Share News

బాలలకు బంగారు బాల్యాన్నిద్దాం..

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:33 AM

ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా బాల్యవివాహాల వంటి సాంఘిక దురాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆడ, మగ పిల్లల మధ్య వ్యత్యాసా లు అలాగే ఉన్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు, బాలబాలికలిద్దరూ సమానమేననే నినాదం మాటలకే పరిమితమైంది.

బాలలకు బంగారు బాల్యాన్నిద్దాం..

ఇంకా కొనసాగుతున్న సాంఘిక దురాచారాలు

బాల్యవివాహాలు, బాల కార్మికవ్యవస్థతో బందీ అవుతోన్న పిల్లలు

నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా..

(ఆంధ్రజ్యోతిప్రతినిధి- నల్లగొండ): ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా బాల్యవివాహాల వంటి సాంఘిక దురాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆడ, మగ పిల్లల మధ్య వ్యత్యాసా లు అలాగే ఉన్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు, బాలబాలికలిద్దరూ సమానమేననే నినాదం మాటలకే పరిమితమైంది. జిల్లాలో గత 14 ఏళ్లుగా ప్రభుత్వం సంరక్షించిన బాలల్లో బా లికల శాతమే ఎక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. జిల్లా లో 2011 నుంచి ఇప్పటివరకు వేర్వేరు దురాగాతాల నుంచి కాపాడిన బాలలు 1,597 మంది ఉంటే, వారిలో బాలికలే 1187 మంది ఉండడం వివక్ష, వేధింపులు, హక్కుల హననం లో బాలికలే ఎక్కువ బాధితులుగా ఉన్న విషయం రూఢీ అవుతోంది.

బాలబాలికల సంరక్షణకోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నా, ఎన్నో చట్టాలు ఉన్నా ప్రజల్లో చైతన్యం లేకపోవడం, దారిద్య్రం, మూఢనమ్మకాలవంటి ప్రభావాలతో బాలలహక్కుల హననం కొనసాగుతోంది. బాలబాలికలకు యుక్తవయసు వచ్చేంతవరకు వారికి హక్కులు, భద్రత, రక్షణ, చదువు, పౌష్టికాహారం, విజ్ఞానాన్ని అందించడాన్ని బాధ్యతగా తీసుకున్న ప్రభుత్వం జిల్లాలోనూ పలు పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా బాలలహక్కుల పరిరక్షణకు తోడ్పడుతోంది. గత పదేళ్లతో పోల్చుకుంటే బాలలహక్కుల హననాన్ని చాలావరకు తగ్గించగలిగామని, ప్రజలంతా ఈ విషయంలో చైతన్యవంతులైతే ఉన్నత ఫలితాలొస్తాయని అధికార యంత్రాంగం చెబుతోంది. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు, అనాథ పిల్లల సంరక్షణ చర్యలు, పోషకాహార సరఫరాకు తీసుకుంటున్న చర్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం

జిల్లాలో ప్రభుత్వం చేరదీసిన పిల్లల సంఖ్య 1597 మంది

జిల్లాలో 2011లో బాలల హక్కుల పరిరక్షణ సమితిని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,597 మందిని ప్రభుత్వం వేర్వేరు ఇబ్బందుల నుంచి సంరక్షించి వారిని కాపాడింది. వీరిలో ప్రధానంగా బాల్యవివాహాల బారినుంచి రక్షించగా, లైంగికదాడులకు గురైన వారు, బాలకార్మికులు, పాక్షిక అనాథలు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలున్నారు. ఈ ఒక్క ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 21మందిని బాల్యవివాహాల బారినుంచి కాపాడితే, మరో 21 మంది బాలకార్మికులను గుర్తించి సంరక్షించారు.

అనాథలను సంరక్షించేందుకు..

వేర్వేరు కారణాలతో అనాథలైన పిల్లలను సంరక్షించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అనాథలు, పాక్షిక అనాథలు, వేధింపులకు గురైన పిల్లలు, ఇతరత్రా బాధితులైన పిల్లలను చేరదీసి వారిని సంరక్షించే నిమిత్తం జిల్లాలో ఎనిమిది అనాథ శరణాలయాలు కొనసాగుతున్నాయి. వీటిలో రెండింటిని ప్రభుత్వం నిర్వహిస్తుంటే, మిగిలిన ఆరింటిని స్వచ్ఛంద సేవాసంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బాలసదనంలో బాలికలకు వసతి కల్పిస్తుంటే, శిశుగృహలో బాలలబాలికలకు సంరక్షణ కల్పిస్తున్నారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమాలు ఆరింటిలో నాలుగు బాలికలుద్దేశిస్తే, మిగిలిన రెండింటిలో బాలురకు వసతి, విద్యాబోధన అందిస్తున్నారు. జిల్లా శిశుగృహలో ఆరుగురు పిల్లలు ప్రస్తుతం ఆశ్రయం పొందుతుంటే, బాలసదనంలో 31మంది బాలికలున్నారు. మిగిలిన ఆరింటిలో 129 మంది బాల, బాలికలున్నారు.

