కేంద్రాల్లోనే ధాన్యం..రైతు పరిస్థితి దైన్యం
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:02 AM
: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు.
ప్రారంభాలు, పరిశీలనలు సరే..కొనుగోళ్లేవీ?
కలెక్టర్ షోకాజ్ నోటీసులిచ్చినా తీరు మారలే..
ఇప్పటికే కొంత ధాన్యం దళారుల పాలు
మోత్కూరు/ గుండాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 15 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే గుండాలలో మాత్రం ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో అన్నదాతలు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వస్తున్నారు. రోజుల తరబడి ఎదురు చూసినా కొనుగోలు కేంద్రాలు సమయానుకూలంగా ప్రారంభించక పోవడంతో ఇప్పటికే సగం మంది రైతులు దళారులకు ధాన్యాన్ని విక్రయించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడానికి మ్యాచర్ రాకపోవడంతో అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రతీ రోజు మబ్బులు వస్తుండడంతో మళ్లీ వర్షం ఎక్కడ పడుతుందో నని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాల్లోకి తీసుకు వచ్చిన ధాన్యాన్ని ప్రతి రోజు ఉదయం పూట ఎండబోసి సాయంత్రం సమయంలో కుప్పపోయాల్సి వస్తోంది. సుమారు పది రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభాలు, అధికారుల పరిశీలనలే తప్ప కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల్లో వరి కోతలు ప్రారంభమైన వెంటనే ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇప్పటికే 60 శాతం మంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2320 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యం (తూర్పార బట్టకుండా, ఆరబెట్టకుండా) రూ.2వేల నుంచి 2050కి కొంటున్నారు. ధాన్యం ఆరబెట్టి, తూర్పారబట్టడానికి డబ్బు ఖర్చు చేయడం, ఆరబెడితే క్వింటాకు కనీసం ఆరేడు కిలోలు తగ్గడం, కేంద్రంలో పోసి రోజుల తరబడి వేచి చూడడమెందుకని ఎక్కువ మంది రైతులు పచ్చి ధాన్యాన్నే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొద్ది మంది రైతులు ధర ఎక్కువ వస్తుందని కేంద్రాలకు తెస్తుండగా ఆ కొద్దిపాటి ధాన్యాన్ని కూడా ఇంత వరకు కొనడంలేదు.
మోత్కూరు మండలంలో..
మోత్కూరు మండలంలో రైతు సేవాసహకార సంఘం ఆధ్వర్యంలో ఆరు కేంద్రాలు తెరవగా అనాజిపురం, దత్తప్పగూ డెం, కప్రాయపల్లి కేంద్రాలకు ధాన్యమే రాలేదు. మోత్కూరు కేంద్రంలో సుమారు 17 సన్నధాన్యం రాశులు ఉన్నాయి. పొడిచే డు, రహీంఖానపేటలో కొద్ది రాశులు ఉన్నాయి. ఐకేపీ ఆధ్వర్యం లో 4 కేంద్రాలు తెరవాల్సి ఉండగా సదర్శాపురంలో కల్లం, ధా న్యం లేదని, దాచారంలో కేవలం 3 రాశులే ఉండటంతో రెండు చోట్ల కేంద్రాలు ప్రారంభించలేదు. పాటిమట్ల, ముశిపట్లలో కేం ద్రాలు ప్రారంభించారు. గుండాల మండలంలో ఐకేపీ ఆధ్వర్యం లో ఒకటి, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ప్రారంభించారు.
అడ్డగూడూరు మండలంలో..
అడ్డగూడూరు మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యలో ఏడు కేంద్రాలకు గాను మూడు కేంద్రాలు ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఐదు కేంద్రాలు ప్రారంభించారు. అన్ని కేంద్రాల్లోనూ కొద్దికొద్దిగానే ధాన్యం రాసులు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో ఇంతవరకు ధాన్యం కొనడం ప్రారంభం కాలేదు. ఈ నెల 1న కలెక్టర్ హనుమంతరావు మోత్కూరు, గుండాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించి వెంటనే ధాన్యం కొనాలని ఆదేశించారు. ఈ నెల 4న గుండాల మండల ప్రత్యేక అధికారి విష్ణువర్ధనరెడ్డి, ఈ నెల 5న మోత్కూరులో ఆలేరు ఏడీఏ పద్మావతి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అయినా ఇంత వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల ప్రారంభాలు, అధికారుల పరిశీలనలే తప్ప కొనుగోళ్లేవని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులు కోరుతున్నారు.
