యాదగిరీశుడి సన్నిధిలో ఏకాదశి లక్షపుష్పార్చనలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:53 PM
ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.
క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 6: ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి స్వర్ణసింహాసనంపై అధిష్ఠింపజేశారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకస్వాములు, వేదపండితులు వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు చేశారు. సుమారు రెండు గంటలపాటు పుష్పార్చన పర్వాలు కొనసాగగా.. పుష్పార్చనలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీస్సులు అందజేశారు. ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణం శాసో్త్రక్తంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి విశేషపూజలు కొనసాగాయి. కొండపైన ప్రధానాలయం, విష్ణుపుష్కరిణి, శివాలయం, పాతగుట్ట ఆలయాల్లోని ఆంజనేయస్వామిని కొలుస్తూ అర్చకులు వేదమంత్రపఠనాలతో అభిషేకించి నాగవల్లీదళాలతో అర్చించారు. శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, యాగశాలలో నిత్యరుద్రహవనం స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.17,70,079 ఆదాయం సమకూరిందని, సుమారు 10వేల మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు.