Share News

మరణంలోనూ నీవెంటే...

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:59 PM

మూడుముళ్ల బంధంతో 50 ఏళ్లకు పైగా కలిసిమెలసి జీవించిన ఆ దంపతులు కుమారుల ఆదరణ లేక తనువు చాలించాలనుకున్నారు.

మరణంలోనూ నీవెంటే...
మల్లెబోయిన లింగయ్య, పెంటమ్మ(ఫైల్‌ఫొటో)

మాడ్గులపల్లి, ఫిబ్రవరి 8: మూడుముళ్ల బంధంతో 50 ఏళ్లకు పైగా కలిసిమెలసి జీవించిన ఆ దంపతులు కుమారుల ఆదరణ లేక తనువు చాలించాలనుకున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా, భర్త అదే రోజు, చికిత్స పొందుతూ భార్య గురువారం మృతి చెందింది. నాలుగు రోజుల వ్యవధిలో దంపతుల మృతితో నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరా లిలా ఉన్నాయి. ఆగామోత్కూరు గ్రామానికి చెందిన మల్లెబోయిన లింగయ్య(86), పెంటమ్మ(80) దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. లింగయ్య తన మూడు ఎకరాల భూమిని ముగ్గురు కుమారులకు పంచాడు. పెద్దకుమారుడు సైదులు మండలంలోని యాద్గిరిపల్లిలో ఉంటున్నాడు. అదే గ్రామంలో ఉండే రెండో కుమారుడు రాములు చనిపోగా, చిన్నకుమారుడు శ్రీను ఆగామోత్కూరులో వేరుగా ఉంటున్నాడు. లింగయ్య దంపతులు గ్రామంలోని స్వగృహంలో ఉంటున్నారు. భూమి పంపిణీకి ముందు రైతుబంధుతో పాటు పింఛన డబ్బులతో జీవితం గడిపేవారు. కొద్దికాలంగా కుమారులు ఆదరించకపోవడం, రైతుబంధు నగదు కూడా వారికే దక్కుతుండటం, అనారోగ్యం, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో జీవితంపై విరక్తి చెందారు. ఈ నెల 5వ తేదీ రాత్రి పురుగుల మందు తాగి సొమ్మసిల్లిపడిపోయారు. ఇంట్లోకి వెళ్లిన స్థానికులు గమనించి 108 నెంబరుకు సమాచారమిచ్చారు. ఆ వాహనం వచ్చేసరికే భర్త లింగయ్య మృతి చెందాడు. అప్పటికే అపస్మారకస్థితిలో ఉన్న పెంటమ్మ(80)ను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మరణంలోనూ నీవెంటే అంటూ మృత్యుఒడిలోకి వెళ్లింది. ఇరువురి మృతి స్థానికులకు కంటతడి పెట్టించింది. ఇలాంటి కష్టం ఏ వృద్ధ దంపతులకు రావొద్దని స్థాని కులు వాపోయారు. పెంటమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. గురువారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా తమ తల్లిదండ్రులు లింగయ్య, పెంటమ్మలు కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని కుమార్తె మంగ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

Updated Date - Feb 08 , 2024 | 11:59 PM