Share News

సాంబనే రారాజు

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:40 AM

కొన్నేళ్ల క్రితం వర్షాధారంగా జొన్నలు, సజ్జలు వంటి పంటలు సాగయ్యేవి. ఆ తరువాత కాలంలో నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి చెందింది. బీడు భూముల్లో కృష్ణమ్మ అడుగుపెట్టింది. నాటి నుంచే వరి సాగు ప్రారంభమైంది. నాడు కొన్ని వరి రకాలు మాత్రమే ఉండేవి.

సాంబనే రారాజు

మూడు దశాబ్దాలుగా సిరులు కురిపిస్తున్న వరి రకం

వానాకాలంలో క్వింటాకు రూ.2,820 గిట్టుబాటు

మిర్యాలగూడ(వ్యవసాయం), నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ల క్రితం వర్షాధారంగా జొన్నలు, సజ్జలు వంటి పంటలు సాగయ్యేవి. ఆ తరువాత కాలంలో నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి చెందింది. బీడు భూముల్లో కృష్ణమ్మ అడుగుపెట్టింది. నాటి నుంచే వరి సాగు ప్రారంభమైంది. నాడు కొన్ని వరి రకాలు మాత్రమే ఉండేవి. అన్నీ దొడ్డు రకాలే. తెగుళ్లను ఏ మాత్రం తట్టుకునేవి కావు. దిగుబడులు కూడా బాగా తక్కువ. ఈ రకాల సాగు చేసిన రైతులకు ప్రయోజనం అంతగా ఉండేది కాదు. అప్పుడు పుట్టుకొచ్చిందే సాంబ మసూరి (బీపీటీ-5204) రకం. ఆ రోజుల్లో ఇదో సంచలనం. నేటికీ ఈ రకం ధాన్యం హవానే ఉమ్మడి జిల్లాలో సాగుతోంది.

సాంబమసూరి రాకతో వరి సాగులో విప్లవం

వ్యవసాయ పరిశోధనల్లో 1980 ముందు వరకు పెద్దగా పురోగతి లేదు. దశాబ్ద కాలం నాటి సంప్రదాయ వరి వంగడాలనే రైతులు సాగు చేసేవారు. కాల పరిమితి కూడా ఎక్కువగా ఉండేది. గింజ బరువుకు పంట పడిపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు పంట తట్టుకోలేకపోవడం, బియ్యం లావు కావడంతో తినడానికి కొంత ఇబ్బందిగా ఉండటంతోపాటు రైతులకు అంతగా ప్రయోజనం కూడా ఉండేది కాదు. హరిత విప్లవం తరువాత దేశ వ్యాప్తంగా హైబ్రిడ్‌ విత్తనాల రూపకల్పన ఊపందుకుంది. వరిలో విస్తృత పరిశోధనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ఎంవీ.రెడ్డి ఆధ్వర్యంలో వరి రకాలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. చివరికి 1986లో బీపీటీ-5204 (సాంబమసూరి) వరి రకాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనికి బాపట్ల పేరు కలిసివచ్చేలా బీపీటీగా నామకరణం చేశారు.

రైతులకు సిరులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 12.68లక్షల ఎకరాలలో వరి పంట సాగు కాగా, అందులో ప్రైవేటు రకాలు 65శాతం, సాంబమసూరి 20శాతం, దొడ్డు రకాలు 15 శాతం ఉన్నాయి. సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో అత్యధికంగా ప్రైవేట్‌ రకాలు సాగయ్యాయి. ఈ రకాలకు తెగుళ్లు వ్యాపించడంతో పెట్టుబడులు పెరిగాయని, ఎకరానికి 30-35బస్తాలకు మించి దిగుబడి రాకపోవడంతో మిగులుబాటు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ రకాల ధాన్యం అతి సన్నగా ఉండటంతో పంట నూర్పిడి కాగానే ధాన్యం ఆరబెడితే (17తేమ శాతం) ఎకరానికి 4-5 బస్తాలు తూకం తగ్గుతుంది. రైతులు పంట నూర్పిడి అనంతరం పచ్చి ధాన్యాన్ని (25-30శాతం) నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఈ ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ దక్కకపోవడంతో క్వింటాకు రూ.2,320లు మాత్రమే ధర లభిస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాంబమసూరి సమృద్ధిగా పండింది. తెగుళ్ల వ్యాప్తి లేదు. పెట్టుబడులు బాగా తగ్గాయి. ఎకరానికి 45-50బస్తాలు (31.5-35క్వింటాళ్లు) వరకు దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాంబమసూరి వరి ఆరబెట్టే రకం కావడంతో ధాన్యం అంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. క్వింటాకు మద్దతు ధర రూ.2,320తోపాటు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్‌ వస్తోంది. అంటే క్వింటా ధాన్యానికి రూ.2,820ల వరకు ధర వచ్చినట్టు లెక్క. ఎకరానికి 45-50 బస్తాలు దిగుబడికి రూ.88,830 నుంచి రూ.98,700 వరకు ఆదాయం వస్తోంది. ఈ వానాకాలం సీజన్‌లో సాంబమసూరి సాగుచేసిన రైతులు గణనీయమైన ఆదాయం గడించారు.

వానాకాలం అంటే బీపీటీ

సాంబమసూరి వరి రకం రూపకల్పన జరిగి ఇప్పటికి 38 ఏళ్లు. నాటి నుంచి సాగర్‌ ఆయకట్టుతో పాటు వివిధ ప్రాజెక్టు ల కింద వానాకాలంలో సాంబమసూరి రకం మాత్రమే సాగు జరిగేది. ఈ పంట సాగు చేసిన రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. దశాబ్దాలుగా ఈ రకానికి తిరుగు లేకుండా పోయింది. ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నా, ఇప్పటి వరకు సాంబమసూరి రకానికి ప్రత్యామ్నాయ వంగడాన్ని రూపకల్పన చేయలేకపోయారు. మూడు దశాబ్దాలుగా వందలాది రకాలు విడుదల చేసినా, ఏవీ కూడా ఇంత లా మార్కెట్‌లో ప్రాచూర్యం పొందలేకపోయాయి. ఈ మధ్య కాలంలో హెచ్‌ఎంటీ, చింట్లు వంటి ప్రైవేట్‌ రకాలు మార్కెట్లో ప్రవేశించి లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నాయి. ఈ దశలోనూ సాంబమసూరి రకాన్ని రైతులు సాగు చేస్తూనే ఉన్నారు.

సాంబమసూరి ప్రత్యేకతలివీ..

జీఈబీ-24, టిన్‌-1, మసూరి వరి రకాల జన్యువులను సంకరం చేయ డం ద్వారా సాంబమసూరి రకాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.

సాంబమసూరి కాలపరిమితి 145-150 రోజులు.

మధ్యస్థ సన్న ధాన్యం.

ఎకరాకు దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

కిలో ధాన్యానికి 675 గ్రాముల బియ్యం వస్తుంది.

ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటుంది.

తెగుళ్ల వ్యాప్తిని కూడా తట్టుకునేలా శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.

బియ్యం రుచిగా కూడా ఉంటుంది.

నీటి ఎద్డడి ఉన్న ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఈ రకం వరి సాగవుతోంది.

దేశ వ్యాప్తంగా 40లక్షల హెక్టార్లలో సాంబ సాగవుతోంది.

సాంబమసూరి సాగుతో మంచి ఆదాయం

అనుముల శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, త్రిపురారం

ప్రతి వానాకాలంలో సాంబమసూరిని రకం వరిని సాగు చేస్తున్నా. ఈ రకానికి తెగుళ్ల వ్యాప్తి, పెట్టుబడి బాగా తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఆరు ఎకరాల్లో సాగు చేయగా ఎకరానికి 45-50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించా. మద్దతు ధరతో పాటు బోనస్‌ వస్తుండటంతో మంచి ఆదాయం వస్తోంది. ప్రైవేట్‌ రకాలకంటే సాంబమసూరి సాగు చేసిన రైతులు చాలా ఆనందంగా ఉన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:40 AM