సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:29 AM
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలు సిద్ధమయ్యాయి.
రేపటి నుంచి 21 వరకు పోటీలు
నల్లగొండ స్పోర్ట్స్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా గ్రామీణ, పట్టణ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గ్రామీణ, మండల, మునిసిపాలిటీ స్థాయిల్లో పలుక్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న జిల్లా స్థాయి సీఎం క్రీడా పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియం, ఇండోర్ స్టేడియంతో పాటు మిర్యాలగూడలోని ఎనఎస్పీ క్యాంప్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే స్టేడియంలో ఉన్న వసతులను ఉపయోగించి క్రీడాంశాలకు తగినట్లుగా కోర్టులను తయారుచేశారు. ఆయాచోట్ల పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులను ఆటల పోటీల నిర్వహణకు నియమించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడా పోటీలకు కావాల్సిన సౌకర్యాలను డీఎ్‌సడీవో కే నర్సిరెడ్డి కల్పించారు. మండల, మునిసిపాలిటీ స్థాయిలోని వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన బాల , బాలికలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు క్రీడల శాఖ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించనున్నారు.
క్రీడా పోటీలు ఇవే..
మేకల అభినవ్ స్టేడియంలో ఈ నెల 16న కబడ్డీ పోటీలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదేరోజున మిర్యాలగూడలోని ఎనఎస్పీ క్యాంప్‌లో బేస్‌బాల్ పోటీలు, 17వతేదీన ఖోఖో, బ్యాడ్మింటన, జూడో పోటీలు మేకల అభినవ్ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. 18వ తేదీన వాలీబాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. 19వ తేదీన అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, తైక్వాండో పోటీలు జరగనున్నాయి. 20వ తేదీన హాకీ, నెట్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్, యోగ పోటీలు జరుగుతాయి. మేకల అభినవ్ స్టేడియంతో పాటు ఎన్జీ కళాశాల మైదానం, ఇండోర్ స్టేడియాల్లో 21వ తేదీన హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్(ఉమ్మడి నల్లగొండ జిల్లా) పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు సుమారు 1000మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. ఐదు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలతో అవుట్ డోర్, ఇండోర్, ఎన్జీ కళాశాల మైదానాలు సందడిగా మారనున్నాయి.