Share News

అక్రమ పట్టాలను రద్దు చేయాలి

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:38 AM

గుండాల మండలం సీతారాంపురం గ్రామంలోని ఎర్రబోళ్ల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరికి ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

అక్రమ పట్టాలను రద్దు చేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అంద జేస్తున్న గ్రామస్థులు

గుండాల, సెప్టెంబరు 6: గుండాల మండలం సీతారాంపురం గ్రామంలోని ఎర్రబోళ్ల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరికి ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని తెలుపుతూ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు శుక్రవారం ఎక్స్‌కవేటర్‌తో భూమిని సేద్యం చేస్తుండడంతో భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వకుండా భూమి ఉన్న వారికి ప్రభుత్వ భూమిని ఎలా ఇస్తుందని పలువురు ప్రశ్నించారు. అక్రమ పట్టాలను రద్దు చేయాలని గ్రామస్థులు ఆందోళన చేసి ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకుని రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అఽధికారులు పనులు నిలిపి వేయించారు. తమకు గత 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం భూమి ఇచ్చిందని తమకు ఇచ్చిన భూమిలో సేద్యం చేసుకుంటున్నామని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా మీ దగ్గర పత్రాలు ఏమి ఉన్నా యో తీసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి రావాలని తాము చెప్పేంత వరకు భూమిని ఎవరూ సేద్యం చేయొద్దని గ్రామస్థులను అధికారులు ఆదేశించారు. ఈ విషయమై తహసీల్దార్‌ జల కుమారిని వివరణ కోరగా గ్రామ శివారులోని ఎర్రబోళ్ల సమీపంలో సర్వేనంబర్‌ 179 లో 75 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమి ఉందని 45 ఎకరాల భూమి ప్రభుత్వం తమకు ఇచ్చిందని కొంత మంది అంటున్నారని, రికార్డులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సీతారాంపురం గ్రామంలోని సర్వేనంబర్‌ 179లోని ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్‌ జల కుమారికి గ్రామస్థులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ 179 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించాలని అనేక సార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు వినతి పత్రాన్ని ఇచ్చామని తెలిపారు. కాగా 45 ఎకరాల భూమి తమకు ఇచ్చారని కొంత మంది అంటున్నారని, వెంటనే అక్రమ పట్టాలను రద్దు చేసి భూమి లేని పేదలకు భూమి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు కూరెళ్ల స్వామి, పాలడ్గు ఉప్పలయ్య, మల్లెపాక సురేష్‌, మొగిలిపాక వేణు, పాలడ్గు రామ్మల్లయ్య, పాలడ్గు స్వామి, శివరాత్రి ఈదయ్య, నరేందర్‌, సంజీవ, బక్కయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:38 AM