Share News

వర్షం వస్తే రాకపోకలు బంద్‌

ABN , Publish Date - Oct 29 , 2024 | 12:49 AM

బీబీనగర్‌- భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి- జూలూరు గ్రామాల మధ్యన మూసీపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి.

 వర్షం వస్తే రాకపోకలు బంద్‌
నిలిచిన రుద్రవెల్లి-జూలూరు బ్రిడ్జి పనులు

నాలుగు నెలల క్రితం వంతెన పనులు మొదలు

నెల తిరగకుండానే నిలిపివేత

బీబీనగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్‌- భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి- జూలూరు గ్రామాల మధ్యన మూసీపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం నిలిచిపోయిన పనులు నాలుగు నెలల క్రితం ఎట్టకేలకు తిరిగి పనులు మొదలు కాగా నెల గడవకముందే పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్నట్లు ఆనవాలు కూడా కనిపించడం లేదు. దీంతో ఇక్కడి గ్రామాల ప్రజలకు ఇప్పట్లో మూసీ తిప్పలు తప్పేటట్టు కనిపించడం లేదు. ఇటు వరంగల్‌ అటు విజయవాడ ప్రధాన జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న బీబీనగర్‌- భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి- జూలూరు గ్రామాల మధ్యన మూసీపై దశాబ్దాల క్రితం నిర్మించిన లో లెవల్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. అంతే కాకుండా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ప్రతి ఏటా వర్షాకాలంలో మూసీకి వరదలు వచ్చినప్పుడల్లా ఈ మార్గంలో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. ఇక్కడి ప్రజల అవస్థలను గుర్తించిన గత ప్రభుత్వం ప్రజల ఒత్తిడి మేరకు స్పందించి 2014 నవంబరులో నిధులు మంజూరు చేసింది. బీబీనగర్‌- పోచంపల్లి రోడ్డు విస్తరణకు రూ.22 కోట్లు మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి అదనంగా మరో రూ.4కోట్లు మంజూరు చేసింది. 2016 మార్చి6న అప్పటి జిల్లా మంత్రి జగదీశ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా భూ నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఇక్కడి రైతులు బ్రిడ్జి పనులను అడ్డుకుని నిలుపుదల చేయించారు. కొంత కాలం గా నిర్వాసితులకు పరిహారం అందించినప్పటికి నిధుల లేమితో పిల్లర్ల దశలోనే పనులు ఆగిపోయాయి. ఎనిమిదేళ్లుగా బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో 2023లో కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చాక ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక చొరవతో పనులు ప్రారంభించేలా కృషి చేశారు.

రూ.10.80కోట్లతో పనులు

బీబీనగర్‌ -పోచంపల్లి మార్గంలోని రుద్రవెల్లి -జూలూరు గ్రామాల మధ్యన మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం 10.80కోట్లు మంజూరు చేయగా నిర్మాణ పనులను కాకతీయ కనస్ట్రక్షన కంపెనీ దక్కించుకుంది. మొత్తం 17పిల్లర్లు, 18 కానాలతో 308.53 మీటర్ల పొడవుతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ఏడాది జూలై నెలలో పనులు మొదలు పెట్టిం ది. 9,10 పిల్లర్లకు సంబంధించి పుట్టింగ్స్‌ , కాంక్రీట్‌ పనులతో పాటు ఏడుహెర్త్‌ పనులను తిరిగి ప్రారంభించింది. కాగా నెల రోజులు తిరగకుండానే పనులు నిలిచిపోయాయి. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనులపై అనుమానాలు మొదలయ్యాయి. పనులు చేపట్టినట్టే చేపట్టి ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం నెల రోజులు తిరగకుండానే పనులు నిలిచిపోవడంపై ఇక్కడి ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని బ్రిడ్జి పనులను ప్రారంభించి వేగంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని బీబీనగర్‌, పోచంపల్లి మండలాల ప్రజలు కోరుతున్నారు.

పనుల్లో వేగం పెంచుతాం

బ్రిడ్జి పనులకు వర్కర్లు రాకపోవడంతో పనులు నెమ్మదించాయి. మూసీలో వరద ఉధృతి కారణంగా పనులకు ఆటంకం కలిగింది. పనులు నిలిచిపోలేదు. పండుగ తర్వాత బ్రిడ్జి పనుల్లో వేగం పెంచుతాం.

- లింగయ్య, ఏఈ, ఆర్‌అండ్‌బీ

Updated Date - Oct 29 , 2024 | 12:49 AM