పట్టణీకరణకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లను విస్తరించాలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:30 AM
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది.. అందుకు అనుగుణం గా పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.. ప్రభుత్వ విద్యబలోపేతంతోనే అన్నివర్గాల పిల్లల కు నాణ్యమైన విద్య అందుతుంది.. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
వచ్చే ఏడాది నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలి
నోడిటెన్షన్‌ను రద్దు చేయడం కేంద్రం తప్పుడు నిర్ణయమే
‘ఆంధ్రజ్యోతి’తో శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ) : తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది.. అందుకు అనుగుణం గా పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.. ప్రభుత్వ విద్యబలోపేతంతోనే అన్నివర్గాల పిల్లల కు నాణ్యమైన విద్య అందుతుంది.. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి విద్యాకమిషన్ సరైన మార్గదర్శకాలు అందిస్తుందని భావిస్తున్నా.. అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆయన తో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..
రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. అందుకు అనుగుణంగా పట్టణాలు,నగరాల్లో ప్రభుత్వ స్కూళ్లను విస్తరించాలి. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో 1.20లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, ములుగు జిల్లా అంతా కలిపినా లక్ష మందికి లోబడి మాత్రమే ఉన్నారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్, అన్ని కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీలు రోజురోజుకూ విస్తరిస్తున్నా యి. గ్రామాల్లో వృద్ధులు మాత్రమే ఉంటున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లను అదనంగా ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వరంగంలో అంగన్‌వాడీ కేంద్రాలున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో అక్కడికంటే ప్లేస్కూళ్లకే పిల్లలను పంపుతున్నారు. ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
నోడిటెన్షన్ విధానం రద్దు సరికాదు
కేంద్రం తాజాగా ఇచ్చిన నోడిటెన్షన్ గెజిట్ ఇప్పుడు అవసరం లేదు. 5, 8 తరగతుల విద్యార్థులు చదువులో వెనకబడితే పరీక్షల్లో ఫెయిలయితే, ఆ విద్యార్థులపై తదుపరి తరగతిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగుపడేలా బోధన ఉండాలే తప్ప ఒత్తిడి పెంచేలా డిటెన్షన్ అమలు చేస్తామనడం అసంబద్ధ చర్య. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంగా దీన్ని పరిగణించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలుచేస్తున్నట్లే నోడిటెన్షన్ విధానమే కొనసాగించాలి.
కనీసం 15మంది విద్యార్థులకు తగ్గకుండా తరగతి గది
పిల్లలకు సమవయస్కులు కనీసం 15మంది ఉంటేనే వారు చదువు నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. ఉపాధ్యాయుల నుంచే కాకుండా పిల్లలు, తోటి పిల్లల నుంచి కూడా విద్య నేర్చుకుంటారు. దీనికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలి. రాష్ట్ర విద్యాకమిషన్ ఏర్పాటు నిర్ణయం సుమచితమైనది. ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నతవిద్య వరకు అన్ని రకాల విద్యను ఈ కమిషన్ పరిశీలించి, రాష్ట్రంలో విద్యారంగ మార్పులపై సూచనలు చేస్తుందని నమ్ముతున్నాం. ఆ దిశగా కమిషన్ కార్యాచరణ కనిపిస్తోంది.
పాఠశాలల బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తాం
నల్లగొండలో ఈనెల 28, 29, 30తేదీల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ సభలకు మంత్రులు, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సామాజికవేత్తలు, విద్యావేత్తలను ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యను అందరికీ అందేలా ప్రభుత్వానికి అవసరమైన సూచనలు ఈ మహాసభల ద్వారా అందిస్తాం. ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలందరూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నాం.