సుడాతో మౌలిక మార్పు
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:45 AM
సూర్యాపేట అర్బన డెవల్‌పమెంట్ అథారిటీ(సుడా) ఏర్పాటుతో నిధుల రాక పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు.
నిధులు వస్తాయని పంచాయతీల్లో ఆశ
ప్రస్తుత నిధులకు కేంద్ర నిధులు ఆసరా
సుడా నిర్వహణకు ప్రత్యేక అధికారులు
సూర్యాపేట అర్బన డెవల్‌పమెంట్ అథారిటీ(సుడా) ఏర్పాటుతో నిధుల రాక పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి హుడాగా మార్చిన అనంతరం అభివృద్ధి చెందాయని, ఆ తరహాలో అభివృద్ధి జరుగుతుందని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. గ్రామపంచాయతీల నుంచి మునిసిపాలిటీలకు అనుసంధానం చేసే రహదారుల నిర్మాణంతో మార్పు వస్తుందంటున్నారు. అదేసమయంలో పన్నులు కూడా పెరిగే అవకాశం ఉండటంతో కొంత ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తమ ప్రాధాన్యం తగ్గుతుందని ప్రజా ప్రతినిధులు ఆలోచిస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన)
సూర్యాపేట అర్బన డెవల్‌పమెంట్ అథారిటీ(సుడా) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఇప్పటికేముసాయిదా ప్రకటన ప్రక్రియ పూర్తయ్యిం ది. ప్రభుత్వం పురపాలక పరిపాలన శాఖ జీవో నెంబర్176ను విడుదల చేస్తు సూడాను ప్రకటించింది. ముఖ్యంగా గ్రామాలను, మునిసిపాలిటీలని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సుడాను ఏర్పాటుచేయనుంది. ప్రభుత్వం జి ల్లా మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని సుడా ఏర్పాటుచేస్తోంది. ఇందు లో జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల, సూర్యాపేటలతో పాటు జిల్లాలో 21 మడలాల్లోని 264 పంచాయతీలను కలిపారు.
కలెక్టర్ చైర్మన, ప్రత్యేక కార్యాలయం
సుడా నిర్వహణ కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు కానున్నట్లు సమాచారం. కలెక్టర్ చైర్మనగా, ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రాష్ట్ర అధికారులను కూడా కమిటీలో సభ్యులుగా చేర్చుతారని, అదేవిధంగా రాజకీయంగా పలువురిని కూడా ఈ కమిటీలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కార్యాలయ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులు, సిబ్బందిని కూడా తీసుకుంటారని సమాచారం.
పంచాయతీల్లో అభివృద్ధికి ఆస్కారం
నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు సుడా ఏర్పాటు వరంగా మారనుంది. నాబార్డు నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కేటాయింపులపై ఆధారపడుతున్న పంచాయతీలకు సుడాతో ఆర్థిక భరోసా కలుగనుంది. ముఖ్యంగా ఎంపిక చేసిన పంచాయతీల్లో ఏ నిర్మాణమైనా ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా పంచాయతీల్లో, మునిసిపాలిటీల్లో ఇంటి నిర్మాణాలు, వెంచర్‌లు ఏర్పాటు చేయాలంటే సుడా అనుమతి తీసుకోవాలి. దీని మూలంగా మునిసిపాలిటీ, పంచాయతీలకు అదాయం పెరుగనుంది. అదేసమయంలో నిర్మాణాలపై వచ్చే పన్నుల రాబడి కూడా పెరగనుంది. దీనికితోడు మండల కేంద్రాలకు కలిపే రహదారులు కొన్నిచోట్ల లేవు. సుడా ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మునిసిపాలిటీలకు అందజేసే అమృత పథకం కూడా వర్తించి, నిధుల రాక పెరుగుతుందంటున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల మౌలిక స్వరూపం కూడా మారే అవకాశం ఉందంటున్నారు. గ్రామాల్లో పార్క్‌ల నిర్మాణాలు చేపట్డంతో రూపురేఖలు మారుతాయంటున్నారు. మొత్తంగా మునిసిపాలిటీలను తలపిస్తు పంచాయతీలు రూపుదిద్దుకుంటాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యంగా జిల్లాలో 486 గ్రామపంచాయతీలు ఉండగా 264 పంచాయతీలను సుడా పరిధిలోకి తీసుకోగా మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపికైన మునిసిపాలిటీతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందితే మిగిలిన గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ హుడా ఏర్పాటుచేయగా అక్కడ అభివృద్ధి జరిగిందని, అలాగే జిల్లాలో ఆవిధంగా జరిగే అవకాశం ఉందా, ఆ దిశగా అడుగులు పడేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పన్నుల భారం
సుడా ఏర్పాటుతో పంచాయతీ, మునిసిపాలిటీల్లో చెల్లిస్తున్న పన్నుల భారం మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఏమేరకు పెరుగుతాయన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పంచాయతీల్లో ఇంటి, నల్లా, ఇతర పన్నులు చెల్లిస్తున్న ప్రజలు తాము పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధికి దూరంగా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుడా ఏర్పాటుతో పన్నుల భారం పెరిగినా తమ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు.
ప్రజాప్రతినిధుల్లో ఆందోళన
జిల్లాలో సుడా ఏర్పాటుతో కొంతమంది ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏదేని పనినిమిత్తం పంచాయతీలు, మునిసిపాలిటీలను ప్రజలు సంప్రదిస్తుండగా సుడా ఏర్పాటుతో వారంతా ఆయా కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కౌన్సిలర్లుకు, వార్డు మెంబర్లు నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఏదిఏమైనా సుడాతో అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.
సుడాతో ప్రజలకు ఉపయోగం లేదు
సుడా ఏర్పాటుతో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ట్యాక్సులు ఏ మాత్రం వేస్తారో చెప్పడం లేదు. ముందుగా సుడాతో అవగాహన కల్పించి ముందుకు వెళ్లాలి. ఇప్పటికే మండలం నుంచి జిల్లా కేంద్రానికి సరిపోను రహదారులు ఉన్నాయి. ఇంకా సుడాతో ఎక్కడ రోడ్లు వేస్తారు. గ్రామీణ రోడ్లపై ట్యాక్లుసు వేస్తే ప్రజలు, రైతులకు ఇబ్బంది.
షేక్ తాహేర్‌పాష, 40వ వార్డు