Share News

యాదగిరి క్షేత్రానికి హైసెక్యూరిటీ

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:54 AM

అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హైసెక్యూరిటీ కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబరు తరువాత ఆలయానికి కల్పించాల్సిన భద్రతపై ప్రభుత్వం బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది.

 యాదగిరి క్షేత్రానికి హైసెక్యూరిటీ

బహుళ అంచెల భద్రత

డిసెంబరు తర్వాత ఎస్పీఎఫ్‌ మరింత పటిష్టం

వీవీఐపీలు,వీఐపీలు,భక్తుల భద్రత దృష్ట్యా నిర్ణయం

కొండపై మినీ పోలీ్‌సస్టేషన్‌?

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హైసెక్యూరిటీ కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబరు తరువాత ఆలయానికి కల్పించాల్సిన భద్రతపై ప్రభుత్వం బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సును (ఎస్పీఎ్‌ఫ)ను మరింత పటిష్టపరచనుంది.

భక్తుల రద్దీ, ఇతర భద్రతా కారణాల రీత్యా యాదాద్రి ఆలయానికి బహుళ అంచెల భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించింది. స్వామివారి ప్రధాన ఆలయంలోని గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అర్ధాంతరంగా నిలిచిన స్వర్ణతాపడం పనులు కొనసాగించేందుకు నిర్ణయించారు. 2025 మార్చిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి దివ్య విమాన రాజగోపురం బంగారు తాపడం పనులు పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, వచ్చే ఫిబ్రవరిలోనే ఈ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. అయితే బంగారు తాపడం పనులు కొనసాగుతుండగానే యాదగిరి క్షేత్రం భద్రతను ప్రభు త్వం సమీక్షించింది. ఇప్పటికే గుట్టపై ఏసీపీ స్థాయి అధికారిని నియమించిన ప్రభుత్వం, ఆలయ భద్రత మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ రోజుల్లో నిత్యం 10వేల నుంచి 15వేల మంది భక్తులు వస్తున్నారు. సెలవు రోజుల్లో 40వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయానికి వీవీఐపీలు, వీఐపీల రాక కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వారితోపాటు భక్తులకు భద్రతా రీత్యా ఎస్పీఎఫ్‌ బలగాలతో బహుళ అంచెల భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు గుట్టపైన మినీ పోలీ్‌సస్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిసింది.

ఫిబ్రవరిలోగా స్వర్ణతాపడం పనులు

స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి చెందిన మెసర్స్‌ స్మార్ట్‌ క్రియేషన్స్‌కు అప్పగించింది. 2025 ఫిబ్రవరిలోగా స్వర్ణతాపడం పనులు పూర్తి చేసేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 10వేల చదరపు అడుగుల మేర బంగారు తాపడం చేయాల్సి ఉంది. చదరపు అడుగుకు రూ.3,900 చొప్పున సదరు సంస్థకు ప్రభుత్వం చెల్లించనుంది. బంగారం తాపడం చేసేందుకు మొత్తం రూ.3.90కోట్లు ఖర్చు కానుంది. స్వామివారి ప్రధానాలయంలోని విమాన గోపురం 10,500 ఎస్‌ఎ్‌ఫటీల మేర ఉంది. దీనికి 60కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఆలయ అధికారుల వద్ద బంగారం తాపడం కోసం భక్తులు సమర్పించి నగదు రూ.20.50కోట్ల మేర ఉంది. భక్తులు స్వామివారికి మొక్కుల రూపంలో చెల్లించిన బంగారం సుమారు 12కిలోల వరకు ఉంది. భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం 10.500 కిలోలు ఉంది. అదేవిధంగా స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి 2,300కిలోల వరకు ఉంది. బంగారంతో పాటు ప్రస్తుతం ఆలయ బ్యాంకు ఖాతాలో ఉన్న విరాళాల నగదుతో 60కిలలో వరకు బంగారం సమకూరే అవకాశం ఉంది. విరాళాల సేకరణ ద్వారా మరిన్ని నిధులు సమకూర్చి పనులు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

యాదగిరిక్షేత్రానికి భద్రత పెంచుతున్నాం : భాస్కరరావు, ఆలయ ఈవో

లక్ష్మీనృసింహుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఆలయానికి వీవీఐపీలు, వీఐపీలతోపాటు భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యాదగిరి క్షేత్రానికి ప్రభుత్వం భద్రత పెంచనుంది. ఆలయానికి కేటాయించిన భద్రతా సిబ్బంది డిసెంబరు తర్వాత పూర్తిస్థాయిలో రానున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 12:54 AM