Share News

ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:31 AM

ప్రతి ఒక్కరికీ గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు ఉన్నట్లే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిజిటల్‌ అపార్‌ పేరిట కార్డులను అందజేస్తోంది.

ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు

వన నేషన.. వన స్టూడెంట్‌ పేరిట విద్యార్థులకు అపార్‌ డిజిటల్‌ కార్డు

13 అంకెలతో కార్డు జారీ

విద్యార్థుల సమగ్ర వివరాలన్నీ అందులో సంక్ష్లిప్తం

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)

ప్రతి ఒక్కరికీ గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు ఉన్నట్లే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిజిటల్‌ అపార్‌ పేరిట కార్డులను అందజేస్తోంది. వన నేషన, వన స్టూడెంట్‌ పేరిట కేంద్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రిత్వ శాఖ దేశంలోని విద్యార్థులందరికీ ఈ కార్డులను అందజేయ నుంది. ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను యూ డైస్‌లో నమోదు చేస్తున్నారు. కానీ మరిన్ని వివరాలతో అపార్‌ కార్డులను జారీ చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యార్థుల వివరాల నమోదు ప్రారంభమైంది. అయితే ఒక్కసారి అపార్‌ కార్డు, నెంబర్‌ కేటాయించాక ఎడిట్‌ ఆప్షన లేకపోవడంతో జాగ్రత్తగా విద్యార్థుల వివరాలను పాఠశాలల్లోనే అపార్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే కార్డులు విద్యార్థులకు చేరనున్నాయి.

ఆధార్‌ కార్డు విద్యార్థులకు గుర్తింపు నెంబర్‌గా మాత్రమే ఉండగా, యూ డైస్‌తో వారి చదువు వివరాలు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంది. కానీ అపార్‌తో కేటాయించనున్న 13 అంకెల నెంబరు ఆ విద్యార్థికి జీవితకాలం ఉపయోగకరంగా ఉండనుంది. ఆధార్‌ నెంబర్‌ లాగే అపార్‌ నెంబర్‌ కూడా జీవితకాలం ఒక్కరికే ఉంటుంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పాఠశాల, కళాశాలల వివరాలు, సాధించిన మార్కులు, గ్రేడ్‌లు, సర్టిఫికెట్లు, క్రీడలు ఇతర రంగాల్లో విద్యార్థి సాధించిన విజయాలు అపార్‌ కార్డులో డిజిటల్‌ రూపకంలో సంక్ష్లిప్తం చేయనున్నారు. అపార్‌ కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన చేస్తే ఆ విద్యార్థి సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం ప్రతి ఏడాది ఆ కార్డును విద్యా సంస్థల్లోనే అప్‌డేట్‌ చేస్తుంటారు. అర్ధాంతరంగా చదువు మానేసినా, ఉన్నత చదువులు పూర్తయిన విద్యార్థులు కూడా ప్రైవేట్‌గా అపార్‌కార్డును పొందవచ్చు. వనటైం రిజిస్ర్టేషన (ఓటీఆర్‌) మాదిరిగా ఉండే అపార్‌ కార్డుతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, సర్టిఫికెట్ల పరిశీలన సులవు అవుతుంది. అలాగే అవసరమైన సర్టిఫికెట్లను కూడా అపార్‌ కార్డు ద్వారా డౌనలోడ్‌ చేసుకోవచ్చు. అపార్‌ కార్డు వెంట ఉంటే సర్టిఫికెట్లన్నీ జేబులో ఉన్నట్లే భావించవచ్చని విద్యా శాఖ అధికారులు అంటున్నారు.

ఎడిట్‌ ఆప్షన లేదు

ఒకసారి అపార్‌ కార్డు, నెంబర్‌ జారీ అయ్యాక ఎడిట్‌ ఆప్షన ఉండదు. దీంతో అపార్‌ కార్డు కోసం వివరాల నమోదులోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పాఠశాల విద్యార్థులకు ఆధార్‌కార్డు ప్రామాణికం కానుండగా కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అలాగే అపార్‌ యాప్‌లో విద్యార్థుల వివరాల నమోదుకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి. ఈ మేరకు ఇటీవలే నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశాల్లో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు అపార్‌ కార్డు ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరించారు. ఆధార్‌కార్డులో ఉన్న విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా తదితర వివరాలే అపార్‌లో వస్తాయి. ఆప్షన్స ఆధారంగా తల్లిదండ్రుల సమ్మతితో ఇతర వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారు. దీంతో అపార్‌ నమోదులో ఉపాధ్యాయులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

పాఠశాలల్లోనే నమోదు

అపార్‌ వివరాలను పాఠశాలల్లోనే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నమోదు చేస్తున్నారు. అయితే ఇంటర్‌నెట్‌, కంప్యూటర్లు లేని పాఠశాలల్లో అపార్‌ నమోదు ఇబ్బందిగా మారుతోంది. మరికొన్ని పాఠశాలల్లో అన్నిసౌకర్యాలు ఉన్నప్పటికీ తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులతో అపార్‌ నమోదు క్లిష్టంగా మారుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠశాల, ఇంటర్‌ విద్యార్థుల అపార్‌ నమోదును జిల్లా విద్యా శాఖలు పర్యవేక్షిస్తుండగా ఆపై కోర్సుల విద్యార్థు అపార్‌ నమోదును సంబంధిత యాజమాన్యాలు పర్యవేక్షించనున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సుమారు 3,215 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2,11,915 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే సుమారు 1,200 ప్రైవేట్‌ పాఠశాలల్లో సుమారు 1,75,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా ఇంటర్‌ ఆ పై స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారుగా 60వేల మంది వరకు ఉన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,46,915 మంది విద్యార్థులకు అపార్‌ కార్డులు జారీ కానున్నాయి.

అపార్‌నమోదును చేపట్టాం

పాఠశాలల్లో అపార్‌ నమోదును ప్రారం భించాం. తల్లిదండ్రుల సమావేశాల్లో కార్డు ఆవశ్యకతను వివరిస్తూ వారి సమ్మతిని తీసుకున్నాం. పిల్లల అపార్‌ నమోదు కోసం తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలలకు వెళ్లాలి.ఎడిట్‌ ఆప్షన లేనందున వివరాల నమోదు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరలో కార్డులు జారీ కానున్నాయి.

సత్యనారాయణ, డీఈవో యాదాద్రి భువనగిరి

501మంది వివరాలు నమోదు చేశాం

యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 501మంది వివరాలను నమోదు చేశాం. అన్ని పాఠశాలల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యలతో వివరాల నమోదులో ఆలస్యమవుతోంది. ప్రతి విద్యార్థి అపార్‌ కార్డును పొందాలి. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలి. అపార్‌ ద్వారా ఉన్నత విద్యకు, ఉద్యోగాల దరఖాస్తులకు, పరిశీలన సులువవుతోంది.

తిరుమల శ్రీహరి అయ్యంగార్‌, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌, యాదాద్రి జిల్లా

Updated Date - Dec 07 , 2024 | 12:31 AM