ఆర్‌ఆర్‌ఆర్ పరిహారం రెట్టింపు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:51 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారతమాల పరియోజన కింద నిర్మించనున్న రీజనల్ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) పరిహారాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
అలైనమెంట్‌లో ఎలాంటి మార్పు లేదు
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారతమాల పరియోజన కింద నిర్మించనున్న రీజనల్ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) పరిహారాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలైనమెంట్‌ను మార్చాలని రైతులు కొన్నాళ్లుగా ఆందోళనబాట పట్టి, భూసేకరణ సర్వే పనులు, విచారణ సమావేశాలను అడ్డుకుంటూ నిరసన తెలిపారు. అయితే వీటిని పట్టించుకోకుండా పాత అలైనమెంట్ ప్రకారమే ముందుకు వెళ్లాలని, ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ట్రిపుల్‌ఆర్ నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే 3జీ నోటిఫికేషన జారీచేసింది. అవార్డు పాస్ తుదిదశలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌తో భూములు, ప్లాట్లు కోల్పోతున్న రైతులకు, యజమానులకు పరిహారం రెట్టింపు స్థాయిలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న బాధితులకు పరిహారం మూడురెట్లు అధికం కానుంది. అయితే పరిహారం నిర్ణయంలో భారీ తేడా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడంలేదు. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. సవరించిన పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అలైనమెంట్‌కే ప్రస్తుత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అలైనమెంట్‌ను మార్చే ప్రసక్తే లేదని, అవసరమైతే భూములు కోల్పోతున్న. రైతులకు పరిహారం పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ మేరకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన విలువ, బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ఎలా ఉందో పరిశీలించింది. జిల్లాలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో భూములు సేకరించాల్సి ఉంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఎకరానికి రిజిస్ట్రేషన విలువ రూ.3.37లక్షల నుంచి రూ.6.75లక్షల వరకు ఉంది. భువనగిరి, వలిగొండలో రూ.7.50లక్షల నుంచి రూ.13.50లక్షల వరకు ఉంది. చౌటుప్పల్‌లో రూ.12లక్షల వరకు రిజిస్ట్రేషన విలువ ఉంది. అయితే బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎకరానికి ఆయా ప్రాంతాల్లో రూ.కోటి నుంచి రూ.4కోట్లకు పైగా ధర ఉంది. ఇంటి స్థలం గజానికి రూ.800నుంచి రూ.3,500వరకు ప్రభుత్వ రిజిస్ట్రేషన ధర ఉండగా, బహిరంగ మార్కెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.6వేలు, అర్బన ప్రాంతాల్లో రూ.10నుంచి రూ.15వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.30వేలకు పైగా ఉంది. ప్రభుత్వం తాజాగా, తీసుకున్న నిర్ణయం ప్రకారం సవరించిన పరిహారం తుర్కపల్లి మండలంలో ఎకరాకు రూ.6.85లక్షల నుంచి రూ.11.47లక్షల వరకు పెరగనుంది. భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌లో పరిహారం పెంపుపై అధ్యయనం కొనసాగుతోంది.
అలైనమెంట్‌లో మార్పులు ఉండవు
ప్రస్తుతం ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డుకు 40 నుంచి 50కిలోమీటర్ల దూరం నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం దీనికే ఆమోదముద్ర వేసింది. జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్‌కు మొత్తం 1,927ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఉత్తరభాగంలో నిర్మించే ఈ రోడ్డు 158కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాతోపాటు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మాణం కానుంది. జిల్లాలో 34 గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుంది. చౌటుప్పల్‌లో 8 గ్రామాలు, వలిగొండలో 9, భువనగిరిలో 9, యాదగిరిగుట్టలో 2, తుర్కపల్లిలో 6 గ్రామల నుంచి ఈ రహదారి వెళ్లనుంది. ఉత్తర భాగంలో ఈ రహదారి 98.989కి.మీ నుంచి 118.188కి.మీ మైలురాయి వరకు మొత్తం 580.17ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
ఆర్‌ఆర్‌ఆర్‌కు ముమ్మరంగా భూసేకరణ
చౌటుప్పల్ టౌన, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రిజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) నిర్మాణానికి భూసేకరణ వేగవంతమైంది. అందులో భాగంగా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన పరిధిలో మొత్తం 784.160 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటికే అందులో 767.320 ఎకరాలకు 3జీ నోటిఫికేషనను అధికారులు జారీ చేశారు. మిగిలిన 16.24 ఎకరాలకు కొత్తగా నోటిఫికేషన జారీకి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భూ సేకరణ విషయమై చౌటుప్పల్, వలిగొండ మండలాల్లోని నిర్వాసితులతో ఆర్డీవో శేఖర్‌రెడ్డి నిర్వహిస్తున్న సమావేశాలు ఈ నెల 25తో ముగియనున్నాయి. ఈ సమావేశాలను నిర్వాసితులు బహిష్కరించడంతోపాటు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు పట్టుబడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ట్రిపుల్‌ఆర్ భూసేకరణను వేగవంతంగా పూర్తిచేసే దిశగా అధికారులు ముందుకువెళ్తున్నారు.
చౌటుప్పల్ మండలంలో 411 మందికి చెందిన 392.105 ఎకరాలు, వలిగొండ మండలంలో 407 మందికి చెందిన 392.055 ఎకరాల భూమిని ట్రిపుల్‌ఆర్‌కు అధికారులు సేకరించనున్నారు. అందులో 767.32ఎకరాలకు 3జీ నోటిఫికేషన జారీ చేసిన రెవెన్యూశాఖ అధికారులు రైతులతో తుది సమావేశాలను నిర్వహిస్తున్నారు. మిగిలిన 16.24 ఎకరాలకు కొత్తగా నోటిఫికేషన జారీ చేయాల్సి ఉంది. 3జీ నోటిఫికేషనపై సమావేశాలు పూర్తి కాగానే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అధికారులు సేకరించనున్న భూముల్లో వ్యవసాయ భూములతో పాటు వ్యాపార, నివాస గృహాల ప్లాట్లు సైతం ఉన్నాయి. నిర్వాసితుల్లో కొందరి పేర్లు రెండుసార్లు నమోదైంది. వీటిని పరిష్కరించాల్సి ఉంది.
కొత్తగా 16.24ఎకరాలు
కొత్తగా చౌటుప్పల్ మండలంలో 12.21ఎకరాలు, తంగడపల్లిలో 1.21, తాళ్ల సింగారంలో 2.22 ఎకరాలకు నోటిఫికేషన జారీకి రెవెన్యూశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటగా 767.320 ఎకరాలకు జారీచేసిన నోటిఫికేషనలో ఈ భూములకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. దీంతో 16.24 ఎకరాలకు కొత్తగా నోటిఫికేషన జారీ చేయాల్సి వస్తోంది.
భూమికి బదులు భూమి ఇవ్వాలి
ఆర్‌ఆర్‌ఆర్‌లో కోల్పోతున్న భూములకు బదులుగా భూములు ఇవ్వాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని చౌటుప్పల్ మండలంలోని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి, తహాసీల్దార్ హరికృష్ణ సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని భూ నిర్వాసితులు బహిష్కరించి, ధర్నా చేశారు. ధర్నాలో భూ నిర్వాసితులు చింతల దామోదర్‌రెడ్డి, డబ్బటి రాములు, గుజ్జుల సురేందర్‌రెడ్డి, చింతల సుధాకర్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్, ఏనుగు ప్రతాప్ రెడ్డి, ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
డివిజన్ల వారీగా సేకరించే భూమి ఇలా..
డివిజన నుంచి వరకు సేకరించే భూమి
భువనగిరి 118.188కి.మీ 133.178కి.మీ 492
చౌటుప్పల్ 133.178కి.మీ 158.64కి.మీ 784.16
దీనికి అదనంగా చౌటుప్పల్ వద్ద జంక్షన్ల కోసం 188ఎకరాల భూసేకరణకు అధికారులు నోటిఫికేషన జారీచేశారు. ఈరెండు డివిజన్ల పరిధిలో సర్వే పనులు పూర్తికాగా,అవార్డు పాస్‌కోసం విచారణ కొనసాగుతోంది.
చౌటుప్పల్ మండలంలో గ్రామాల వారీగా..
గ్రామాలు ఎకరాలు రైతులు
లింగోజీగూడెం 2.345 5
చౌటుప్పల్ 145.120 79
తాళ్లసింగారం 65.030 82
చిన్నకొండూరు 84.350 96
నేలపట్ల 80.145 133
తంగడపల్లి 14.310 16
మొత్తం 392.105 411
వలిగొండ మండలంలో గ్రామాల వారీగా..
గ్రామాలు ఎకరాలు రైతులు
పహిళ్వానపూర్ 110.245 152
గోకారం 34.030 10
పొద్దటూరు 99.175 162
వర్కట్‌పల్లి 44.115 12
రెడ్లరేపాక 103.295 71
మొత్తం 392.055 407