Share News

పరిహారం సరే ఇంటిస్థలమేదీ?

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:39 AM

రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం వైటీడీఏ ద్వారా స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఆలయ సింహద్వారానికి ఎదురుగా ఉన్న రోడ్డును విస్తరించిం ది.

పరిహారం సరే ఇంటిస్థలమేదీ?

ఆందోళనలో గుట్ట రోడ్డు బాధితులు

బస్‌ డిపో ప్రాంతంలో స్థలం కేటాయిస్తూ ఐదేళ్ల క్రితం ప్రొసీడింగ్స్‌

కొత్త బస్‌ డిపో నిర్మాణం చేయకపోవడంతో పాత స్థలంలోనే కొనసాగింపు

పాత డిపో ప్రాంతం ఖాళీ అయితేనే బాధితులకు స్థలాలు

ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్‌: రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం వైటీడీఏ ద్వారా స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఆలయ సింహద్వారానికి ఎదురుగా ఉన్న రోడ్డును విస్తరించిం ది. అందులో భాగంగా ఈ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు, ఇళ్లను తొలగించింది. అందుకు పరిహారంతోపాటు ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని నాటి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు నిర్వాసితుల కు పరిహారం ఒక్కటే చెల్లించగా, ఇంటి స్థలాల కేటాయింపు ఉసే లేదు.

పాతగుట్ట చౌరస్తా నుంచి ఆలయ సింహద్వారం వరకు రహదారికి ఇరువైపులా చిరువ్యాపారాలు చేసుకుంటూ పలు కుటుంబాలు ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. అయితే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఈ రహదారిని గత ప్రభుత్వం విస్తరించింది. రోడ్డు విస్తరణతో 139 కుటుంబాలు ఇళ్లు, దుకాణాలను పూర్తిగా కోల్పోయారు. వీరికి పరిహారంతోపాటు ఇంటి స్థలాన్ని ఇస్తామని గత సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ తరువాత బాధితులకు పరిహారం ఒక్కటే అందింది. ఇంటి స్థలాన్ని ఇవ్వకపోవడంతో బాధితులు అద్దె ఇళ్లలో ఉంటూ నెలనెలా వేల రూపాయలను అద్దెగా చెల్లిస్తున్నారు. మరోవైపు వీరి ఉపాధి కూడా పోయింది. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక బాధితులు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్యకు మొరపెట్టుకున్నారు. దీంతో 137 మందికి స్థానిక దేవస్థానం కొండకింద ప్రాంతంలో నిర్మించిన దుకాణాల సముదాయంలో మడిగెలను కేటాయించింది. గుట్ట ఆర్టీసీ బస్‌డిపోకు సైదాపురం గ్రామం పరిధిలో స్థలాన్ని కేటాయించారు. అయితే డిపో నిర్మాణానికి రూ.30కోట్లు కేటాయించాల్సి ఉండగా, నేటికీ విడుదల కాలేదు. కొత్త డిపో నిర్మాణం కాకపోవడతో. పాత డిపోను నేటికీ తొలగించలేదు. అయితే డిపోను తొలగించి ఇక్కడ రహదారి బాధితులకు..200 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తూ గత ప్రభుత్వం రెవెన్యూశాఖ ద్వారా ఐదేళ్ల క్రితం ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. అయితే బస్‌డిపోను ఖాళీ కాకపోవడంతో బాధితులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా డిపోను ఖాళీ చేసి స్థలాన్ని తమకు స్వాధీనం చేయాలని బాధితులు కోరుతున్నారు.

త్వరలో ప్రభుత్వ విప్‌కు విన్నవిస్తాం

గిరిధర్‌, రోడ్డు బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి

రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితుల కోసం గతంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్యను కలిశాం. దీంతో దేవస్థానం బాధితులకు దుకాణాలు కేటాయించింది. అయితే ఇళ్ల స్థలాల విషయమై మరోసారి ప్రభుత్వ విప్‌ను కలుస్తాం. త్వరగా స్థలాలు వచ్చేలా కృషి చేస్తాం.

పరిహారం ఖర్చవుతోంది: గోర్ల జ్యోతిరవీందర్‌, బాఽధితురాలు

రోడ్డు విస్తరణలో నష్టపోయిన మాకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అయితే సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. దీంతో అద్దె రూపంలో పరిహారం సొమ్ము ఖర్చవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలాన్ని వెంటనే మాకు అప్పగించాలి.

ఆర్టీసీ డిపో తరలింపునకు ఆదేశాలు లేవు: శ్రీనివా్‌సగౌడ్‌, డీఎం

ఆర్టీసీ డిపోను మరోచోటికి తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. డిపో తరలింపు విషయంపై రాష్ట్రస్థాయి అధికారుల వద్దే పూర్తి సమాచారం ఉంటుంది.

Updated Date - Oct 23 , 2024 | 12:39 AM