Share News

ఆశ.. నిరాశల సాగు

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:43 AM

తొలినాళ్లలో కరువుతో రైతులను కష్టాల పాల్జేసినా కృష్ణమ్మ నడికారులో అన్నదాతలను ఆదుకుని వారి మోములో ఆనందాన్ని పారించింది.

ఆశ.. నిరాశల సాగు

మొదట్లో రైతు కంట్లో, ఆపై కాల్వల్లో...

ఏడాది తొలినాళ్లలో బీడువారిన భూములు

కృష్ణమ్మ పరవళ్లతో పసిడి సిరులు

తొలినాళ్లలో కరువుతో రైతులను కష్టాల పాల్జేసినా కృష్ణమ్మ నడికారులో అన్నదాతలను ఆదుకుని వారి మోములో ఆనందాన్ని పారించింది. పంటలకు సెలవిచ్చిన భూములు ముళ్ల కంపలకు నెలవులుగా మారిన సమయంలో సుమారు రెండేళ్లకు సరిపడా నిండుగా కురిసిన వానలు రైతులకు భవిష్యతపై భరోసా కల్పించాయి. సాగునీరు విడుదలై సాగర్‌ ఆయకట్టు పచ్చలహారంలా మారింది. ప్రస్తుతం వానాకాలం పంట నూర్పిళ్లు పూర్తిచేసుకున్న రైతులు యాసంగి నాట్లలో తలమునకలయ్యారు.

(ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ)

వర్షాలు కురవక నాగార్జునసాగర్‌ జలాశయంలో 515 అడుగులకు నీటి మట్టం పడిపోయినప్పటికీ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తారన్న ఆశాభావంతో బోరుబావుల కింద రైతులు గత ఏడాది డిసెంబరు, జనవరిలలో యాసంగి పంటలను సాగు చేశారు. అయితే నీరు విడుదల లేకపోగా, అధికారులు ఆయకట్టుకు క్రాఫ్‌ హాలీడే ప్రకటించారు. కాగా యాసంగి సాగు చేసిన బోరు బావుల రైతుల భూగర్భజలాలు అడుగంటడం, బోర్లు పోయకపోవడంతో పెద్దసంఖ్యలో ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటలను తడుపుకోవడానికి రైతులు నానాతంటాలు పడ్డారు. ఫిబ్రవరి, మార్చి నాటికే చెరువులు ఎండిపోయి బీటలు వారడంతో పశువులకు సైతం నీరందక ఇబ్బందులు ఎదురయ్యాయి. పొట్ట దశలో వరి పైరు వాడుతుండటంతో ఈత వేసిన గింజలు తాలుగా మారి దిగుబడి పూర్తిగా తగ్గింది. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో కొన్నిచోట్ల పంటలను తగులబెట్టారు. ఆయకట్టులో రోజుకు సుమారు 200లకు పైగా రైతులు బోర్లు వేయించగా నీరుపడని పరిస్థితి కనిపించింది. అనేకమంది 7,8 చోట్ల బోర్లు వేసినా చక్కనీరు బయటకు రాక లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోయారు.

కదిలి వచ్చిన కృష్ణమ్మ

ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మ మెల్లగా సాగర్‌కు కదిలివచ్చింది. మే 28 నాటికే అధికవర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా చిరుజల్లులతోనే సరిపుచ్చాయి. కరువు పరిస్థితులు వస్తాయేమోనని రైతులు భయపడుతున్న సంద ర్భంలో కర్ణాటక రాష్ట్రాన్ని జూలైలో భారీ వర్షాలు ముంచెత్తి ఆల్మట్టి డ్యామ్‌లోకి పూర్థిస్థాయిలో నీరుచేరింది. దీంతో దిగువకు నీరు విడుదల చేయడంతో సాగర్‌ ఆయకట్టు రైతులు ఆగస్టుపై ఆశలు నిలుపుకున్నారు. ఆశించిన వర్షాలు రాష్ట్రంలో కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి భారీవరద సాగర్‌కు వస్తుండటంతో ఆగస్టు 2న ఎడమకాల్వకు నీటిని విడుదల చేశారు. కాల్వ ద్వారా నీరు మడికి చేరే సమయానికి ఆగస్టు, సెప్టెంబరులో రాష్ట్రంలో భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాయి. ఈ సీజనలో నాలుగుసార్లు పూర్తిస్థాయిలో సాగర్‌గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు.

కాల్వకట్టల నిర్వహణపై నీలినీడలు

వరుణుడి కరుణతో నాగార్జునసాగర్‌ నిండినా ఎడమకాల్వ నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడం ఆయకట్టుకు శాపంగా మారుతోంది. గతంలో ప్రపంచబ్యాంకు , రాష్ట్ర ప్రభుత్వ నిధులు 4444.41 కోట్లతో కాల్వ ఆధునీకీకరణ మొదలుపెట్టినా నిధులు చాలక కాల్వ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. మట్టికట్టల లైనింగ్‌ పనులు పూర్తికాకపోవడం, తరుచుగా కట్టలు కోతకు గురవడంతో చివరి భూములకు నీరందడం లేదు. కాల్వలో నీరు విడుదల లేని సమయంలో కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు పూర్తి చేయాల్సి ఉండగా, పూర్తికాకపోవడంతో మరో ఏడాది గడువు పొడిగించారు.

డిజైన డిశ్చార్జి కంటే తక్కువ నీరు విడుదల

సాగర్‌ ఎడమకాల్వ డిజైన ప్రకారం 11వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. ఎడమకాల్వ ఆయకట్టు స్థిరీకరణ 10,37,796ఎకరాలు కాగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 6,62,580 ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎడమకాల్వ ద్వారా(లి్‌ఫ్టలతో కలిసి) 3,60, 701 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. కాల్వ కట్టలు బలహీ నంగా ఉండటంతో ఏ రోజూ పూర్తిస్థాయి నీటి విడుదల జరగలేదు. 8 నుంచి 9 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. మేజర్లకు నీటిపారుదల ప్రాంతాన్ని బట్టి 80 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేదు. దీంతో సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

ఎత్తిపోతల నిర్వహణపై...

ఎడమకాలపై మిర్యాలగూడ డివిజనలో ఏర్పాటుచేసిన లిఫ్ట్‌(ఎత్తిపోతల)ల ద్వారా 80వేల ఎకరాలు సాగు నీరు అందించాల్సి ఉంది. అయితే వాటి నిర్వహణ రైతులకు భారంగా మారడంతో వాటి మనుగడ ప్రశ్నా ర్థకమైంది. కాగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో నెల్లికల్‌ ఎత్తిపోతల ద్వారా తొలి దశలో 5,400ఎకరాల నూతన ఆయకట్టుకు, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఐదు లిఫ్ట్‌లకు కొత్తగా ఈ ఏడాది శంకుస్థాపనలు చేశారు. వీటిద్వారా 25వేల ఎకరాల ఆయకట్టు చివరి భూములకు నీరందించాలని సంకల్పించినా, దీర్ఘకాలిక నిర్వహణపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.

గిట్టుబాటు తడబాటు

ధాన్యం ధరల్లో హెచ్చుతగ్గులు రైతును నిలువునా ముంచాయి. సన్నధాన్యానికి క్వింటాకు రూ.500బోనస్‌ ప్రకటించినప్పటికీ కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు ఎక్కువగా మిల్లుపాయింట్ల వద్దకే ధాన్యాన్ని తీసుకెళ్లారు. తొలిదశలో క్వింటాకు రూ.2500 వరకు కొనుగోలు చేసిన మిల్లర్లు ఆ తర్వాత ధర తగ్గించడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ యంత్రాంగం జోక్యంతో మిల్లర్లు దిగివచ్చారు. చివరిదశలో ప్రభుత్వ బోన్‌సతో కలిపి రూ.100 అదనంగా కలిపి రూ.3000 వరకు కొనుగోలు చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 12:43 AM