ఆరులేన్లకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:19 AM
జాతీయ రహదారి నెం.65 విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాలుగులేన్ల నుంచి ఆరులేన్ల విస్తరణకు కేంద్రం అనుమతినిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు వరకు 65వ జాతీయ రహదారిని విస్తరించారు.
65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం అనుమతి
ఇకనైనా ప్రమాదాలకు చెక్ పడేనా?
అవసరమైన చోట ఫ్లైఓవర్ల నిర్మాణం
(ఆంధ్రజ్యోతి- సూర్యాపేట): జాతీయ రహదారి నెం.65 విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాలుగులేన్ల నుంచి ఆరులేన్ల విస్తరణకు కేంద్రం అనుమతినిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు వరకు 65వ జాతీయ రహదారిని విస్తరించారు. దాదా పు రూ.1800కోట్లతో జాతీయ రహదారిని నాలుగులేన్లతో నిర్మించారు. ఆ సమయంలోనే ఆరులేన్ల రహదారికోసం భూసేకరణ చేశారు. ప్రస్తుతం రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుమార్లు కేంద్ర ఉపరితల, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆరులేన్ల రహదారిగా విస్తరించాలని విజ్ఞప్తిచేశారు. ఎట్టకేలకు ఆరులేన్ల రహదారిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై 17బ్లాక్ స్పాట్‌లను గుర్తించారు. అక్కడ ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ల నిర్మాణం, సైన్‌బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఈనాడు జంక్షన్, జనగాం ఎక్స్‌రోడ్డు, పిల్లలమర్రి ఎక్స్‌రోడ్డు, దురాజ్‌పల్లి, ముకుందాపురం, ఆకుపాముల, కొమరంబండ, కట్టకొమ్ముగూడెం, మేళ్ళచెర్వు ఎక్స్‌రోడ్డు, మునగాల ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. ఇలాంటి చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించడం, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతారు.
సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలు
కాంట్రాక్ట్ తీసుకున్న జీఎంఆర్ కంపెనీ నాలుగులేన్ల రహదారిని నిర్మించింది. అయితే భూసేకరణ మాత్రం ఆరులేన్ల రహదారికోసం చేశారు. ఆరులేన్ల రహదారి నిర్మించిన తర్వాతే గ్రామాల నుంచి జాతీయ రహదారికి వెళ్లే సర్వీస్ రోడ్లను నిర్మిం చే అవకాశముంది. ప్రస్తుతం సర్వీస్ రోడ్లు నిర్మించాలంటే పలుచోట్ల వంతెనలను కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పనికావడంతో ఆరులేన్ల రహదారి నిర్మాణం తర్వాతే సర్వీస్ రోడ్డు నిర్మాణం జరిగే అవకాశముంది. అయితే పట్టణాలకు సమీపం లో సర్వీ్‌సరోడ్లను నిర్మించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు ఎక్కువగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రద్దీ పెరిగి జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయి.
సర్వీస్ రోడ్డు నిర్మాణానికి అనుమతి నిరాకరణ
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పటికీ కేంద్రం అనుమతి ఇవ్వడంలేదు. జాతీయ రహదారులు కేంద్రం ఆధీనంలో ఉండడంతో సర్వీస్ రోడ్ల నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోతున్నారు. ఆరులేన్ల రహదారి నిర్మించిన తర్వాతే జిల్లాలో సర్వీస్ రోడ్డు నిర్మించే అవకాశముంది. అప్పటివరకు ప్రజలకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. కాకపోతే జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ రహదార్ల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల సర్వే నిర్వహించారు. అందులో భాగంగా ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రోడ్డు క్రాసింగ్‌ల వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణంతోపాటు అండర్ పాసింగ్‌లు, జంక్షన్లను నిర్మించనున్నారు. ఇప్పటికే నార్కట్‌పల్లి, ఇనుపాముల గ్రామాల వద్ద అండర్‌పాసింగ్‌లు, సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్ర శివారులో కూడా సర్వీస్ రోడ్లను నిర్మిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
తొమ్మిది నెలల్లో 569 ప్రమాదాలు
జిల్లాలో ఫ్లైఓవర్లు లేకపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జాతీయ రహదారి నెం.65పై అంజనాపురి కాలనీ మూలమలుపువద్ద ఆటోను వెనుకనుంచి లారీ ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందారు. అదేవిధంగా జమ్మిగడ్డ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఇటీవల ద్విచక్రవాహనాదారులు రోడ్డు దాటే సమయంలో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జిల్లాలో గత తొమ్మిది నెలల కాలంలో 569 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 42 మందికిపైగా మరణాలు సంభవించాయి. ఇందులో జాతీయరహదారిని దాటే సమయంలో జరిగిన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి.
ఫ్లైఓవర్లతో ప్రమాదాలు తగ్గుతాయి : బానుచందర్, వాహనదారుడు, సూర్యాపేట
జిల్లా కేంద్రంలో ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుకుండా ఉంటాయి. ఇతర పనుల కోసం గ్రామం నుంచి వచ్చే సమయంలో జనగాం రోడ్డు సమీపంలో రోడ్డు దాటాలంటే భయంగా ఉంటుంది. ఫ్లైఓవర్ పడితే ఎంతో మేలు జరుగుతుంది.