‘సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తుంది కమ్యూనిస్టులే
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:56 AM
రామన్నపేటలో ఏర్పాటుకు ప్రతిపాదించిన సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడుతోంది కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జెల్లెల పెంటయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ అన్నారు.
రామన్నపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రామన్నపేటలో ఏర్పాటుకు ప్రతిపాదించిన సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడుతోంది కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జెల్లెల పెంటయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించేలా లెఫ్ట్ పార్టీలపై తప్పుడు రాతలు రాసినందుకు నిరసనగా రామన్నపేటలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామన్నపేటలో అదానీ గ్రూపునకు సంబంధించిన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా మొదటినుంచీ ప్రజలను చైతన్యం చేస్తున్నది కమ్యూనిస్టులేనన్నారు. మండల కేంద్రంలో సదస్సు నిర్వహించి అఖిలపక్షాలను ఆహ్వానించి, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది కమ్యూనిస్టు పార్టీలేనని తెలిపారు. పరిశ్రమకు వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించింది కమ్యూనిస్టులే అన్నారు. పత్రికలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలని, తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచురించరాదని అన్నారు. 15నిమిషాల ఆందోళన చేసిన అనంతరం పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ నిరసనలో సీపీఎం, సీపీఐ నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, ఊట్కూరి కృష్ణ, కందుల హనుమంతు, కల్లూరి నగేష్, బాలరాజు, భాగవంతం, నాగటి ఉపేందర్, గొరిగె సోములు, మునికుంట్ల లెనిన, వెంకటేశ్వర్లు, సత్యం, భిక్షం పాల్గొన్నారు.