Share News

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:56 PM

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
రైతు భీమాతో మాట్లాడుతున్న తుంగతుర్తి తహసీల్దార్‌ దయానందం

తుంగతుర్తి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఐకేపీ కేంద్రాల్లో నాణ్యతా పరిశీలకులు ఎంపిక చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లుకు పంపాక మిల్లర్‌ ఽధాన్యం బాలేదని కొర్రీలు పెడుతూ బస్తాకు కిలో, రెండు కిలోలు కోతపెట్టి రైతులను నిలువునా ముంచుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్‌ మిల్లర్‌ దిగుమతి చేసుకోకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి తిప్పిపంపడంతో రైతు దంపతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం... తుంగతుర్తి మండలంలోని చౌళ్లతండాకు చెందిన గుగులోతు భీమా దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణ భూమిని కౌలుకు తీసుకుని వరి సాగుచేశారు. అందులో పండించిన ధాన్యాన్ని ఈ నెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రంలో పోశారు. ఆరబెట్టి, తూర్పారబట్టాక ఏఈవో ధాన్యం తేమశాతాన్ని, నాణ్యతను పరిశీలించి కొనుగోలుకు ఎంపిక చేశారు. ఆ ధాన్యాన్ని ఈ నెల 16న కాంటా వేశారు. భీమాకు చెందిన 425 బస్తాలతోపాటు మరో ఇద్దరు రైతులవి 263 బస్తాలు కలిపి మొత్తం 688 బస్తాలు ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్‌మిల్లుకు ఎగుమతి చేశారు. మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ధాన్యం నల్లగా ఉందంటూ దించుకోకుండా ఐకేపీ కేంద్రానికి సమాచారమిచ్చారు. దీంతో రైతు భీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా ధాన్యం బాగా లేదని బస్తాకు మూడు కిలోలు తరుగు తీస్తామని మిల్లు నిర్వాహకులు చెప్పారు. అందుకు రైతు భీమా అంగీకరించకుండా తరుగు తీయకుండా దించుకోవాలని బతిమిలాడినా మిల్లు నిర్వాహకుడు ఒప్పుకోలేదు. తరుగుతీస్తే తాను ఒప్పుకునేది లేదని రైతు తిరిగి వచ్చాడు. మిల్లు నిర్వాహకులు ఆ ధాన్యం దించుకోకుండా శనివారం ఉదయం తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపించారు. ఐకేపీ నిర్వాహకులు ధాన్యం లారీ తిరిగి వచ్చిందని చెప్పడంతో రైతు భీమా దంపతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని లారీ వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. ఒంటిపై పెట్రోలు పోసుకుంటుండగా కేంద్రంలో ఉన్న తోటి రైతులు చూసి వారి చేతిలోని పెట్రోల్‌ డబ్బాను లాగేశారు. విషయాన్ని స్థానిక తహసీల్దార్‌ దయానందంకు తెలిపారు. వెంటనే తహసీల్దార్‌, డీటీ కంఠ్లమయ్య, ఏవో బాలకృష్ణ, ఏపీఎం రాంబాబు ఐకేపీ కేంద్రానికి చేరుకున్నారు. రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మిల్లు యజమానితో మాట్లాడి తరుగు లేకుండా దించుకుకోవాలని తిరిగి మిల్లుకు పంపారు. ఆ మిల్లుకు వెళ్లిన ధాన్యానికి బస్తాకు ఒక కిలో చొప్పున కోత విధిస్తున్నారని చెబుతున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:56 PM