మోత్కూరు కేంద్రంలో ధాన్యం కొనుగోలులో ఎందుకు జాప్యం జరుగుతోందని రైతుసేవా సహకార సంఘం సీఈవో కె.వరలక్ష్మీని అడగ్గా రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు కానీ తూర్పార పట్టడం లేదని తెలిపారు. తేమ శాతం 17 ఉన్నా, తూర్పార పట్టక పోవడంతో ధాన్యంలో తాలు, గడ్డిపోచలు ఉండటంతో కొనడం లేదని, తూర్పార పట్టిన వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో మత్స్యగిరి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆ సంఘం చైర్మన వల్లపు సైదులు ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘం సీఈవో నర్సింహాచారి, మాజీ సర్పంచ మర్రిపల్లి యాదయ్య, యాస మాధవి, గోవిందు, బక్కయ్య, మచ్చగిరి, ప్రభాకర్, ముత్తయ్య పాల్గొన్నారు.
పరిశీలించిన ఆలేరు ఏడీఏ
మోత్కూరు మార్కెట్ యార్డులో స్థానిక రైతు సేవా సహకార సంఘం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం రాశులను ఆలేరు ఏడీఏ పద్మావతి, సంఘం చైర్మన పేలపూడి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. కేంద్రానికి పూర్తిగా సన్నధాన్యమే ఇచ్చింది. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నాణ్య తా ప్రమాణాలననుసరించి ధాన్యం కేంద్రాలకు తీసుక రావాలన్నారు. ఏవో వి.కీర్తి, సంఘం సీఈవో కె.వరలక్ష్మీ, ఏఈవో టి.గోపీనాథ్, సిబ్బంది కిషన, సురేష్, సందీప్, శ్రీకాంత ఉన్నారు.
ధాన్యాన్ని శుభ్ర పరచి, తూకాలకు సిద్ధంగా ఉంచాలి
చౌటుప్పల్ టౌన/ చౌటుప్పల్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని శుభ్ర పరచుకొని తూకాలకు సిద్ధంగా ఉంచుకోవాలని చౌటుప్పల్ పీఏసీఎస్ చైర్మన చింతల దామోదర్ రెడ్డి రైతులను కోరారు. చౌటుప్పల్, తాళ్ల సింగారం, పంతంగి, అంకిరెడ్డి గూడెం, గుండ్లబావి, ఎస్ లింగోటం, నేలపట్ల, మందోళ్లగూడెం తదితర కొనుగోలు కేంద్రాలను మంగళవారం దామోదర్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర ను పొందాలని, మద్య దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. సెక్రటరీ వై.రమేష్ ఉన్నారు.
గింజ ముట్టలే..తూకం వేయలే
గుండాల మండలంలోని 20 గ్రామ పంచాయితీలకు గాను 10 పిఎసిఎస్, 8 ఐకేపీ కేంద్రాలు ఉండగా ఇప్పటికీ మండలంలోని వెల్మజాలలో మాత్రమే ఐకేపీ కేంద్రాన్ని, 8 పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించారు. మిగతా గ్రామాల్లో కేం ద్రాలు ప్రారంభించక పోవడంతో రైతులు తప్పని పరిస్థితిలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు వేగ వంతం చేయాలని కలెక్టర్ ఈ నెల3న గుండాల మం డల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి పీఏసీఎస్ సీఈవో, ఏఈవోకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ అధికారుల తీరు మారడం లేదని మండల ప్రజలు పేర్కొంటున్నా రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రం లేక ప్రైవేటుకు విక్రయించాను
సీతారాంపురం గ్రామంలో ప్రతీ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోతలు ప్రారంభమయ్యేనాటికి ప్రారంభించేవారు. ఈ సంవత్సరం కోతలు ప్రారంభమయ్యి నెల కావస్తున్నా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. వాతావరణ పరిస్థితులు, ధాన్యం మ్యాచర్‌కోసం ఎండబోసేందుకు, తూర్పారపట్టేందుకు చాలా శ్రమ, వ్యయంతో కూడిన పని. తప్పని పరిస్థితిలో ధర తక్కువ అయినప్పటికీ ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినాను.
- మచ్ఛ కృష్ణారెడ్డి, సీతారాంపురం, గుండాల మండలం