అనుమానాస్పదంగా ఐదు నెమళ్లు మృతి
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:22 AM
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని దుశర్ల సత్యనారాయణ అడవిలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.
మోతె, ఫిబ్రవరి 12 : సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని దుశర్ల సత్యనారాయణ అడవిలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సోమవారం అడవి పర్యవేక్షకుడు ఉపేందర్, అటవీ శాఖ సెక్షన అధికారి గోవర్ధన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అటవిలో సుమారు 400పైగా చిన్నా, పెద్ద నెమళ్లు ఉన్నాయి. అడవికి ఆనుకుని ఉన్న పంట చేలల్లోకి సాయంత్రం పిల్లలతో కలిసి మేతకు వెళ్లి అడవికి వస్తుంటాయి. అయితే అటవీకి సమీపంలోని పత్తి తోటలో కొద్ది దూరంలో ఒకదాని తర్వాత ఒకటి మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. రెండు నెమళ్లు మృతి చెంది వారం రోజులు కావడంతో కుళ్లిపోగా, మిగిలినవి కుళ్లకపోవడంతో మూడు రోజుల కిందట చనిపోయినట్లు భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అడవిలో పాతిపెట్టారు. పంట పొలాల్లో క్రిమిసంహారక మందులు తినడంతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. నెమళ్లను ఎవరైనా వేటాడినా, చంపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ సెక్షన అధికారి గోవర్దన అన్నారు. ఫారెస్టు ఆయన వెంట సిబ్బంది రమేష్ ఉన్నారు.