Share News

‘వసూల్‌ రాజా’పై చర్యలకు రంగం

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:50 AM

మిర్యాలగూడ పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ ఎస్‌ఐ అక్రమార్జన వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన ‘వసూల్‌ రాజా’ కథనం కలకలం రేపింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాల ఆధారంగా సదరు ఎస్‌ఐ వ్యవహారశైలిపై ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ ఆరా తీశారు.

‘వసూల్‌ రాజా’పై చర్యలకు రంగం

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

స్టేషన్‌ను సందర్శించి వివరాలు సేకరించిన మిర్యాలగూడ డీఎస్పీ

ఆరా తీసిన రాష్ట్ర, జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారులు

అదే సబ్‌డివిజన్‌లో మరిన్ని ఠాణా బాస్‌ల తీరు ఇలానే ఉందని ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లు

నల్లగొండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): మిర్యాలగూడ పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ ఎస్‌ఐ అక్రమార్జన వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన ‘వసూల్‌ రాజా’ కథనం కలకలం రేపింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాల ఆధారంగా సదరు ఎస్‌ఐ వ్యవహారశైలిపై ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు సదరు పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించారు. ఆ ఎస్‌ఐ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, కేసులు నమోదు చేయని వాటి వివరాలు, జనరల్‌ డైరీలో పేర్కొన్న అంశాలు, తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కొన్ని ఫైళ్లను సీజ్‌ చేసి తీసుకెళ్లారు. డీఎస్పీ తన తనిఖీలో వెల్లడైన వివరాలను ఎస్పీకి నివేదించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు సైతం ఈ కథనంపై ఆరా తీశారు. ఏ స్టేషన్‌, సదరు ఎస్‌ఐ వ్యవహార శైలి, వచ్చిన ఫిర్యాదులు, ఇతర ఆరోపణలపైనా ఇంటెలిజెన్స్‌ అధికారులు లోతుగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. జిల్లా స్థాయి పోలీస్‌ ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా అతడి వ్యవహారాలపై ఆరా తీసి సమగ్ర నివేదికను రూపొందించినట్టు సమాచారం. ఈ కథనం ప్రచురితమయ్యాక ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి పలువురు ఫోన్‌చేసి మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలోని జాతీయరహదారిపై ఉన్న మరో రెండు స్టేషన్ల పరిధిలోనూ ఇదే స్థాయిలో వ్యవహారాలు కొనసాగుతున్నాయని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. చట్టాన్ని కాపాడి, న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే అడ్డగోలుగా ముడుపులు తీసుకుంటూ అమాయకులను వేధిస్తున్నారని, అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు స్టేషన్ల కార్యకలాపాలపైనా జిల్లా పోలీ్‌సబాస్‌ దృష్టి సారించి విచారణ చేయిస్తే వారి ఆగడాలు వెలుగులోకి వస్తాయని బాధితులు మొరపెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, డీఎస్పీ, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వచ్చే నివేదికల అనంతరం శాఖాపర చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - Sep 07 , 2024 | 12:50 AM