24 గంటల ఆసుపత్రుల్లో అరకొర సేవలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:05 AM
జిల్లాలోని 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతంతమాత్రపు సేవలు అందుతున్నాయి. వైద్యుల, సిబ్బంది కొరతతో ఉదయం పూటకే సేవలు పరిమితమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట సిటీ, తిరుమలగిరి, తుంగతుర్తి, మోతె, కోదాడ రూరల్)
జిల్లాలోని 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతంతమాత్రపు సేవలు అందుతున్నాయి. వైద్యుల, సిబ్బంది కొరతతో ఉదయం పూటకే సేవలు పరిమితమవుతున్నాయి. సాయంత్రమైతే కొన్నిచోట్ల కిందిస్థాయి సిబ్బంది సేవలు అందిస్తున్నారు. సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత వెరసి పేరుగొప్ప ఊరు దిబ్బలా మారింది ప్రభుత్వ 24 గంటల ఆసుపత్రుల పనితీరు. జాతీయ రహదారిపై ఉన్న ప్రధానమైన కోదాడ పట్టణంలోని ఆసుపత్రిలో ఎక్స్‌రే కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మధ్యాహ్నం వరకు వైద్యులు ఉంటున్నారు. ఆ తర్వాత వారి కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
జిల్లాలోని 24 గంటల ఆసుపత్రుల్లో వైద్యసేవల కొరత నెలకొంది. ఉన్నతాధికారుల అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి రోగుల కు సరైన సేవలు అందడం లేదు. దీనికి తోడు మందులు, వైద్యసిబ్బంది కొరత ఉండనే ఉంది. దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్ర యించాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ -విజయవాడ, సూర్యాపేట-ఖమ్మం రహదారులపై ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షత గాత్రులకు సకాలంలో వైద్యం అందించేందుకు కోదాడ, మోతె ఆసుపత్రు ల్లో సరైన సౌకర్యాలు లేవు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్నా హ్నాం 12 గంటలు దాటితే సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కూడా కనిపించకపోవడంతో రోగులకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులందరికీ సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఉండటమే ప్రధాన కారణమని రోగులు ఆరోపిస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలోనే పూర్తి సమయం వైద్యం చేయాల్సి ఉండగా కేవలం చుట్టపు చూపుగా ఆసుపత్రికి వచ్చి పోతున్నారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలో ఉదయం వచ్చిన రోగులకే వైద్యం అందుతుంది. సుదూర ప్రాంతాల నుంచి ఆలస్యంగా వచ్చిన రోగులకు వైద్యం అందడంలేదు. డాక్టర్ వెళ్లిపోయాడు, మరుసటి రోజు రండి అనే సమాధానం ఎదురవుతోంది. డాక్టర్లు ఏ సమయంలో వస్తారో? ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. వైద్యులపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సేవలు అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించిన రోగులను విసిగించవద్దని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధానమైన ఆరుగురు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు గైనకాలజిస్టులతో పాటు ఇద్దరు జనరల్ మెడిసిన, ఒక న్యూటీషన పోస్టు ఖాళీ ఉన్నట్లు సమాచారం.
తిరుమలగిరిలో సాయంత్రమైతే తాళం
తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల ఆసుపత్రి ఉన్నా ఉదయం పూట మాత్రమే సేవలందుతున్నాయి. ప్రతి రోజూ సుమారు 60 నుంచి 70 మంది రోగుల ఆసుపత్రికి వస్తుంటారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత తాళం వేస్తున్నారు. దీంతో రోగులు తాళం వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు. స్థోమత లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
సకాలంలో అందని 108 సేవలు
తిరుమలగిరి మండలంలో 108 వాహనం లేదు. ఎవరికైనా ఆపద వస్తే సమీపంలోని అర్వపల్లి మండలం నుంచి రావాల్సి ఉంటుంది. రెండు మండలాల మధ్య దూరం 20 కిలోమీటర్లు దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో 108 సమాచారం అందినా సకాలంలో రాలేకపోవడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాణిజ్యపరంగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తిరుమలగిరికి 108 వాహనం కేటాయించాల ని ప్రజలు కోరుతున్నారు.
తుంగతుర్తి సీహెచసీలో సిబ్బంది కొరత
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రి పనితీరు పేరు గొప్ప, ఊరు దిబ్బగా ఉంది. ఆసుపత్రిని సామాజిక ఆరోగ్యకేంద్రంగా అప్‌గ్రేడ్ చేసినా పూర్తిస్థాయి సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుతున్నా యి. డాక్టర్లు లేకపోవడంతో కాన్పులు జరిగే పరిస్థితి లేదు. వైద్యులను నియమించి, మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎక్స్‌రే కోసం బయటకు వెళ్లాల్సిందే...
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారితో పాటు ఖమ్మం జిల్లా కేంద్రానికి రాకపోకలతో కోదాడ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యం. అయినా కోదాడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆసుపత్రిలో వైద్యులు, మందుల కొరత తీవ్రంగా ఉంది. 12 మంది వైద్యులకు గాను ఆరుగురు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలలుగా ఎక్స్‌రే సౌకర్యం లేదు. అవసరమైన వారు రోగులు ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామన్న హామీలు నేటికీ అమలుకాలేదు. ట్రైనీ వైద్య విద్యార్థులతో కాలం వెల్లబుచ్చుతున్నారు. 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు చేపట్టలేదు.
కుక్క, పాముకట్లకు మందులు లేవు. ల్యాబోరేటరీ లేకపోవడంతో రక్తనమూనాలను సూర్యాపేట ఆసుపత్రికి పంపించి పరీక్షిస్తున్నారు. అయితే ఇటీవల ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి ఆసుపత్రిలో మందులు, వైద్యుల కొరతపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు.
నిత్య సమస్యలతో ఆరోగ్య కేంద్రాల్లో
మోతె మండలంలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. విషజ్వరాలు ప్రబలుతున్నా విధుల నిర్వణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ నుంచి గ్రామాల్లో పనిచేసే ఏఎనఎంల వరకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రంలో నిత్యం విషసర్పాలు కనిపిస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. 24 గంటల ఈ ఆసుపత్రికి ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే సేవలందుతున్నాయి. ఆసుపత్రి గదుల్లో స్లాబ్ పెచ్చులూడుతున్నాయి. కిటికీలు శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలంలో గదుల్లోకి నీరు లీకవుతోంది. అటు సిబ్బంది లేక, ఇటు సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఆసుపత్రికి రావడం తగ్గించారు. సాయంత్రం నుంచి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. సూపర్‌వైజర్, యూడీసీ, రక్త పరీక్ష నిర్వాహకుడు, ఏఎనఎంలతో పాటు పలువురు పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు