Share News

గట్టుప్పల్‌ మండలం చిత్ర విచిత్రం

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:03 AM

పలు పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న గట్టుప్పల్‌ మండలం నేటికీ ఒక రూపాన్ని సంతరించుకోలేక పోయింది. మండలంగా ఏర్పడినా, ఇప్పటికీ ఆ మండల ప్రజలు పూర్వ మండల కేంద్రాలకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

గట్టుప్పల్‌ మండలం చిత్ర విచిత్రం

మండలంగా ఏర్పడి రెండేళ్లు పూర్తి

పోలీస్‌ కేసైతే మూడు మండలాలు తిరగాల్సిన పరిస్థితి

ఎంపీడీవో కార్యకలాపాలు ఇంకా పాత మండలాల్లోనే

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టిసారించని అధికారులు

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ/గట్టుప్పల్‌): పలు పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న గట్టుప్పల్‌ మండలం నేటికీ ఒక రూపాన్ని సంతరించుకోలేక పోయింది. మండలంగా ఏర్పడినా, ఇప్పటికీ ఆ మండల ప్రజలు పూర్వ మండల కేంద్రాలకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అప్పటి ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటుచేసినా, నేటికీ ఆ మండలాల ప్రజలకు మెరుగైన సేవలు అందకపోగా, మరిన్ని ఇబ్బందులు పెరిగాయి.

గట్టుప్పల్‌ మండలాన్ని 2022 అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రకటించారు. మర్రిగూడ, చండూ రు, మునుగోడు మండలాల నుంచి ఏడు గ్రామాలను తొలగించి గట్టుప్పల్‌లో చేర్చారు. చండూరు మండలంలో ని గట్టుప్పల్‌, తేరట్‌పల్లి, కమ్మగూడెం, శేరిగూడెం గ్రామాలతో పాటు మర్రిగూడ మండలంలోని అంతంపేట, నా మాపురం, మునుగోడు మండలంలోని వెల్మకన్నె గ్రామా న్ని గట్టుప్పల్‌ మండలంలో చేరాయి. మండలం ఏర్పాటు పూర్తయి రెండేళ్లు అయినా నేటికీ ఇక్కడ పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకాలేదు. గట్టుప్పల్‌లో ప్రస్తుతం ఒక్క తహసీల్దార్‌ కార్యాలయం మాత్రమే ఉంది. అది కూడా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక విద్యుత్‌శాఖ కార్యకలాపాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎంపీడీవో కార్యకలాపాలు పూర్వ మండలాల్లోనే కొనసాగుతున్నాయి. గట్టుప్పల్‌ మండల ప్రజలు పాత మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లి పనులు చక్కబెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేయగా, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. అయినా ఏ ప్రభుత్వమూ మండల వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించలేదు.

గట్టుప్పల్‌ మండల కేంద్రం గతంలో చండూరు మండలంలో మేజర్‌ గ్రామపంచాయతీగా ఉండేది. కానీ, మండ ల కేంద్రం 22కి.మీల దూరం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో గట్టుప్పల్‌ ప్రజలు మండలం కోసం సుదీర్ఘంగా ఉద్యమించారు. దీంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని మొత్తం ఏడు గ్రామాలను గట్టుప్పల్‌లో కలిపి మండలంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మండలంలో 16వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.

విచారణ గట్టుప్పల్‌లో, కేసులు పూర్వ మండలాల్లో

గట్టుప్పల్‌ మండల కేంద్రంలో పోలీ్‌సస్టేషన్‌ ఉండగా, కేవలం ఒక ఎస్‌ఐను మాత్రమే ప్రభుత్వం నియమించింది. కానిస్టేబుళ్లు ఇతర సిబ్బందిని పాత మండలాల నుంచి స్టేషన్‌కు ఇద్దరు చొప్పున ప్రతీ రోజు గట్టుప్పల్‌కు డిప్యుటేషన్‌పై పంపుతున్నారు. మునుగోడు పీఎస్‌ నుంచి ఇద్దరిని, చండూరు నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను పంపిస్తున్న అధికారులు అదనంగా ఈ సర్కిల్‌లోని కనగల్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి కూడా ఇద్దరు కానిస్టేబుళ్లను పంపిస్తున్నారు. మండలంలోని ఏడు గ్రామాల్లో తగాదాలు, ఘర్షణలు ఇతర ఘటనలు జరిగితే విచారణను గట్టుప్పల్‌ మండల కేంద్రంలోని పోలీ్‌స్టసేషన్‌లో నిర్వహిస్తుండగా, కేసులు మాత్రం చండూరు, మునుగోడు, మర్రిగూడ పోలీ్‌సస్టేషన్లలో నమోదు చేస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారు ఏ స్టేషన్‌కు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పోరాడి సాధించుకున్న మండలంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని మండలం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీ్‌సస్టేషన్‌లో ఏదైనా పనుల నిమిత్తం, కేసుల కోసం వెళ్తే పాత మండలాలకు వెళ్లి ఫిర్యాదు చేయాలో, తమ మండలంలో ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామాలకు చెందిన రికార్డులు లేక పాత మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి తమ ఇక్కట్లు తీర్చాలని గట్టుప్పల్‌ మండల ప్రజలు కోరుతున్నారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి : కర్నాటి వెంకటేశం, జడ్పీ మాజీ సభ్యుడు

గట్టుప్పల్‌లో వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. మండలం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. గట్టుప్పల్‌ మండల ప్రజలు మూడు మండలాలకు వెళ్లాలంటే నానా అవస్థలకు గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినా ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే గట్టుప్పల్‌ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బందులు తీర్చాలి.

మండలానికి అధికారుల కేటాయింపు : సుబ్రహ్మణ్యం, ఆర్డీవో చండూరు

గట్టుప్పల్‌ మండల ప్రజల అవసరాలకు అనుగుణంగా అధికారులు, కార్యాలయాల కేటాయింపు జరిగింది. ఇంకా వివిధ శాఖల ఏర్పాటుతో పాటు అధికారుల కేటాయింపు గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వివిధ శాఖల అధికారులతో పాటు సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు పూర్తిచేస్తాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Oct 21 , 2024 | 01:03 AM