ధాన్యం..దళారులకు భోజ్యం
ABN , Publish Date - Apr 02 , 2024 | 12:31 AM
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. తేమ పేరుతో తక్కువ ధర చెల్లించి రైతులను మోసం చేస్తున్నారు.
మోటకొండూర్, ఏప్రిల్ 1: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. తేమ పేరుతో తక్కువ ధర చెల్లించి రైతులను మోసం చేస్తున్నారు. మోటకొండూర్ మండలంలో దళారులు యదేచ్ఛగా వడ్లు కొనుగొలు చేస్తున్నరని తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదు. నేటికి ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేతికి వచ్చిన పంటను కోసిన తరువాత నిల్వ చేయలేక దళారులకు విక్రయిస్తున్నారు. గత సీజనలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా క్వింటాలు ఏ గ్రేడ్‌కు రూ. 2,223 బీ గ్రేడ్ రూ. 2,218 కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాకపోవడంతో దళారులు రైతుల వద్ద రూ. 1880 నుంచి రూ. 1900 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.300నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మోటకొండూర్ మండలంలో యాసంగి సిజనలో 12,962 ఎకారాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. దీని ప్రకారం వ్యవసాయ ఆధికారులు 3,629 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబాడి వస్తుందని అంచనా వేశారు. దళారులు పంట చేల వద్దకు వెళ్లి పచ్చి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: సంగు శేఖర్, రైతు , మోటకొండూర్
వరికోతలు ప్రాంభించి నెల కావస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి.
రైతులు తొందర పడొద్దు: వి.పద్మజ, ఆలేరు మార్కెట్ కమిటీ సెక్రెటరీ
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుటాం. ఒకటి, రెండు రోజుల్లో మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రైతులు తొందరపడి దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలి.