Share News

పీవీ ఆలోచనల ప్రతిరూపం.. సర్వేల్‌ గురుకులం

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:18 AM

యాదాద్రిభువనగిరి జిల్లాలోని సంస్థాననారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల విద్యాలయంతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు విడదీయరాని అనుబంధం ఉంది.

పీవీ ఆలోచనల ప్రతిరూపం.. సర్వేల్‌ గురుకులం

సంస్థాన నారాయణపురం ఫిబ్రవరి 9 : యాదాద్రిభువనగిరి జిల్లాలోని సంస్థాననారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల విద్యాలయంతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు విడదీయరాని అనుబంధం ఉంది. పీవీ నరసింహారావుకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో ఉన్న జ్ఞాకాలను సర్వేల్‌ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పేదరికంలో మగ్గుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని దారిధ్యరేఖకు దిగువన ఉన్న పిల్లలకు చక్కటి విద్యాబోధన అందించాలన్నది పీవీ ఆలోచన. ఆయన ఆలోచనలోంచి రూపుదిద్దుకున్నదే సర్వేల్‌ గ్రామంలో ఏర్పాటైన దేశంలోనే మొట్టమొదటి గురుకుల విద్యాలయం. 1970లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు సర్వేల్‌ గ్రామంలోని సర్వోదయ ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పాల్వాయి గోవర్ధనరెడ్డి సర్వేల్‌ గ్రామంలో ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. ఆయన అడిగిందే తడువుగా గ్రామంలో గురుకుల విద్యాలయం ఏర్పాటుకు అనుమతిఇచ్చారు. తన కలను సాకారం చేయడానికి పీవీ వెంటనే ప్రణాళికలు రూపొందించారు. పూర్వపు గురుకులాలను తలపించే రీతిలో ఆధునిక గురుకుల విద్యాలయాన్ని రూపొందించాలనుకున్నారు. దీని నిర్మాణానికి సర్వేల్‌ గ్రామానికి చెందిన సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి ముందుకొచ్చారు. నారాయణరెడ్డి తన ఆశ్రమానికి చెందిన 40 ఎకరాల భూమిని దానం చేశారు. అంతరం పీవీ నరసింహారావు సీఎం హోదాలో మళ్లీ సర్వేల్‌ గ్రామాన్ని సందర్శించారు. సర్వోదయ ఆశ్రమంలో ఏర్పాటుచేసిన దేశంలోనే మొట్టమొదటి గురుకుల విద్యాలయాన్ని 1971 నవంబరు 23 సీఎం హోదాలో పీవీ నరసింహారావు ప్రారంభించారు. ఆనాడు పీవీ సర్వేల్‌ గ్రామంలో ప్రారంభించిన గురుకుల విద్యాలయం ఎంతో సత్ఫలితాలను ఇచ్చింది. సర్వేల్‌ గురుకుల విద్యాలయం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం 1972 మార్చి 1న స్వయం పరిపాలన అధికారం గల ప్రత్యేక గురుకుల విద్యాలయ సంస్థను ఏర్పాటుచేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక గురుకుల విద్యాలయాలు ఆవిర్భవించాయి. దీంతో గురుకుల విద్యాలయాలకు రూపకర్తగా పీవీ మారారు. పీవీ ఆలోచనలకు ప్రతిరూపంగా ఆవిర్భవించిన గురుకుల విద్యాలయాలు ఎంతోమంది లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాయి.

Updated Date - Feb 10 , 2024 | 12:18 AM