Share News

మామిడాల ఘటనలో ఐదుగురికి రిమాండ్‌

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:40 AM

వివాహిత హత్యకు కారణమైన భర్త కుటుంబ సభ్యులను నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు రిమాండ్‌ చేశారు.

మామిడాల  ఘటనలో ఐదుగురికి రిమాండ్‌
తిప్పర్తి పోలీ్‌సస్టేషనలో కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ సాయి ప్రశాంత

తిప్పర్తి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వివాహిత హత్యకు కారణమైన భర్త కుటుంబ సభ్యులను నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు రిమాండ్‌ చేశారు. శుక్రవారం తిప్పర్తి పోలీ్‌సస్టేషనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ కొండల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కోదాటి శ్రీనుకు మిర్యాలగూడ మండలం బాదలాపురం గ్రామానికి చెందిన వాణితో ఆరేళ్ల కిందట వివాహమైంది. కాగా వీరికి ఇద్దరు కుమారులు. వివాహనంతరం ఒక ఏడాది నుంచి భార్యాభర్తలకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. కుటుంబసభ్యులు పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి సర్ది చెప్పేవారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీను తన భార్య వాణితో గొడవపడి, బెల్టుతో ఉరివేసి చంపాడు. ఆ తర్వాత సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కుమార్తె మృతిపై అనుమానం వచ్చిన వాణి తల్లి సింగం నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా హత్యగా వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం శ్రీనుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు వాణిని ఇబ్బందులకు గురిచేసిన అత్తామామలు కోదాటి రాములు, కన్నమ్మ, బావ, అక్క కోదాటి నాగరాజు, మౌనికలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కొండల్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ సాయిప్రశాంత, స్టేషన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:40 AM