Share News

పెరుగుతున్న చలి..జర భద్రం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:27 AM

పెరుగుతున్న చలి జిల్లా వాసులను వణికిస్తున్నది. శీతాకాలానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రోజులుగా కురుస్తున్న తేలిక పాటి వర్షపు జల్లులతో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది.

పెరుగుతున్న చలి..జర భద్రం
భువనగిరిలో కురుస్తున్న వర్షం

అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదంటున్న వైద్యులు

రాజాపేటలో నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రత

భువనగిరి టౌన, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న చలి జిల్లా వాసులను వణికిస్తున్నది. శీతాకాలానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రోజులుగా కురుస్తున్న తేలిక పాటి వర్షపు జల్లులతో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. బుధ, గురువారాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో దఫాల వారీగా ముసురు కురవడంతో వాతావరణం మేఘాంవృత్తమై చలి తీవ్రత పెరిగింది. దీంతో వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం అయ్యారు. రహదారులపై జన సంచారం కూడా తగ్గింది. సాయంత్రం చీకటి పడగానే అందరూ ఇళ్లకు చేరుకుంటుండడంతో దుకాణాలను కూడా వ్యాపారులు త్వరగానే మూసివేస్తున్నారు. అయితే రాజాపేట మండలంలోనే గత నాలుగు రోజులుగా జిల్లాలో కనిష్ట శీతోష్ణస్థితి నమోదు కావడం గమనార్హం.

జిల్లాలో 28 వాతావరణ కేంద్రాలు

జిల్లాలోని 17 మండలాల్లో 28 వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత, వర్షాన్ని నమోదు చేస్తుంటాయి. ఉష్ణోగ్రత నమోదైన వివరాలు హైదరాబాద్‌లోని వాతావరణశాఖ సర్వర్‌కు చేరుతుంటాయి. అలాగే జిల్లాలోని వాతావరణ వివరాలను జిల్లా ప్రణాళిక శాఖ ప్రతీ 24 గంటలకు ఒకసారి ప్రకటిస్తుంది. అయితే వర్షాకాలంలో మాత్రం ప్రతి 12 గంటలకు ఒకసారి వర్షపాతాన్ని ప్రకటిస్తుంది. ఉష్టోగ్రతను డిగ్రీ సెల్సియ్‌సలో, వర్షాపాతాన్ని మిల్లిమీటర్లలో లెక్కిస్తారు.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

సోమవారం అత్యల్పంగా రాజాపేట మండలంలో 16.2 డిగ్రీలు, పెరుగుతున్న చలితో గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వర లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని పేర్కొంటున్నారు. కాగా బుధవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా రాజాపేటలోనే 18.4 డిగ్రీలు, బుధవారం నారాయణపూర్‌లో 20.9 డిగ్రీలు, గురువారం తిరిగి రాజాపేలోనే 19.1 డిగ్రీల కనిష్ఠ ఉష్టోగ్రత నమోదైంది. అలాగే మంగళవారం అడ్డగూడూరులో 4.0, చౌటుప్పల్‌, ఆలేరు, నారాయణపూర్‌లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చలితో జాగ్రత్తగా ఉండాలి

పెరుగుతున్న చలితో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చూపితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అత్యవసరమనుకుంటేనే రాత్రి పూట బయటకు వెళ్లాలి. వెళ్లే ముందు తప్పనిసరిగా స్వెటర్స్‌ తదితర చలి నుంచి కాపాడే దుస్తులను ధరించాలి. జ్వర లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలి. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

-డాక్టర్‌ చిన్నా నాయక్‌, డీసీహెచఎ్‌స

Updated Date - Dec 27 , 2024 | 12:27 AM