వరదలతో తీరని నష్టం
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:44 AM
రైతుల్లో ప్రకృతి ప్రకోపం విషాదాన్ని నింపింది. ఈ ఏడాది సెప్టెంబరు 1న భారీ వర్షం కురిసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 30 సెంటీమీటర్ల వర్షం ఒక్క రాత్రిలో కురవడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది.
రైతుల్లో ప్రకృతి ప్రకోపం విషాదాన్ని నింపింది. ఈ ఏడాది సెప్టెంబరు 1న భారీ వర్షం కురిసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 30 సెంటీమీటర్ల వర్షం ఒక్క రాత్రిలో కురవడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వాగులు, వంకలకు గండ్లుపడ్డాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. కోట్లాది రూపాయల పంట నష్టంతో పాటు ప్రజాధనం, అన్నదాతల శ్రమ భారీ వర్షాలకు కకావిలకమైంది.
(ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్)
అకాల భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఎన్నడూ లేనివిధంగా ఆస్తి, పంటనష్టాలు చోటుచేసుకున్నాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ముక్త్యాల బ్రాంచ కాల్వకు రెండు చోట్ల, ప్రధాన ఎడమకాల్వపై నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం సమీపంలోని 132వ కిలోమీటరు, అదేవిధంగా ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం 134వ కిలోమీటర వద్ద గండ్లు పడ్డాయి. పాలేరు రిజర్వాయరు నీరు వెనక్కి రావడంతో నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద కాల్వ తెగి రత్నవరం, నడిగూడెం ప్రాంతంలో రెండు వేల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగింది.100 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రస్తుతం ఇసుక మేటలు వేసిన పొలాలు అలాగే ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం నడిగూడెం మండలంలో 210ఎక రాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదికలు అందించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎడమ కాల్వకు అనుసంధానమైన ముక్త్యాల బ్రాంచ్ కాల్వపై 14.63వ కిలోమీటరు వద్ద యూటీ పక్కన గండిపడి వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అదేవిధంగా 22వ కిలోమీటర్ వద్ద ఆధునీకరణ చేసిన చోట కోతకు గురికాగా 24వ కిలోమీటరు వద్ద మరో గండిపడింది. 14వ కిలోమీటరు వద్ద గండితో కరక్కాయలగూడెం, మర్రిగూడెం, బూరుగడ్డ, గోపాలపురం, లింగగిరి, శ్రీనివాసపురం, అమరవరం, యాతవాకిళ్ళ ప్రాంతాల్లోని చాలాఎకరాల్లో పంట దెబ్బతింది. అదేవిధంగా భారీ వర్షాలకు కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు, కోదాడ మండలం తొగర్రాయి తదితర గ్రామాలతో పాటు హుజూర్‌నగర్ నియోజక వర్గం గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల్లో భారీగా పంట నష్టం జరిగింది.
కొండంత నష్టం..
భారీ వరదలకు సూర్యాపేట జిల్లాలో జరిగిన నష్టానికి అధికారుల అంచనాకు పోలిక లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 9,800 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 10,993మంది రైతులకు రూ.9.80కోట్లు పరిహారంగా అందజేశారు. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువుకు గండిపడి సుమారు 1000ఎకరాలకు పైనే పంట నష్టం జరిగింది. అదేవిధంగా హుజూర్‌నగర్ పట్టణ పరిధిలోని బట్టవారికుంట చెరువుకట్ట తెగి 400 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఎంబీ కెనాల్ పరిధిలోని 14వ కిలోమీటరు వద్ద గండితో 800 ఎకరాలలో పంటనష్టం జరిగింది. ఈ గండి వల్లే బూరుగడ్డ నల్లచెరువుకు గండిపడి వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వరదలకు 30వేల ఎకరాలు కొట్టుకుపోయినట్లు రైతుసంఘాలు పేర్కొంటున్నాయి. రూ.30 కోట్లు పరిహారం అందించాల్సి ఉండగా మూడో వంతు మాత్రమే రైతులకు పరిహారం అందించారని ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద ప్రధాన కాల్వకు పడిన గండిని 20 రోజులకు పూర్తి చేయగలిగారు. దీంతో పాటు నాయకన్‌గూడెం వద్ద గండిని కూడా పూడ్చడంలో అధికారులు తీవ్ర జాప్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కాగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో తెగిన ఎడమ కాల్వ ప్రాంతాలను మూడుసార్లు సందర్శించారు. గంటల తరబడి సమీక్షించి పనుల్లో వేగం పెంచేలా చూశారు. అయినప్పటికీ అధికారులు గండిపూడ్చవేతలో జాప్యం చేశారన్న విమర్శలు వచ్చాయి. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సైతం నెలరోజుల పాటు కాల్వలు, చెరువులు, పొలాలను, రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులను పర్యవేక్షించి పూర్తి చేసేందుకు నిరంతరం శ్రమించారు.
రూ.10 వేలతో చేతులు దులుపుకున్నారు
సూర్యాపేట జిల్లాలో వరద సహాయం కింద ఎకరానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా నేటికీ ఒక్క రూపాయి కేటాయించకపోవడం శోచనీయం. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయి. 30వేల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగింది. కానీ అధికారులు 10వేల ఎకరాలకే రూ.10వేలు ఇవ్వడం అపహాస్యం చేయడమే.
గన్నా చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు