అందరికీ ఉపయోగపడేలా
ABN , Publish Date - Dec 17 , 2024 | 11:58 PM
ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు ఎక్కువ గా కంపచెట్ల తొలగింపు, చెరువుల పూడికతీత పనులే జరిగేవి. కూలీలలను ఎక్కువగా రప్పించేందుకు అధికారులు ఈ పనులు ఎంచుకునే వారు. కొన్నిచోట్ల పడావుబడిన భూముల్లో భూఅభివృద్ధి పేరుతో కంప చెట్లు తొలగించేవారు
ఉపాధి పనుల జాతర
ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు
(ఆంధ్రజ్యోతి,మోత్కూరు): ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు ఎక్కువ గా కంపచెట్ల తొలగింపు, చెరువుల పూడికతీత పనులే జరిగేవి. కూలీలలను ఎక్కువగా రప్పించేందుకు అధికారులు ఈ పనులు ఎంచుకునే వారు. కొన్నిచోట్ల పడావుబడిన భూముల్లో భూఅభివృద్ధి పేరుతో కంప చెట్లు తొలగించేవారు. ఆ రైతు ఆ భూమిని వెంటనే సాగులోకి తేక వదిలేస్తే అక్కడ మళ్లీ కంపచెట్లు పెరిగేవి. రోడ్ల వెంట పెరిగిన కంప చెట్లు కొట్టినా అదే పరిస్థితి ఉండేది. దీనికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపాధి హామీలో వైవిధ్యమైన (పలు రకాల) పనులు చేపట్టాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉపాధి హామీ పనుల జాతరను చేపట్టింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధిహామీ జా బ్ కార్డులు 7.65లక్షల వరకు ఉన్నాయి. అందు లో యాదాద్రి జిల్లాలో 1.43లక్షలు, సూర్యాపేట జిల్లాలో 2.63లక్షలు, నల్లగొండ జిల్లాలో 3.59 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఉపాధి పనుల జాతరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే పనులు ఎక్కువగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మహిళా శక్తి ఉపా ధి భరోసా కింద ఐదు రకాల పనులు చేపట్టనున్నారు. ఐకేపీ నుంచి పాడి పశువులు తీసుకున్న వారికి పశువుల దొడ్డి నిర్మిస్తారు. అజోలా పెంప కం, వర్మీ, నాడెపు కంపోస్టు ఎరువు తయారీ, కోళ్ల పెంపకం, భూఅభివృద్ధి పనులు చేపడతా రు. పొలంబాట కింద వ్యవసాయ బావుల వద్ద కు రహదారుల నిర్మాణం చేపడతారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతీ గ్రామానికి ఒక యూనిట్ నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ మండలానికి ఐదెకరాల చొప్పున పండ్ల తోటల పెంపకం చేపడుతున్నారు. జల నిధి కింది గల్లీ కంట్రోల్ వర్క్స్‌గా చెల్కల్లో వరదలు పారే చోట వరద నీరు ఒకే సారి ప్రవహించి భూమి కోత గురికాకుండా ఒక దాని తర్వాత ఒకటి (స్టెప్ బై స్టెప్) వరద కట్టల నిర్మాణం మండలానికి రెండు చేపడతారు. ప్రతీ మండలానికి ఒక చెక్‌డ్యామ్, ఫామ్‌పండ్స్ మండలానికి ఐదు, భవనాలపై నుంచి వచ్చే నీటి నిల్వ గుంతలు మండలానికి ఐదు, బోర్‌వెల్ రీచార్జి గుంతలు మండలానికి రెండు, నూతన బావుల తవ్వకం మండలానికి ఒకటి, గ్రామీణ పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన కింద మండలానికి పది ఇంకుడు గుంతలు తవ్వుతారు. మండలానికి ఒక పాఠశాలలో మూత్రశాలలు, ఒక సీసీ రోడ్డు, ఒక గ్రామ పంచాయతీ భవనం, ఒక అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్నారు.
పనుల విలువ ఇలా...
పశువుల దొడ్డి నిర్మాణానికి కూలీలకు రూ.16,677, సామగ్రికి రూ.76,442 మొత్తంగా రూ.93,119 ఖర్చు చేయనున్నారు. అజోలా పెంపకానికి కూలీలకు రూ.4,505, సామగ్రికి రూ.11,495, మొత్తం రూ.16,000 ఖర్చు చేస్తారు. వర్మీ, నాడెపు కంపోస్టు పిట్‌కు కూలీలకు రూ.2,536, సామగ్రికి రూ.12,781, మొత్తంగా రూ.15,317, కోళ్ల షెడ్ (వెయ్యి పిల్లలు) కూలీలకు రూ.50,728, సామగ్రికి రూ.2,48,857, మొత్తంగా రూ.2,99,585, భూఅభివృద్ధి పనులకు ఎకరాకు కూలీలకు రూ.43,200, సామగ్రికి రూ.1,800, మొత్తంగా రూ.45,000 ఖర్చు చేస్తారు. వ్యవసాయ బావుల వద్దకు రహదారుల నిర్మాణానికి 800 మీటర్లకు కూలీలకు రూ.7,69,444, సామగ్రికి రూ.1,32,911, మొత్తంగా రూ.9,02,355, తోటల పెంపకానికి ఎకారకు కూలీలకు రూ.48,189, సామగ్రికి రూ.13,965, మొత్తంగా రూ.62,154, చెక్ డ్యామ్ నిర్మాణానికి (15 మీటర్ల పొడవు) కూలీలకు రూ.21,969, సామగ్రికి రూ.4,78,031 మొత్తంగా రూ.5లక్షలు, ఫామ్‌పాండ్స్ కూలీలకు రూ.2,93,152, సామగ్రికి రూ.6,251, మొత్తంగా రూ.2,99,403, భవనాలపై నుంచి వచ్చే నీటి ఇంకుడు గుంతకు కూలీలకు రూ.4,877, సామగ్రికి రూ.27,706, మొత్తంగా రూ.32,583, వ్యక్తి గత ఇంకుడు గుంతకు కూలీలకు రూ.1,038, సామగ్రికి రూ.5,781 వ్యయం చేయనున్నారు. ఈ పనులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే విచారణ నిర్వహించి అర్హులైతే వెంటనే పనులు చేపడతారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి 31 లోపు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ అవకాశాన్ని ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నవారు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.