‌నారాయణపురం మండ లం సర్వేల్‌లో 64ఇళ్లను లబ్ధిదారులకు గత ప్రభుత్వం పంపిణీ చేసింది.

వసతులు లేక ఇక్కట్లు

డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత, స్థలాల ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఫలితంగా 2016 నుంచి 2022 ఇళ్ల నిర్మాణం కొనసాగుతూనే ఉండగా, నిర్మాణం పూర్తయినచోట వసతులు లేవు. అక్కడక్కడ అరకొరగా నిర్మించిన ఇళ్లను గత ఎన్నికలకు ముందుగా లబ్ధిదారులకు హడావుడిగా పంపిణీ చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాతే పేదలకు ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, వసతులు లేకున్నా, ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇళ్లను నిర్మించి ఏళ్లుగా పంపిణీకి నోచుకోకపోవడంతో భువనగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్ల కిటికీలు, దర్వాజలు, డ్రైనేజీ పైపులు తదితర సామగ్రి ధ్వంసమైంది. లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన రెండు నెలలోపు మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇళ్లను పంపిణీ చేసినా అక్కడ లబ్ధిదారులు నివసించలేని పరిస్థితి నెలకొంది. మౌలిక వసతులు కల్పించాలని పలుచోట్ల లబ్ధిదారులు ఆందోళనలు కూడా చేశారు. కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై స్పందించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు వసతులు కల్పించాలని లబ్ధిదారుల కోరుతున్నారు. అంతేగాక ఈ సమస్యలను లబ్ధిదారులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

మౌలిక వసతుల కల్పనకు రూ.9కోట్లు అవసరం

డబుల్‌ బెడ్‌రూం లబ్దిదారుల ఆందోళన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు అసంపూర్తి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. జిల్లాలో పంపిణీ చేసిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు మౌలిక వసతులతోపాటు అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.9కోట్ల మేర నిధులు అవసరమని ఎమ్మెల్యేలు తాత్కాలికంగా అంచనా వేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సౌకర్యాల కల్పనపై సమీక్షించి, పూర్తి వివరాలు తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని సింగన్నగూడ, హుస్సేనాబాద్‌, కొండమడుగు, బీబీనగర్‌, రేవణపల్లి, జిబ్లిక్‌పల్లిలోని అసంపూర్తిగా ఉన్న 641 డబు ల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ.4.63కోట్లు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు. ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లోనూ అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ప్రభుత్వానికి నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యేలు నివేదించారు. చిన్నచిన్న మరమ్మతులు చేసినపక్షంలో పేదలు ఇళ్లలోకి వెళ్తారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే కుంభం వెల్లడించారు.

Updated Date - Jun 25 , 2024 | 12:19 AM