Share News

వెతలూ తీర్చండి

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:16 AM

‘‘గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్‌ పరబ్రహ్మ, తస్మైశ్రీ గురు వేనమః’’.. అంటూ సమాజంలో గురువులకు మొదటినుంచి గౌరవనీయమైన, ప్రత్యేక స్థానం దక్కింది.

వెతలూ తీర్చండి

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గుర్తుచేస్తున్న టీచర్లు

ఒకటో తేదీ వేతనాల పట్ల సర్వత్రా హర్షం

పెండింగ్‌ బిల్లులకు మోక్షం కల్పించాలని విన్నపం

తక్షణం స్కావెంజర్ల నియామకాలు చేపట్టాలని సూచన

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): ‘‘గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్‌ పరబ్రహ్మ, తస్మైశ్రీ గురు వేనమః’’.. అంటూ సమాజంలో గురువులకు మొదటినుంచి గౌరవనీయమైన, ప్రత్యేక స్థానం దక్కింది. భారత తొలి ఉపరాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినమైన సెప్టెంబరు 5న ప్రతియేటా దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసందర్భంగా వివిధ స్థాయిల్లోని ఉపాధ్యాయులకు అవార్డులివ్వడం, ప్రశంసలందించడంతోపాటు గురువుల సేవలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేద పిల్లలకు.. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యనందించే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ఈ సందర్భంగానైనా పరిష్కరించాలనే సూచనలు ఉపాధ్యాయ వర్గాలనుంచి వస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటినుంచి ప్రతినెలా 1, 2వ తేదీలలో వేతనాలు ఇస్తుండడాన్ని ప్రశంసిస్తున్న ఉపాధ్యాయులు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతులను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించడాన్ని ప్రశంసించారు. అయితే ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిపైనా ప్రభుత్వం దృష్టిసారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లాలనే ఉత్సాహం కలిగే వాతావరణం పాఠశాలల్లో నెలకొల్పాలని, ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ కొనసాగించాలని కోరుతున్నారు.

పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలనేదే ప్రధాన డిమాండ్‌

ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణం మంజూరు చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు పెండింగ్‌లో ఉన్నవి పరిష్కరించడంతోపాటు, ఇక నుంచైనా ఉద్యోగ విరమణ రోజునే అన్ని బెనిఫిట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జీపీఎ్‌ఫలు, సరెండర్‌ లీవులు, మెడికల్‌ బిల్లులకు సంబంధించి ఏళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణం వీటికి నిధులు మంజూరుచేసి ఆదుకోవాలని కోరుతున్నారు. బిల్లులు పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా మార్గదర్శకాలివ్వాలని కోరుతున్నారు. వీటితోపాటు ప్రధానంగా కొన్నేళ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రధాన సవాల్‌గా మారిన సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం)ని రద్దుచేసి ఓపీఎస్‌ (ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం)ని అమలు చేయాలని కోరుతున్నారు. ఓపీఎస్‌ అమలుకు ఎన్నికల సందర్భంలో హామీలిచ్చారని, అమలుకు కృషి చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పలు పాఠశాలల్లో ఇటీవల బదిలీల తర్వాత ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, వాటన్నింటినీ భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్కావెంజర్ల సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం అంగీకరించి, జీవో విడుదల చేసిందని కానీ స్కావెంజర్ల నియామకాలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు కొనసాగుతున్నాయని, తక్షణమే స్కావెంజర్ల నియామకాలు చేపట్టాలని కోరారు. పలు పాఠశాలల్లో తరగతిగదుల కొరత ఉందని, అదేవిధంగా ఆటస్థలాల ఇబ్బందులున్నాయని వాటన్నింటినీ పరిష్కరించి, ఉపాధ్యాయులు పనిచేసేవాతావరణం పాఠశాలల్లో కల్పించాలని కోరుతున్నారు.

ఆరోగ్యకార్డులపై నిర్ణయం తీసుకోవాలి

ఉపాధ్యాయ, ఉద్యోగులకు వైద్యసదుపాయాల నిమిత్తం అమల్లో ఉన్న ఈహెచ్‌ఎ్‌స (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం) అమలు సక్రమంగా లేకపోవడం తో ఉపాధ్యాయులు వైద్యఖర్చులకు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. అత్యవసర సందర్భాల్లో, ప్రధానమైన రోగాలు, జబ్బులు వచ్చినప్పుడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఈ స్కీమ్‌ని అమలు చేయకపోతుండడంతో ఉపాధ్యాయుల కు అవస్థలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఈస్కీమ్‌ స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్యకార్డులు జారీచేయాలని, ఏ కార్పొరేట్‌ ఆసుపత్రిలోనైనా అది అమలయ్యేలా చూడాలని, ప్రత్యేకంగా ఇందుకోసం మూలవేతనం నుంచి 1శాతం మే ర కాంట్రిబ్యూషన్‌ కూడా చెల్లిస్తామని గతంలో ఉపాధ్యాయ, ఉద్యోగసంఘాలు ప్రభుత్వాలకు కూడా విన్నవించిన నేపథ్యంలో ఈ ఆరోగ్యపథకం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, రిటైర్డ్‌ ఉద్యోగుల వైద్యసేవల నిమిత్తం ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్లు నామమాత్రంగా మారిపోయాయి. వైద్యుల కొరత, మందుల కొరతతో నామమాత్రపు సేవలు కూడా అందకపోవడంతో పలువురు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని, ఈ ప్రభుత్వం వెల్‌నెస్‌ సెంటర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలకు చరమగీతం పాడాలని సూచన

పేద, దళిత, గిరిజన, వెనకబడినవర్గాల బాలికలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించే లక్ష్యంతో నెలకొల్పిన కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా ల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది పలు సమస్యలను ఎదుర్కొంటున్నా రు. ఈ ఉపాధ్యాయులంతా మహిళలే కావడంతోపాటు, వీరం తా తప్పనిసరిగా ఆయా పాఠశాలలున్న చోటే నివసించాల్సి ఉంటుండడంతో ఆమేరకు సదుపాయాలు కల్పించాల్సి ఉం ది. విద్యాబోధనలో చక్కటి పనితీరు కనబరుస్తుండడంతో కేజీబీవీలలో నాణ్యమైన విద్య లభిస్తుండగా, పది, ఇంటర్‌ పరీక్షల్లో ఈ విద్యార్థినులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాఠశాలల్లో బోధిస్తోన్న స్పెషలాఫీసర్లు, సీఆర్‌టీ, పీజీసీఆర్‌టీ, క్రాప్ట్‌ టీచ ర్లు, ఏఎన్‌ఎంలు, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి ఎవరికీ ఉద్యోగభద్రత లేదని వాపోతున్నారు. ప్రధానంగా ఈ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే కొనసాగుతుండడంతో వీరు సమాన పనికి సమానవేతనంకోసం డిమాండ్‌ చేస్తున్నారు. రూ.6వేలనుంచి రూ.30వేలకు లోబడే వీరికి వేతనాలుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కు ఉన్న అర్హతలే తమకు ఉన్నాయని, పైగా రాత్రివేళల్లోనూ ఉపాధ్యాయులకు డ్యూటీలుండడంతో ఒక్కో ఉపాధ్యాయురాలు కనీసం 32గంటలపాటు ఏకధాటిగా పనిచేయాల్సి వస్తోందని, అలాంటి తమకు ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో మూడోవంతు కూడా రావడం లేదని దీన్ని పరిష్కరించి, తమకు సమానవేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం 10వ తేదీ వరకు వేయడం లేదన్నారు. కొన్ని కేజీబీవీల్లో ఎస్‌వోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉన్నతాధికారుల కు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ కాకపోవడంతో తమకు హెల్త్‌స్కీమ్‌లు, ఇన్సురెన్సులేవీ వర్తించడం లేదని, ప్రమాదవశాత్తు గాయాలపాలైనా, లేక మరణించినా ఎలాంటి భరోసా లేకుండా పోయిందని, అనారోగ్యంపాలైతే వైద్యసేవలకు కనీసం హెల్త్‌కార్డులు కూడా లేవని వాపోతున్నారు. వేసవిలోనూ అదనపు తరగతులు నడుపుతూ విద్యార్థినులను తీర్చిదిద్దుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా మెరుగైన ఫలితాలిస్తోన్న తమ కృషిని ప్రభుత్వం గుర్తించి తమకు సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌చేస్తున్నారు. అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించేలా హెల్త్‌స్కీం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న తమకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వకపోవడంపై కేజీబీవీ అధ్యాపకులు అవేదనవ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నడుస్తోన్న కేజీబీవీ ఉపాధ్యాయులకు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మమ్మల్ని గర్తించరూ..