చైల్డ్‌హెల్ప్‌లైన్‌ 1098 ద్వారా 24గంటల సేవలు

పిల్లలు ఏ సందర్భంలోనైనా, ఏక్షణంలోనైనా వేధింపులకు పాల్పడ్డా, బాధించబడుతున్నా, లేక వదిలేయబడినా అలాంటివారిని సంరక్షించే నిమిత్తం ప్రభుత్వం చైల్డ్‌హెల్ప్‌లైన్‌ 1098ని అందుబాటులోకి తెచ్చింది. జిల్లా కేంద్రంలోని శిశురక్ష కార్యాలయం నుంచే ఈ హెల్ప్‌లైన్‌ని నిర్వహిస్తోంది. ఈ నెంబర్‌కు ఫోన్‌ వస్తే తక్షణమే స్పందించి సం బంధిత పిల్లలను రక్షించి హోమ్‌కు చేర్చి, ఆ తర్వాత వారికి అవసరమైన సంరక్షణ, విద్యాభ్యాసం, వైద్యం అందిస్తారు. పిల్లల సంరక్షణకు, హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా వారిని రక్షించేందుకు, వారిని ఆ ఆపద నుం చి కాపాడేందుకు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 సర్వీ్‌సని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

గ్రామాల్లో విలేజ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు

జిల్లాలో బాలల హక్కుల సంరక్షణ నిమిత్తం సర్పంచుల అధ్యక్షతన 493 గ్రా మాల్లో విలేజ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తరచూ గ్రా మంలో పర్యటించి బాల్యవివాహాలు జరగకుండా నిరోధించడంతో పాటు, బాలకార్మికులుంటే గుర్తించడం, వారిని పనిమాన్పించి స్కూళ్లకు పంపాల్సి ఉంటుంది. పిల్లలకు అవసరమైన ఆహార, విద్యావసతులు అందించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుంది. గ్రామాల్లో పిల్లలకు ఇబ్బందులు ఎదురైతే వారి గురించి తెలుసుకొని వారి పరిధిలోబడి సహాయ సహకారాలు అందజేయాలి. స్థాయి మించి యెడల ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి.

లైంగికదాడులకు లోనైన పిల్లలకు ఆర్థిక తోడ్పాడు

లైంగికవేధింపులకు లోనైన పిల్లలకు సైతం ప్రభుత్వం ఆర్థికంగా పరిహారమందిస్తోంది. గరిష్ఠంగా రూ. లక్షవరకు సహాయం చేస్తోంది. ఎఫ్‌ఐఆర్‌ నమో దైనప్పుడు 23 శాతం, చార్జిషీట్‌ దాఖలు చేసినప్పుడు మరో 25శాతం ఇస్తూ, కేసు జడ్జిమెంట్‌ వచ్చినప్పుడు మిగిలిన 50 శాతం పరిహారం బాధితులకు అందజేస్తారు. లైంగికదోపిడీ తీ వ్రతను బట్టి పరిహారం ఉంటుంది. జిల్లాలో 2012 నుంచి ఇటీవల వరకు పెండింగ్‌ ఉన్న 976 కేసులకు సంబంధించి ఇటీవ ల ప్రభుత్వం సుమారు 2.10 కోట్ల పరిహారమందించగా, జి ల్లాలో సంచలనం కలిగించిన ఒకే కేసులో 18 మంది బాధితులకు రూ.18లక్షలను కూడా అందజేశారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు ‘మిషన్‌ పరివర్తన’

ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌, మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల జోలి కి వెళ్లకుండా పిల్లల్లో ప్రధానంగా టీనేజీ పిల్లల్లో అవగాహన కల్పించేందుకు పోలీ్‌సశాఖ, బాలల హక్కుల పరిరక్షణ సమితితో కలిసి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్‌ పరివర్తన కార్యక్రమం అమలుచేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద పోలీస్‌, షీ టీమ్‌లు, అధికారులతో కలిసి కాలేజీలు, హైస్కూళ్లలో సదస్సులు, సమావేశాలు నిర్వహించి దురలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.

అంగన్‌వాడీ ద్వారా పోషకాహార పంపిణీ

తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పిల్లలకు పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు పోషకాహార పంపిణీని చేపట్టింది. గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లికి ప్రసవం అయ్యేంత వరకు ప్రతీ రోజూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక పూట సంపూర్ణ ఆహారాన్ని అందిస్తున్నారు. గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, పప్పు, ఒక కూరతో కలిపి ఈ భోజనం అందిస్తారు. దీనిద్వారా తల్లితో పాటు గర్భస్థ శిశువుకు పోషకాహారం అందుతుంది. పుట్టిన పిల్లలకు గంటలోనే ముర్రుపాలు తాగిస్తారు. ఆ తర్వాత పుట్టిన పిల్లలకు టీటీ మొదలుకొని రెండేళ్ల వయస్సు వచ్చేంత వరకు సంబంధిత టీకాలను అందిస్తారు. అంతేకాకుండా ఆరునెలల పాటు పిల్లలకు తల్లిపాలను అందిస్తారు. ఆ తర్వాత అన్నప్రాసన నిర్వహించి పిల్లలకు తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారాన్ని కూడా అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్నారు. భావి భారతపౌరులైన పిల్లలు ఆరోగ్యకరంగా పెరిగేలా చూడడమే ఏకైక లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

అనాథ పిల్లల కోసం ‘మిషన్‌ వాత్సల్య’

జిల్లాలో వివిధ కారణాల వల్ల అనాథలుగా మారి న పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం ‘మిషన్‌ వాత్స ల్య’ పథకాన్ని అమలుచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకంలో ఎంపికైన పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున వారి సంరక్షకులకు అందుతాయి. అనాథ, పాక్షిక అనాథ పిల్లలను చదు వు మాన్పించకుండా, హాస్టళ్లలో ఉంచకుండా వారి ఇంటి వద్ద నుంచే, లేక సంరక్షకుల ఇంటి వద్ద నుంచే స్కూల్‌కి వెళ్లి చదువుకునే అనాథ పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. పిల్లలకు ఇంటి వాతావరణం కోల్పోకుండా ఇంటి వద్ద నుంచే స్కూల్‌కి వెళ్లి చదువుకునేందుకు, తల్లిదండ్రులు లేకపోయినా వారికి ఆర్థికపరమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఈపథకం నిర్ధేశించారు. పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పథకం అమలవుతుంది. నల్లగొండ జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు 282 మంది పిల్లలు నమోదయ్యారు.

బాలకార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జనవరి, జూన్‌లో ఆపరేషన్‌ ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ పేరుతో ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. పోలీసులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి ఆ ధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కమిటీలు ఆ నెలల్లో తమకున్న సమాచారంతో పాటు, విస్తృతంగా జిల్లాలో పర్యటించి పనిచేసే పిల్లలను గుర్తిస్తారు. వారిని తీసుకువచ్చి పాఠశాలలు, బ్రిడ్జి స్కూళ్లు, ఇతర రెసిడెన్షియల్స్‌కు పంపిస్తున్నారు. జిల్లా లో 2015 నుంచి ఇప్పటివరకు 2722 మంది చిన్నారులను బాలకార్మిక దుస్థితి నుంచి కాపాడారు.

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : కృష్ణవేణి, జిల్లా మహిళ, శిశు, సంక్షేమశాఖ అధికారి

నేటి బాలలే రేపటి పౌరులు. ప్రతీ బాలబాలిక ఉత్తమ పౌరులుగా ఎదగడం వారి హక్కు. జీవించడానికి, నివసించడానికి, చదువుకోవడానికి, రక్షణ పొందడానికి వారికి హక్కులు ఉన్నాయి. వారి హక్కులను భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలుంటాయి. పిల్లలను దేశసంపదగా అందరం గుర్తించాలి. అనివార్య పరిస్థితుల్లో అనాథలయ్యే పిల్లలను సైతం ప్రభుత్వం ఆదరించి అన్ని వసతులు, సదుపాయాలు వారికి కల్పిస్తుంది. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోంది. జిల్లాలో మా శాఖ ద్వారా బాలల కోసం ఉద్దేశించిన అన్ని పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసేలా చూస్తున్నాం.

బాలల సంక్షేమమే ధ్యేయంగా అందరం కృషి చేయాలి : చింత కృష్ణయ్య, చైర్మన్‌, జిల్లా బాలల సంక్షేమ కమిటీ

బాలల సంక్షేమమే ధ్యేయంగా అందరిలో చైతన్యం రావాల్సి ఉంది. గతంతో పోల్చుకుంటే చాలా వరకు బాల్య వివాహాలు, బాలకార్మికులు తగ్గిపోయారు. ఈ దురాచారాలు పూర్తిగా లేకుండా పోవాలి. ప్రభుత్వం బాలల హక్కులు, సంరక్షణ, వృద్ధి కోసం అమలు చేసే పథకాలను వారి దరి చేర్చేందుకు అందరం అంకితభావంతో పనిచేస్తున్నాం. బాలల దినోత్సవ సందర్భంగా బాలలహక్కుల పరిరక్షణకు మరోసారి ప్రతినబూనుతాం.

Updated Date - Nov 14 , 2024 | 12:33 AM