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 4: ఉత్తమ విద్యాబోధనతో పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలనే తపన, తల్లడిల్లే హృదయం, స్పందించే మనసు కలబోసిన రూపమే ఉపాధ్యాయుడు. పిల్లల మనసుకు హత్తుకునేలా తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించగలిగితేనే ఆ పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బాటలుపడతాయి. ఓ సర్వే ప్రకారం పాఠశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా తీరు ఆధారంగానే పిల్లలు ఉన్నత విద్యను, భవిష్యత్‌లో స్థిరపడే రంగాన్ని ఎంపిక చేసుకుంటారని తేలింది. అలాగే ఒక ఉపాధ్యాయుడు తన పూర్తిస్థాయి ఉద్యోగ సమయంలో సుమారు 7వేల మంది విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే అవకాశం లభిస్తుంది. దీంతో ఉపాధ్యాయుడికి అన్ని రంగాలనుంచి జీవితాంతం పూర్వ విద్యార్థుల రూపంలో అనుబంధాలు ఉంటాయి. కాగా పూర్వకాలంలో విద్యార్థులు గురుదక్షణ సమర్పించుకునే సంప్రదాయం ఉండగా మారిన కాలానుగుణ పరిస్థితుల మేరకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు అర్హతలు ఆధారంగా వేతనాలు, ప్రమోషన్లు కల్పిస్తోంది. పూర్తి సర్వీస్‌ కాలానికి ఉద్యోగ భధ్రత ఉంటుంది. కానీ ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపైనే వారి జీవితాలు ఆధారపడి ఉంటున్నాయి.

సమస్యల సుడిగుండంలో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

ఉమ్మడి జిల్లాలో సుమారు 3వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు 10వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ప్రైవేటురంగంలో కూడా కొద్దిపాటి తేడాతో సుమారు అంతేమంది ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. వీరిలో 70శాతం మందికి పైగా రూ.10వేల లోపు వేతనాలు మాత్రమే అందుకుంటున్నారు. తరగతి గదుల్లో రోజంతా నిలబడి పాఠాలు చెప్పడం, నోట్స్‌ దిద్దడం, ఖాళీ సమయం లేకపోవడం, పైగా తల్లిదండ్రులకు జవాబుదారి తనంగా ఉండాల్సి వస్తుండటం మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. విద్యార్థుల వైఫల్యాలకు యాజమాన్యాలు ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తున్నాయి. అంతేగాక నిబంధనల ప్రకారం ప్రతీ ప్రైవేటు ఉపాధ్యాయులకు యాజమాన్యాలు పీఎఫ్‌, ఈఎ్‌సఐ చెల్లించాల్సి ఉన్నప్పటికీ అమలు చేస్తున్న దాఖలాలు కన్పించడంలేదు. మితిమీరిన మానసిక, శారీరక ఒత్తిడితో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆరోగ్యం క్షీణిస్తోంది. కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళా ప్రైవేటు ఉపాధ్యాయులు అన్ని బాధలను దిగమింగుకుంటూ కుటుంబ అవసరాలకోసం ప్రైవేటు పాఠశాలల్లో వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరుపుకుంటున్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ స్ఫూర్తితోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి : వెంకటేశం, టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉపాధ్యాయులకు ఏళ్లనుంచి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవులు, మెడికల్‌ బిల్లులు, జీపీఎఫ్‌ బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. వీటన్నింటినీ తక్షణం మంజూరు చేయాలి. అదేవిధంగా పాఠశాలల్లో స్కావెంజర్ల నియమకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇంకా నియామకాలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే స్కావెంజర్ల నియామకాలు చేపట్టాలి.

పెండింగ్‌ డీఏలు చెల్లించాలి : ఎండీ గఫూర్‌, ప్రాథమిక ఉపాధ్యాయసంఘం, జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఒకటో తేదీన వేతనాలిస్తున్న మాదిరిగానే వెంటనే పెండింగ్‌ డీఏలను కూడా చెల్లించాలి. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తక్షణమే పెండింగ్‌ డీఏలు, బిల్లులు క్లియర్‌చేసి ఉపాధ్యాయులు ఉత్సాహంగా పనిచేసే వాతావరణం కల్పించాలి.

Updated Date - Sep 05 , 2024 | 12:16 AM